Telugu Abroad

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  teluguabroad.com@gmail.com 

మచాన్‌ ట్రీ, ట్రెయిన్, హంటెండ్‌ హౌజ్‌ ఆగింది!

ట్యాంక్‌ బండ్, లుంబినీ పార్క్, ఎన్‌టీఆర్‌ గార్డెన్, పీపుల్స్‌ ప్లాజా, నెక్లెస్‌ రోడ్, సంజీవయ్య పార్క్‌ వంటి వినోద కేంద్రాలన్నీ వెలవెలబోతున్నాయి. సందర్శకులు, పిల్లలు, విద్యార్థులు, ప్రేమికులతో కిలకిలలాడే ప్రాంతాలన్నీ బోసిపోతున్నాయి. ఎందుకంటే ఆయా సందర్శనీయ ప్రాంతాల్లో వినోద, ఆట వస్తువులన్నింటినీ రద్దు చేయడమే! హుస్సేన్‌ సాగర్‌ అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ కోసం ఏర్పాటు చేసిన బుద్ధ పూర్ణిమ ప్రాజెక్ట్‌ అథారిటీ (బీపీపీఏ) ఆయా ప్రాంతాల్లోని టెండర్లన్నింటినీ రాత్రికి రాత్రే క్యాన్సిల్‌ చేసేసింది.

రోడ్డున పడ్డ కుటుంబాలు..
లుంబినీ పార్క్‌లో బోటింగ్, టవర్, క్యాంటీన్, ఐమ్యాక్స్‌ పక్కన, ఎదురుగా ఉన్న పార్కింగ్, ఎన్‌టీఆర్‌ గార్డెన్‌లో హంటెడ్‌ హౌజ్, టాయ్‌ ట్రెయిన్, టవర్, మచాన్‌ ట్రీ, క్యాంటీన్, నెక్లెస్‌ రోడ్, పీపుల్స్‌ ప్లాజా, సంజీవయ్య పార్క్‌లల్లోని క్యాంటీన్స్‌ టెండర్లను రద్దు చేశారు. వీటిల్లో సుమారు 30 మంది వెండర్లు, 400 మంది పని చేస్తుంటారు. క్యాంటీన్, బోటింగ్, టవర్, టాయ్‌ ట్రెయిన్, మర్రి చెట్టు వంటి ఆట వస్తువులను నిలిపి వేయడంతో వాటిల్లో పనిచేసే ఉద్యోగులకు సడెన్‌గా ఉపాధి లేకుండా పోయింది. దీంతో దినసరి కూలీ లేక ఆయా కుటుంబాలు రోడ్డున పడ్డాయి.
ప్రభుత్వ ఆదాయానికి గండి..
లుంబినీ పార్క్, ఎన్‌టీఆర్‌ గార్డెన్, నెక్లెస్‌ రోడ్, పీపుల్స్‌ ప్లాజా, సంజీవయ్య పార్క్‌లకు వారానికి 50 వేల మంది సందర్శకులు వస్తుంటారు. వారాంతాల్లో అయితే తాకిడి మరింత ఎక్కువగా ఉంటుంది. ఈ ఏడాది మే నెలాఖరు నుంచి ఆయా ప్రాంతాల్లోని వినోద వసతులు, ఆట వస్తువులు, క్యాంటీన్స్‌ అన్నింటినీ నిలిపి వేశారు. తాజాగా ఐమ్యాక్స్‌ ఎదురుగా, పక్కన ఉన్న పార్కింగ్‌ టెండర్‌ను కూడా రద్దు చేశారు. దీంతో సందర్శకులు సంఖ్య కూడా తగ్గింది. గత నెల రోజులుగా వారానికి 15 వేలు కూడా దాటట్లేదు. టెండర్ల రద్దుతో ప్రతి నెలా ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం కూడా గండి పడుతుంది. నెలకు లుంబినీ పార్క్‌ నుంచి రూ.20 లక్షలు, ఎన్‌టీఆర్‌ గార్డెన్‌లో రూ.30 లక్షలు, నెక్లెస్‌ రోడ్‌లో రూ.10 లక్షలు, పీపుల్స్‌ ప్లాజాలో రూ.15 లక్షల, ఐమ్యాక్స్‌ పార్కింగ్‌లో రూ.15 లక్షలు వరకు వచ్చే ఆదాయం ఆగిపోయింది.


కొత్త టెండర్లకు స్పందన కరువు..
సాధారణంగా కొత్త టెండర్లు వచ్చే లోపు పాత వాటిని కంటిన్యూ చేస్తుంటారు. కానీ, బీపీపీఏ మాత్రం అర్ధంతరంగా టెండర్లను క్యాన్సిల్‌ చేసింది. ఆయా ఆట వస్తువులను వెంటనే అక్కడి నుంచి తొలగించేయాలని టెండర్‌దారులపై ఒత్తిడి చేస్తున్నారని  టెండర్‌ యజమాని వాపోయారు. ఇదిలా ఉంటే అర్ధంతరంగా రద్దు చేసిన టెండర్ల స్థానంలో కొత్త వాటికి ఆహ్వానించింది బీపీపీఏ. అయితే స్పందన మాత్రం శూన్యం. సాధారణంగా టెండర్‌ దక్కించుకున్న వాళ్లు సెక్యూరిటీ డిపాజిట్‌గా మూడు నెలల అద్దె, 1 నెల అడ్వాన్స్‌ చెల్లించాల్సి ఉంటుంది. కానీ, కొత్త టెండర్లలో సంవత్సరం అద్దె డిపాజిట్‌ ఒకేసారి చెల్లించాలనే నిబంధన ఉండటంతో ఎవరూ ముందుకు రాలేదు. నెల అద్దె రూ.9 లక్షలుగా ఉంటుంది. దీనికి జీఎస్‌టీ అదనం.
రూ.11 వేలకే విజయ డైరీకి ఓకే..
సాధారణంగా ఎక్కువ ధరకు ఎవరు టెండర్‌ వేస్తారో వాళ్లకు టెండర్‌ దక్కుతుంది. కానీ, బీపీపీఏలో దీనికి రివర్స్‌. నెక్లెస్‌ రోడ్, ఎన్‌టీఆర్‌ గార్డెన్, సంజీవయ్య పార్క్‌లో క్యాంటీన్‌ ఏర్పాటుకు ఓ ప్రైవేట్‌ వ్యక్తి రూ.2 లక్షలకు టెండర్‌ వేస్తే.. దీన్ని కాదని విజయ డైరీకి రూ.11 వేల టెండర్‌కు ఓకే చేశారు. పోనీ, ఆదాయం విజయ డైరీకి పోతుందా అంటే అదీ లేదు. ఈ టెండర్స్‌ను సబ్‌ కాంట్రాక్ట్‌ కింద విజయ డైరీ ప్రైవేట్‌ ఏజెన్సీకి ఇచ్చింది. ఈ ఏజెన్సీ బీపీపీఏలోని ఓ ఉన్నతాధికారి బంధువుది అని సమాచారం. ప్రస్తుతం విజయ డైరీకి నెక్లెస్‌ రోడ్‌లో నాలుగు, ఎన్‌టీఆర్‌ గార్డెన్, సంజీవయ్య పార్క్‌లో ఒక్కో క్యాంటీన్‌ ఉంది.
బీపీపీఏ చరిత్ర క్లుప్తంగా..
ఏపీ అర్బన్‌ ఏరియాస్‌ డెవలప్‌మెంట్‌ యాక్ట్‌–1975 ప్రకారం మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ మరియు అర్బన్‌ డెవలప్‌మెంట్‌ (ఎంఏ అండ్‌ యూడీ) డిసెంబర్‌ 12, 2000 సంవత్సరంలో బుద్ధ పూర్ణిమ ప్రాజెక్ట్‌ అథారిటీ (బీపీపీఏ)ను ఏర్పాటు చేసింది. స్పెషల్‌ డెవలప్‌మెంట్‌ కింద హుస్సేన్‌ సాగర్, దాని చుట్టుప్రక్కల ప్రాంతాల అభివృద్ధి దీని లక్ష్యం. హైదరాబాద్‌ మెట్రో డెవలప్‌మెంట్‌ అథారిటీ (హెచ్‌ఎండీఏ)లో ప్రత్యేక విభాగంగా బీపీపీఏ పనిచేస్తుంది. బీపీపీఏ 902 హెక్టార్ల బీపీపీఏ విస్తరించి ఉంది.

Related Posts

Latest News Updates