పశ్చిమ బెంగాల్ లో టీచర్ల నియామకాల అవకతవకల్లో అరెస్టైన మంత్రి పార్థా ఛటర్జీ విషయంలో నటి అర్పితా ముఖర్జీ ఈడీ ముందు సంచలన విషయాన్ని వెల్లడించారు. కేసు దర్యాప్తు సమయంలో తన ఇంట్లోంచి ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్న 20 కోట్ల కరెన్సీ అంతా మంత్రి పార్థా ఛటర్జీదేనని సంచలన ప్రకటన చేశారు. ఈడీ కస్టడీలోనే ఆమె ఈ విషయాన్ని అంగీకరించారు. అంతేకాకుండా టీచర్ల నియామకాలకు సంబంధించిన లావాదేవీల కోసం వారు 12 నకిలీ సంస్థలను కూడా నడుపుతున్నట్లు తెలిపారు. మరోవైపు పార్థా, అర్పిత కలిసి.. ఓ ఆస్తిని కొనుగోలు చేశారని, దానికి సంబంధిత డాక్యుమెంట్ ను స్వాధీనం చేసుకున్నామని ఈడీ ప్రకటించింది. ఇక… గ్రూప్ సీ, గ్రూప్ డీ ఉద్యోగ నియామకాలకు సంబంధించిన అడ్మిట్ కార్డులు, ఫైనల్ ఫలితాలు, అపాయింట్ మెంట్ లెటర్లు అర్పిత ఫ్లాట్ లో దొరికాయని ఈడీ తెలిపింది.
మరోవైపు మంత్రి పార్థాకు దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలున్నాయని, కానీ… ఆస్పత్రిలో చేరాల్సిన అవసరం మాత్రం లేదని భువనేశ్వర్ లోని ఎయిమ్స్ పేర్కొంది. తాము క్షుణ్ణంగా పరీక్షలు చేశామని, దీర్ఘకాలిక వ్యాధులున్నాయని, ఎయిమ్స్ డైరెక్టర్ అశుతోశ్ తెలిపారు. ఇప్పటికిప్పుడు ఆస్పత్రిలో మాత్రం చేరాల్సిన అవసరం లేదన్నారు. మంత్రి ఆరోగ్య పరిస్థితుల నేపథ్యంలో ఆయనను ఎయిర్ అంబులెన్స్ ద్వారా భువనేశ్వర్ ఎయిమ్స్ కు తీసుకెళ్లాలని కోల్ కత్తా హైకోర్టు ఈడీని ఆదేశించింది. ఈ కారణంగానే ఈడీ అధికారులు మంత్రి పార్థాను ఇక్కడికి తీసుకొచ్చారు.