Prapancha Telugu

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  info@prapanchatelugu.com

కేరళలో దక్షిణాది రాష్ట్రాల మండలి భేటీ… జగన్ బదులు మంత్రి బుగ్గన హాజరు

కేరళలోని తిరువనంతపురంలో సెప్టెంబర్‌ 3న కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా అధ్యక్షతన దక్షిణాది రాష్ట్రాల మండలి భేటీ జరగనుంది. ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి బదులు ఈ సమావేశాలకు ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి హాజరవుతున్నారు. తన తండ్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి వర్ధంతి కార్యక్రమాల నేపథ్యంలో దక్షిణాది రాష్ట్రాల మండలి సమావేశానికి తాను హాజరుకావడం లేదని సీఎం జగన్‌ తెలిపారు. ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ నేతృత్వంలోని రాష్ట్ర అధికారుల బృందం ఈ సమావేశానికి హాజరవుతుందని చెప్పారు. ఈ నేపథ్యంలో సీఎం జగన్ ఆ సమావేశాల ఎజెండాను చర్చించడానికి మంత్రులు, ఉన్నతాధికారులతో సమావేశమై, మార్గనిర్దేశనం చేశారు. రాష్ట్ర విభజన జరిగి ఎనిమిదేళ్లయినా సమస్యలు కొలిక్కి రాలేదని, వాటిని తక్షణమే పరిష్కరించాల్సిందిగా దక్షిణాది రాష్ట్రాల మండలి సమావేశంలో డిమాండ్‌ చేయాలని అధికారులకు సీఎం సూచించారు.

 

సమస్యలకు పరిష్కారాలను సూచించే వ్యవస్థను ఏర్పాటు చేయాలని కోరాలన్నారు. ఆ వ్యవస్థ కేవలం పరిష్కారాలను చూపడమే కాకుండా దక్షిణాది రాష్ట్రాల మండలి తీసుకున్న నిర్ణయాలను అమలు చేసేదిగా ఉండాలని గట్టిగా డిమాండ్‌ చేయాలని సూచించారు. దక్షిణాది రాష్ట్రాల మండలి సమావేశంలో రాష్ట్రం తరఫున 19 అంశాలను అజెండాలో పొందుపరచినట్లు అధికారులు వివరించారు. ఇప్పటికే విభజన వల్ల రాష్ట్రం ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయిందని, హైదరాబాద్‌ లాంటి నగరాన్ని కోల్పోయిందని గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో సమస్యలను తక్షణమే పరిష్కరించడంపై దృష్టి సారించాల్సిందిగా సమావేశంలో కేంద్రంపై ఒత్తిడి తేవాలన్నారు. ఇక మొన్నటి ఢిల్లీ పర్యటనలో పోలవరం గురించి ప్రధాని మోదీకి విన్నవించినా… ఈ సమావేశాల వేదిక ద్వారా కూడా పోలవరం అంశాన్ని ప్రస్తావించాల్సిందేనని సీఎం జగన్ అధికారులకు తేల్చి చెప్పారు.

Related Posts

Latest News Updates