ప్రజాస్వామ్యం, దాని వ్యవస్థలను బలోపేతం చేయడంపైనే దేశ భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురాం రాజన్ వ్యాఖ్యానించారు. దేశ ఆర్థిక పురోగతికీ ఇది కీలకమని పేర్కొన్నారు. నిరుద్యోగ సంక్షోభాన్ని పక్కదారి పట్టించేందుకు మైనార్టీలను లక్ష్యంగా చేసుకుంటే శ్రీలంక పరిస్థితులే తలెత్తుతాయని హెచ్చరించారు. 5వ ఆలిండియా ప్రొఫెషనల్స్ కాంగ్రెస్ సదస్సులో ఆయన మాట్లాడారు. మైనార్టీలను ద్వితీయ శ్రేణి పౌరులుగా మార్చేందుకు చేసే ఎలాంటి ప్రయత్నమైనా దేశాన్ని ముక్కలు చేస్తుందని హెచ్చరించారు. శ్రీలంకలో సరిపడా ఉద్యోగాలు కల్పించడంలో విఫలమై.. దాన్ని కప్పిపుచ్చేందుకు మైనారిటీలను లక్ష్యంగా చేసుకుని దాడులు జరుగడం వల్లే అక్కడ ప్రస్తుత పరిస్థితులు ఏర్పడ్డాయని తెలిపారు. మన దగ్గర ఆర్థిక వనరులు ఉండటంతో ఆ పరిస్థితులు రాబోవని చెప్పారు.
