Prapancha Telugu

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  info@prapanchatelugu.com

క్లెమ్యాక్స్‌ చేరిన థియేటర్లు

ఐదు దశాబ్దాల పాటు సినీ ప్రేక్షకులను ఉర్రూతలూగించిన వెండితెర వెలుగులు మసకబారుతున్నాయి. మారుతున్న ఆధునిక సాంకేతికను అందిపుచ్చుకోలేని ఇక్కడి అలనాటి సినిమా థియేటర్లు క్రమేణా మూతపడుతున్నాయి. వీధివీధినా సినిమా టాకీసులకు నిలయంగా ఉండే సికింద్రాబాద్‌ నగరంలో ప్రస్తుతం మూడు సినిమా థియేటర్లకు పరిమితం అయింది. కొన్ని థియేటర్లు కాలగర్భంలో కలిసిపోయి వ్యాపార వాణిజ్య కేంద్రాలుగా రూపాంతరం చెందాయి. మరికొన్ని థియేటర్లు మూతపడి పాత జ్ఞాపకాలుగా మిగిలిపోయి ఉన్నాయి. 
కొత్త సినిమా సందడి..
సికింద్రాబాద్‌లో మొత్తంగా ఇరవై థియేటర్ల వరకు ఉండేది. 1955 మొదలు 2000 సంవత్సరం వరకు ఇక్కడి సినిమా థియేటర్ల హవా కొనసాగింది. కొత్త సినిమా మొదలైదంటే చాలు 1975–1995 వరకు లష్కర్‌ రహదారుల్లో ప్రేక్షకుల జాతర ఉండేది. సికింద్రాబాద్‌ చుట్టుపక్కల జిల్లాలకు చెందిన ప్రేక్షకులు వారి అభిమాన హీరోల చిత్రాలను వీక్షించేందుకు ఇక్కడికి వచ్చేవారు. బస్సులతోపాటుగా సైకిళ్లుపై ఎక్కువ మంది ప్రేక్షకులు వచ్చేవారు.

 కేరాఫ్‌ అడ్రస్‌లుగా..
సికింద్రాబాద్‌ నగరానికి పలు సినిమా టాకీసులు కేరాఫ్‌ అడ్రస్‌లుగా కొనసాగాయి. ఇప్పటికీ ఆయా ప్రాంతాల్లో థియేటర్లు లేకపోయినా అవే పేర్లు వాడకంలో ఉన్నాయి. సంగీత్‌ చౌరస్తా, అజంతా బస్‌స్టాప్, మనోహర్‌ థియేటర్‌ సర్కిల్, నటరాజ్‌ థియేటర్‌రోడ్, ప్యారడైజ్‌ సర్కిల్, ప్లాజా రోడ్డు తదితర పేర్లు సికింద్రాబాద్‌లో ఇప్పటికీ వాడకంలో ఉన్నాయి. ఈ పేర్లు అన్నీ ఒకప్పుడు వెండితెర వెలుగులు వెలిగించిన సినిమా థియేటర్లవి కావడం గమనార్హం. 
ఫస్ట్‌ థియేటర్‌ ‘రాజేశ్వరి’
మోండా మార్కెట్‌లోని రాజేశ్వరి థియేటర్‌ సికింద్రాబాద్‌లో ఏర్పాటైన మొదటి థియేటర్‌గా ఈ ప్రాంత ప్రజలు చెబుతున్నారు. 1950 కాలంలో ఈ థియేటర్‌ నిర్మించారు. ఇది ప్రారంభైన తరువాతి రోజుల్లో అంజలి, చిత్రాణి, మినర్వా, మనోహర్, ప్యారడైజ్, ఆనంద్, అలంకార్, ప్లాజా, ప్రశాంత్, నటరాజ్, సంగీత్, మంజు తదితర థియేటర్లు అందుబాటులోకి వచ్చాయి. 1975 నాటికి సికింద్రాబాద్‌ నగరంలో 20 థియేటర్లు వెలిశాయి.1990 నుంచి క్రమేణా సినిమా థియేటర్లు మూత పడడం ప్రారంభం అయింది. 
లేడీస్‌ స్పెషల్‌ ‘అంజలి’
సికింద్రాబాద్‌ జనరల్‌బజార్‌లోని అంజలి థియేటర్‌కు మూడు దశాబ్దాల క్రితం పెట్టింది పేరు. ఈ థియేటర్‌లో ఎక్కువ మట్టుకు కుటుంబ కథా చిత్రాలే నడిచేవి. ఇక్కడి మార్కెట్‌కు వచ్చే మహిళలు వారి షాపింగ్‌ అయ్యాక అంజలిలో సినిమా చూసివెళ్లడం రివాజుగా ఉండేది. మహిళలు ఎక్కువ సంఖ్యలో సినిమాలు చూస్తున్న కారణంగా అంజలి థియేటర్‌ను ఆ కాలంలో లేడీస్‌ స్పెషల్‌ ధియేటర్‌గా పిలిచేవారు. 
నడుస్తున్నవి మూడే…
సినిమా థియేటర్లకు పెట్టింది పేరుగా ఉన్న సికింద్రాబాద్‌లో ్రçపస్తుతం మూడు థియేటర్లలో మాత్రమే సినిమా ప్రదర్శనలు జరుగుతున్నాయి. స్టేషన్‌రోడ్డులోని ప్రశాంత్, ఎస్‌డీ రోడ్డులోని మంజు, జనరల్‌ బజార్‌లోని అంజలి థియేటర్లలో ప్రస్తుతం సినిమా ప్రదర్శనలు జరుగుతున్నాయి. ప్రేక్షకులకు వసతుల లేమి కారణంగా కొత్త సినిమాలు విడుదలైన ఒకటి రెండు రోజుల్లో మాత్రమే ఈ థియేటర్ల వద్ద ప్రేక్షకుల సందడి కనిపిస్తుండగా… ఆ తరువాత వెలవెలబోయి కనిపిస్తున్నాయి.
నేటి ‘ప్యారడైజ్‌’ నాటి థియేటర్‌
సికింద్రాబాద్‌లో ప్యారడైజ్‌ అనగానే ఈ తరం వాళ్లకు గుర్తువచ్చేది అక్కడ ఆ పేరుతో ఉన్న హోటల్‌. అందులోకి ఘుమఘుమలాడే బిర్యానీ. కానీ 1960–70 కాలంలో అది ఒక వెలుగు వెలిగిన ప్యారడైజ్‌ సినిమా థియేటర్‌. అందులో ఆకాలం నుంచి కేఫ్‌ ఉండేది. థియేటర్‌లో ఉన్న కేఫ్‌ను సహజంగానే ప్యారడైజ్‌ కేఫ్‌ అని పిలిచేవారు. కాలక్రమేణా ప్యారడైజ్‌ థియేటర్‌ మూతపడిపోగా అందులోని కేఫ్‌ మాత్రం సుప్రసిద్ధ హోటల్‌గా వర్థిల్లుతుంది. థియేటర్‌ ఆనవాళ్లు కోల్పోయి బహుళ అంతస్తుల నిర్మాణాలు వెలువగా…అక్కడ వెలసిన ప్యారడైజ్‌ హోటల్‌లో 2 వేల మంది సిబ్బంది పనిచేస్తున్నారు.
మొండిగోడల ‘సంగీత్‌’..
సికింద్రాబాద్‌లోని అన్ని థియేటర్లలో సంగీత్‌ థియేటర్‌ ప్రత్యేకత సంగీత్‌దే. సౌండ్‌ సిస్టం ఈ సిస్టం ప్రత్యేకత. డాల్బీ, స్టీరియో ఫోనిక్‌ తదితర అత్యాధునిక సౌండ్‌ సిస్టమ్‌ను ఈ థియేటర్‌ యజమానులే ప్రేక్షకులకు అందుబాటులోకి తెచ్చారు. హిందీ సినిమాలకు ప్రత్యేకతగా ఉన్న సంగీత్‌ థియేటర్‌ను 12 సంవత్సరాల క్రితం యజమానులు నేలమట్టం చేశారు. ఇక్కడ మల్టీప్లెక్స్‌ నిర్మాణం కోసం భారీ భవంతులను నిర్మించారు. కారణాలు ఏవైనా అర్థాంతరంగా మల్టీప్లెక్స్‌ నిర్మాణాలు ఆగిపోయి పదేళ్లు దాటింది. 

మల్టీప్లెక్స్‌తో మళ్లీ కళ….
కొద్ది రోజుల్లో లష్కర్‌కు మల్టీప్లెక్స్‌ సినిమా కళ తీరనుంది. సంగీత్‌ థియేటర్‌ స్థానంలోనే తొలి మల్టీప్లెక్స్‌ వస్తుందనుకున్న లష్కర్‌ ప్రేక్షకుల ఆశలు అడియాశలయ్యాయి. కారణాలేవైనా సంగీత్‌ మల్టీప్లెక్స్‌గా మారే అవకాశాలు ఇప్పట్లో కానరావడం లేదు. ప్యాట్నీ సెంటర్‌లోని విశాలమైన స్థలంలో మల్టీప్లెక్సుతోపాటు భారీ షాపింగ్‌ కాంప్లెక్సు నిర్మాణం వేగవంతంగా జరుగుతుంది. ప్యాట్నీ సెంటర్‌లోని చందన బ్రదర్స్‌ భవనం స్థలంలో మల్టీపెక్సు థియేటర్ల నిర్మాణం జరుగుతుంది. కొద్దినెలల్లోనే లష్కర్‌ ప్రేక్షకులకు మల్టీప్లెక్సు పేరుతో అధునాతన సినిమా థియేటర్లు అందుబాటులోకి రానున్నాయి.
ఆనవాళ్లు కోల్పోయిన థియేటర్లు
సికింద్రాబాద్‌లోని చాలా థియేటర్ల పేర్లు వాడుకలో ఉన్నప్పటికీ ఆ థియేటర్ల ఆనవాళ్లు మాత్రం లేకుండా పోయాయి. 
– ఎస్‌డీ రోడ్డులోని అంజలి థియేటర్, ఎస్‌పీ రోడ్డులోని ఆనంద్‌ థియేటర్‌ల భవనాలను నేలమట్టం చేశారు. ప్రస్తుతం ఖాళీ స్థలాలుగా ఉన్నాయి.  
– ఎస్‌డీ రోడ్డులోని మినర్వా థియేటర్‌ స్థలంలో అదే మినర్వా పేరుతో భారీ వ్యాపార బహుళ అంతస్తుల భవనం వెలసింది. 
– కర్బలామైదానంలోని చిత్రాణి, సమీపంలోని డిస్ట్రిలరీ రోడ్‌లోని అలంకార్‌ థియేటర్ల స్థలాల్లో భారీ బహుళ అంతస్తుల భవనాలు నిర్మించారు. 
– ఎస్‌పీ రోడ్డులోని ప్లాజా థియేటర్‌ స్థలంలో సుబ్బరామిరెడ్డి భవనం వచ్చేసింది. 
శిథిల భవనాలుగా మారి…
మూతపడిన పలు సినిమా థియేటర్ల శిథిల భవనాలు సికింద్రాబాద్‌లో దర్శనం ఇస్తున్నాయి. 
– మార్కెట్‌లో మూతబడిన రాజేశ్వరి థియేటర్‌కు తాళం వేసిన నిర్వాహకులు, ముందుగల ఖాళీ స్థలంలో వాహనాల పార్కింగ్‌కు వినియోగిస్తున్నారు. 
– ప్యాట్నీ సెంటర్‌లోని నటరాజ్‌ థియేటర్‌ భవనంలో కొద్ది సంవత్సరాలుగా ఫర్నీచర్‌ మార్కెట్‌ అందుబాటోలకి వచ్చింది. 
– స్టేషన్‌రోడ్డులో మాస్‌ సినిమాల థియేటర్‌గా వెలుగొందిన మనోహర్‌ థియేటర్‌ శిథిలావస్థకు చేరి మూతపడింది. కొద్ది సంవత్సరాలుగా థియేటర్‌ భవనం ఖాళీగానే ఉంటుంది.

Related Posts

Latest News Updates