Prapancha Telugu

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  info@prapanchatelugu.com

2024 లో దేశం నుంచి బీజేపీని పారద్రోలాలి : సీఎం కేసీఆర్ పిలుపు

పెద్దపల్లి వేదికగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధాని మోదీపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. 2024లో ఈ దేశం నుంచి బీజేపీని పార‌ద్రోలాల‌ని పిలుపునిచ్చారు. రైతుల‌కు మీట‌ర్ పెట్టాల‌ని అంటున్న ఈ మోదీకే మీట‌ర్ పెట్టాల‌న్నారు. పెద్ద‌ప‌ల్లి జిల్లా క‌లెక‌ర్టేట్ ప్రారంభం అనంత‌రం అక్క‌డ ఏర్పాటు చేసిన బ‌హిరంగ స‌భ‌లో కేసీఆర్ ప్ర‌సంగించారు. ఈ గోల్ మాల్ ప్ర‌ధాన‌మంత్రి, కేంద్ర ప్ర‌భుత్వం ప‌చ్చి అబ‌ద్దాల ఆడుతూ, దేశ ప్ర‌జ‌ల‌ను మోసం చేస్తున్నారని కేసీఆర్ ధ్వజమెత్తారు. భారత దేశమే ఆశ్యర్చపడే విధంగా తెలంగాణలో పాలన సాగిస్తున్నామని, తెలంగాణ ప్రగతిపై వివిధ రాష్ట్రాలు దృష్టిపెట్టాయన్నారు. 26 రాష్ట్రాల రైతు నాయకులు తెలంగాణ సాగు విధానంపై ఆరా తీశారని, రైతు నాయకులు తనను జాతీయ రాజకీయాల్లోకి రావాలని కోరుతున్నారని అన్నారు. గుజరాత్‌ మోడల్‌ పేరుతో దేశాన్ని నాశనం చేశారని, నరేంద్ర మోదీ తీరు కారణంగా.. శ్రీలంకలో కూడా దేశ ప్రతిష్ట దెబ్బతిందని ధ్వజమెత్తారు. ప్రధాని మోదీ గో బ్యాక్‌ అంటూ లంకేయులు నినాదాలు చేశారని గుర్తు చేశారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వం మళ్లీ రాదు. రైతులకు మీటర్‌ పెట్టాలంటున్న మోదీకే మీటర్‌ పెడుదామని, బీజేపీ ముక్త్‌ భారత్‌ అంతా కలిసి రావాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.

 

26 రాష్ట్రాల నుంచి తనను కలవడానికి రైతుల సంఘాల నాయకులు వచ్చారని సీఎం కేసీఆర్ అన్నారు. తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలపై ప్రశంసలు కురిపించారని చెప్పారు. ఏ రాష్ట్రంలోనూ ఇలాంటి పథకాలు లేవని రైతు సంఘాల నేతలు అన్నారని, ఈ సందర్భంగా తనను జాతీయ రాజకీయాల్లోకి రావావాలని వారు ఆహ్వానించినట్లు కేసీఆర్ వెల్లడించారు. జాతీయ రాజకీయాల్లోకి పోదామా? అంటూ కేసీఆర్ ఈ వేదిక ద్వారా ప్రజలను కోరారు. తెలంగాణలో అమలవుతున్న పథకాలు దేశంలో ఎక్కడా అమలవడం లేదని, 24 గంటల ఉచిత కరెంట్, ఆరోగ్య శ్రీ, రైతు బంధు, రైతు బీమా, మిషన్ భగీరథ వంటి ఏ పథకాలు మోడీ సొంత రాష్ట్రం గుజరాత్ లోనూ అమలవడం లేదని సీఎం అన్నారు.

 

ఢిల్లీ నుంచి వచ్చే దొంగల బూట్లు మోసే నాయకులు రాష్ట్రంలో ఉన్నారని..వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని పరోక్షంగా బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ని ఉద్దేశించి సీఎం చురకలంటించారు. ఆత్మగౌరవంతో ఉందామా..లేక ఢిల్లీ దొంగలకు గులాములు అవుదామని అని కేసీఆర్ ప్రశ్నించారు. రైతులు, రైతు కూలీలు, ప్రజలకు మేలు చేసే పథకాలను అమలు చేస్తుంటే..అవి ఆపాలని ..ఉచితాలు ఇవ్వొద్దని అంటున్నారని కేసీఆర్ చెప్పారు. బోర్లకు మీటర్లు పెట్టాలని ఒత్తిడి చేస్తున్నారన్నారని మరోసారి విమర్శించారు. ఎంత ఒత్తిడి చేసినా..బోర్లకు మీటర్లు పెట్టే ప్రసక్తే లేదన్నారు. మనందరం కలిసి మోడీకే మీటర్ పెట్టాలని కేసీఆర్ పిలుపునిచ్చారు.

Related Posts

Latest News Updates