Telugu Abroad

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  teluguabroad.com@gmail.com 

జమ్మూకశ్మీర్‌లో రియల్‌ పెట్టుబడి అవకాశాలు!

నరేంద్ర మోదీ 2.ఓ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చాక తీసుకున్న విప్లవాత్మక నిర్ణయాల్లో ప్రధానమైంది ఆర్టికల్‌ 370, 35 (ఏ)లను రద్దు చేయడమే! దీని ప్రయోజనాలు ఒక్కో రంగం మీద ఒక్కోలా ఉంటే.. రియల్‌ ఎస్టేట్‌ రంగం మీద మాత్రం సానుకూలంగా ఉంది. జమ్మూకశ్మీర్‌ ప్రత్యేక హోదా రద్దుతో ఇక్కడ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపార అవకాశాలు ఎలా ఉన్నాయో ఓసారి చూద్దాం!
చదరపు అడుగుకు రూ.2,200
జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక హోదాను ఉపసంహరణ చేశాక.. స్థానిక కశ్మీర్‌వాసులు వాళ్ల ప్రాపర్టీలను విక్రయించేందుకు ముందుకొస్తారు. దీంతో రియల్‌ ఎస్టేట్‌ ధరలు పెరిగే అవకాశముంది. దేశంలోని ద్వితీయ శ్రేణి నగరాల్లో ప్రాపర్టీ ధరలు ఎంతైతే ఉన్నాయో.. ప్రస్తుతం శ్రీనగర్‌లో అలాంటి ధరలే ఉన్నాయి. ప్రస్తుతమక్కడ చదరపు అడుగుకు రూ.2,200 నుంచి రూ.4000 మధ్య ఉన్నాయని ప్రముఖ ప్రాపర్టీ కన్సల్టెన్సీ అనరాక్‌ తెలిపింది. స్థానికంగా ప్రాపర్టీల విలువలు పెరుగుతాయి. దేశంలోని ఇతర మెట్రో ప్రాంతాలు, నగరాల నుంచి పెట్టుబడిదారులు జమ్మూకశ్మీర్‌ ప్రాపర్టీల్లో పెట్టుబడి పెట్టేందుకు అవకాశం ఉంటుంది. అయితే ప్రస్తుతం జమ్మూకశ్మీర్‌ రియల్‌ ఎస్టేట్‌ మార్కెట్‌ను అంచనా వేయడం అంత ఈజీ కాదని, తొందరపాటని అనరాక్‌ ప్రాపర్టీ కన్సల్టెన్సీ చైర్మన్‌ అనూజ్‌ పురీ తెలిపారు.

రాజకీయ పరిస్థితులు ఎలా ఉంటాయో..
రాబోయే కొన్ని నెలల్లో స్థానికంగా పరిస్థితులు పూర్తి స్థాయిలో అర్థమవుతాయి. అప్పుడే రియల్టీ పెట్టుబడులపై స్పష్టత వస్తుంది. అయితే దేశంలోని ఇతర నగరాల్లో మాదిరిగా జమ్మూకశ్మీర్‌లోనూ వెంటనే పెట్టుబడులు రాకపోవచ్చు. ఎందుకంటే ఇప్పటికీ స్థానికంగా పరిస్థితులు చక్కబడలేదు. ఇప్పటికే రియల్‌ ఎస్టేట్‌ మార్కెట్‌ నిధుల కొరతలో ఉంది. ఇలాంటి తరుణంలో కశ్మీర్‌ వంటి సమస్యాత్మక ప్రాంతంలో పెట్టుబడులు పెట్టేందుకు డెవలపర్లు సాహసించకపోవచ్చు. మరొక ఏడాది కాలంలో స్పష్టత వచ్చే అవకాశముందని ప్రాప్‌ఈక్విటీ ఫౌండర్‌ అండ్‌ సీఈఓ సమీర్‌ జాసుజా అభిప్రాయపడ్డారు. ఉదాహరణకు గోవాను తీసుకోండి. పన్‌జిమ్, ఉత్తర గోవాలోని కొన్ని ప్రాంతాలను తీసుకోండి. ఇక్కడ ముంబై, బెంగళూరు వంటి ఉత్తర భారతీయులు ప్రాపర్టీలను కొనుగోలు చేశారు. దీంతో ఉత్తర గోవా భౌగోళిక రూపురేఖలు మారిపోయాయి. బయటి వ్యక్తుల పెట్టుబడులు వస్తే స్థానికంగా విభిన్న రకాల అభివృద్ధి జరుగుతుంది. దీంతో ప్రొఫైల్‌ మారుతుందని నైట్‌ఫ్రాంక్‌ ప్రాపర్టీ కన్సల్టెన్సీ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ ముదాసిర్‌ జైదీ తెలిపారు.
రెరా చట్టంతోనే భద్రత..
జమ్మూకశ్మీర్‌లో ప్రాపర్టీల క్రయవిక్రయాలు జరపడం అనేది అత్యంత సున్నితమైన అంశం. భద్రత, ఆందోళన పరమైన అంశాలు ముడిపడి ఉంటాయి. కశ్మీర్‌లో పరిస్థితులు కుదుటపడ్డాక.. రియల్టీ పెట్టుబడిదారులు, కొనుగోలుదారులకు భద్రత, భరోసా కల్పించాలంటే రియల్‌ ఎస్టేట్‌ రెగ్యులేటరీ అథారిటీ (రెరా) వంటి చట్టాల అమలు తప్పనిసరి చేయాలని సూచించారు. జమ్మూకశ్మీర్‌ సున్నితమైన ప్రాంతం కాబట్టి అస్పష్టతలు తొలగడానికి ఇంకా సమయం పడుతుంది. స్థానికంగా ఏర్పడబోయే రాజకీయ పరిణామాలు, వాటి ఫలితాల మీద ఆధారడి రియల్టీ పెట్టుబడులు ఆధారపడి ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.

ఎక్కడ పెట్టుబడులు బెటర్‌ అంటే?
జమ్మూకశ్మీర్‌లో హోలిడే హోమ్స్, అద్దె గృహాలు, ఆఫీస్, కమర్షియల్, రిటైల్‌ స్పేస్‌లలో పెట్టుబడులకు అపారమైన అవకాశాలుంటాయి. లడఖ్‌ పర్యాటక ప్రాంతం. ఇక్కడ ఆతిత్య రంగంలో పెట్టుబడులు వచ్చే అవకాశముంది. గుల్‌మార్గ్, శ్రీనగర్, పెహల్గామ్‌ వంటి ప్రాంతాల్లో హోటల్స్, హోలిడే హోమ్స్‌ పెట్టుబడులకు సరైన ప్రాంతాలు. మాకాన్‌.కామ్‌ వెబ్‌సైట్‌లో శ్రీనగర్‌లోని భగాటీ కానీపోరాలో 2101 చదరపు అడుగుల ఫ్లాట్‌ ధర రూ.75 లక్షలుగా ఉంది. క్వికర్‌లో నవాకడాల్‌లో 4 బీహెచ్‌కే ధర రూ.1.8 కోట్లుగా ఉంది. రాజ్‌భాగ్‌లో 3 బీహెచ్‌కే ధర రూ.42.9 లక్షలుగా ఉంది.
ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లతో..
జమ్మూకశ్మీర్, లడఖ్‌ ప్రాంతాలు అభివృద్ధి అవకాశాలున్న నగరాలు. స్థానికంగా ఉన్న సహజ వనరులు, అపారమైన నైపుణ్యత కలిగి ఉంది. స్థానిక వ్యాపారులను ప్రభుత్వం, వర్తక, వాణిజ్య పరిశ్రమలు ప్రోత్సహిస్తే మరింత అభివృద్ధికి అవకాశముంటుంది. దీంతో స్థానిక అభివృద్ధితో పాటూ ఉద్యోగ అవకాశాలు మెరుగవుతాయి. యాపిల్, కుంకుమ, బాదం వంటి ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్ల స్థాపన, ప్రైవేట్‌ రంగాల భాగస్వామ్యంతో ఆరోగ్య సంరక్షణ, విద్యా సౌకర్యాల ఏర్పాటు వంటివి కల్పించాలి.
ఆస్తి హక్కులు ఉంటాయ్‌..
ఆర్టికల్‌ 35 (ఏ)ను సవాల్‌ చేస్తూ చారువలీ ఖన్నా, సీమా రజ్దాన్‌ భార్గవ్‌తో కలిసి సుప్రీంకోర్ట్‌లో పిటీషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ‘‘కాశ్మీరేతరులను వివాహం చేసుకున్న ఒక తరం ఉంది. వీరందరికీ వారి రాష్ట్రంలో హక్కులు లేవు. ఇది కేవలం ఆస్తి హక్కు కోసమే కాకుండా ఉపాధి హక్కుల గురించి కూడా ఉంది. చాలా మంది చదువుకున్న కాశ్మీరీ బాలికలు ఉద్యోగాల కోసం వేరే రాష్ట్రాలకు వెళ్లారు. వారంతా కాశ్మీరేతరులను వివాహం చేసుకుంటే వారి పిల్లలకు కూడా హక్కులు నిరాకరించబతాయని’’ చారువలీ పిటీషన్‌లో పేర్కొన్నారు. అయితే ఇప్పుడు 35 (ఏ) ఆర్టికల్‌ రద్దుతో కాశ్మీరేతరులను వివాహం చేసుకున్న కాశ్మీరీ మహిళలకు కూడా ఆస్తి హక్కులు కల్పించబడతాయి. అయితే దీని మీద మరింత స్పష్టత రావాల్సిన అవసరముందని నిపుణులు చెబుతున్నారు.

Related Posts

Latest News Updates