Prapancha Telugu

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  info@prapanchatelugu.com

శిథిలావస్థలో బీజేఆర్‌ భవన్‌

అందరికీ అందుబాటులో ఉండే మినీ వేదికగా, సాంస్కృతిక కార్యక్రమాల నిలయంగా, మంచి లక్ష్యంతో ఏర్పాటు చేసిన బాబు జగ్జీవన్‌రామ్‌ భవన్‌ అటు అధికారులు, ఇటు ఎమ్మెల్యేలు పట్టించుకోకపోవటంతో క్రమంగా శిథిలావస్థకు చేరుకుంటోంది. కొత్తపేటలో ప్రధాన రహదారిపై ఏర్పాటు చేసిన బాబు జగ్జీవన్‌రామ్‌ భవన్‌ సాంఘిక, సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో నడుస్తున్న విషయం తెలిసిందే. దీనికి స్థానిక ఎమ్మెల్యే చైర్మన్‌గా వ్యవహరిస్తుంటారు. భవనంలో జరిగే కార్యక్రమాలతో ఇప్పటి వరకు దాదాపు రూ.70 లక్షల మేర నిధులు చేరాయి. ఉద్యోగులకు సాంఘిక, సంక్షేమ శాఖ నుంచే జీతాలు అందుతాయి. 
అరకొర వసతులతో అవస్థలు…
17 సంవత్సరాల క్రితం నిర్మించబడిన బీజేఆర్‌ భవన్‌కు నేటికీ వసతులు సక్రమంగా లేవు. ప్రధానంగా తాగునీటి సమస్య ఇక్కడి వారిని వేధిస్తోంది. నిత్యం ట్యాంకర్ల ద్వారా నీటిని తెప్పించుకోవాల్సి వస్తోంది. భవనం ఆవరణలో ఏర్పాటు చేసిన బోరు వేసవిలో పూర్తిగా ఎండిపోవటం గమనార్హం. ఇక వర్షం పడిందంటే పైఅంతస్తు నుంచి ఆడిటోరియంలోకి, వరండాలోకి పెద్ద ఎత్తున వరద నీరు చేరుతోంది. హాల్లో కొన్నేళ్ల క్రితం వేసిన కుర్చీలు, ఫ్యాన్‌లు పనిచేయక శిథిలావస్థకు చేరాయి. ఇందులో పనిచేసే సిబ్బంది పాడైపోయిన వాటికి తాత్కాలిక మరమ్మతులు చేపట్టి కాలం వెళ్లదీస్తున్నారు. భవనానికి బోరు మంజూరైనా వేయించలేని పరిస్థితి నెలకొంది. సాంఘిక, సంక్షేమ శాఖ అధికారులు పట్టీపట్టనట్లు వ్యవహరిస్తున్నారు. వారికి అవసరమైన సమావేశాలను మాత్రం హడావుడిగా నిర్వహించుకుని వెళ్ళిపోవటం, తరువాత దీని గురించి మరిచిపోవటం వంటివి ఇక్కడ సర్వసాధారణం. 

నిధులు ఉన్నా అభివృద్ధి శూన్యం..
బాబు జగ్జీవన్‌రామ్‌ భవన్‌ అభివద్ధికి కావాల్సినన్ని నిధులు రూ.70 లక్షల మేర ఉన్నా చైర్మన్‌గా వ్యవహరిస్తున్న ఎమ్మెల్యే సంతకం పెడితేగానీ నిధులు విడుదల కావు. కానీ గతంలో ఎమ్మెల్యేగా వ్యవహరించిన తీగల కృష్ణారెడ్డి పట్టించుకోక పోవటంతో భవనం మరమ్మతులపై దృష్టిపెట్టలేదు. ప్రస్తుతం ఎమ్మెల్యేగా గెలిచిన సబితా ఇంద్రారెడ్డి  సైతం బీజేఆర్‌ భవన్‌పై శీతకన్ను వేయటంతో భవనం అభివృద్ధి కుంటుపడింది. ఇప్పటికైనా సంబంధిత అధికారులు, ఎమ్మెల్యే చొరవ తీసుకుని ఆడిటోరియంకు అవసరమైన వసతులు కల్పించటంతో పాటు సందర్శకులకు, కార్యక్రమ నిర్వాహకులకు ఎలాంటి ఇబ్బందులు, లోటు రానీయకుండా చూడాల్సి బాధ్యత ఉంది. గతంలో బీజేఆర్‌ భవనం అభివృద్ధికి అధికారులు నిధులు మంజారుయ్యాయని కొలతలు తీసుకుపోయారు కానీ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉంది.
మరమ్మత్తులే..
బాబు జగ్జీవన్‌రావ్‌ భవన్‌ అభివృద్ధి చేయవలసిన అధికారులు దానిని మరచి.. ఎస్‌టీ అభివృద్ధి శాఖ కార్యాలయం మరమ్మతులు కోసం రూ.లక్ష వెచ్చించారు. కొత్త ఫర్నిచర్‌ కొనుగోలు చేశారు. కానీ భవనంలో కావలసిన వసతులు కల్పించడంలో అధికారులు, భవనం ఇన్‌చార్జిగా ఉన్న ఎస్‌టీ అభివృద్ధి శాఖ అధికారి పట్టించుకోకపోవడంతో భవనం రోజు రోజుకు కళావిహీనం అవుతోంది. ఇప్పటికై బీజేఆర్‌ భవనంపై స్థానిక ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి, సాంఘిక సంక్షేమ అధికారులు దృష్టి పెట్టి మరమ్మతులు చేయాలని స్థానికులు, దళిత సంఘాలు కోరుతున్నాయి.

Related Posts

Latest News Updates