తెలంగాణలో తాము అధికారంలోకి వస్తే భైంసాను దత్తత తీసుకుంటామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రకటించారు. భైంసాకు భరోసా కల్పించేందుకు ఈ యాత్ర అని ప్రకటించారు. బండి సంజయ్ తన ప్రజా సంగ్రామ యాత్ర ను భైంసా నుంచి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించారు. తెలంగాణలో వచ్చేది బీజేపీ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు. ప్పుడు ఎన్నికలు జరిగినా ఈ రాష్ట్రంలో కాషాయం జెండా రెపరెపలాడాలని బండి సంజయ్ అన్నారు. తాము అధికారంలోకి రాగానే బైంసాలోని బీజీపే కార్యకర్తలపై నమోదైన అక్రమ కేసులు, పీడీ యాక్ట్ లను ఎత్తివేస్తామని హామీ ఇచ్చారు.
ఈరోజు బీజేపీని బైంసాకు రాకుండా నిషేధించారని, బైంసా ఏమైనా పాకిస్తాన్, బంగ్లాదేశ్, అప్ఘనిస్తాన్ లో ఉందా? అని బండి సంజయ్ ప్రశ్నించారు. బైంసాకు రావాలంటే వీసా తీసుకుని రావాలా? అని నిలదీశారు. రాష్ట్రాన్ని సీఎం కేసీఆర్ అప్పులు పాలుజేశారని, మళ్లీ కేసీఆర్ గనక సీఎం అయితే.. 5 లక్షల కోట్లు అప్ప చేస్తారని మండిపడ్డారు. తాము అధికారంలోకి వస్తే.. ఉచిత విద్య, వైద్యం అందిస్తామని ప్రకటించారు. భైంసాలో హిందూ సమాజం భయపడాల్సిన అవసరం లేదని, బీజేపీ అండగా వుంటుందని ప్రకటించారు.