Prapancha Telugu

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  info@prapanchatelugu.com

స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలైనా… వ్యవసాయం సంక్షోభంలోనే… : సీఎం కేసీఆర్

సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన రైతు సదస్సు జరిగింది. ప్రగతి భవన్‌ వేదికగా జరుగనున్న సదస్సులో 26 రాష్ట్రాల రైతు సంఘాల నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా వ్యవసాయరంగంలో నెలకొన్న పరిస్థితులతో పాటు.. తెలంగాణ ప్రభుత్వం అమలుచేస్తున్న వ్యవసాయం, సాగునీరు, విద్యుత్ రంగాల అభివృద్ధి, రైతు సంక్షేమ కార్యక్రమాల అమలు తదితర అంశాలపై చర్చించారు. తెలంగాణ ప్రగతిపై రూపొందించిన డాక్యుమెంటరీని తిలకించారు. అనంతరం రైతు సంఘాల నేతలతో కలిసి సీఎం కేసీఆర్‌ మధ్యాహ్న భోజనం చేశారు. లంచ్ అనంతరం సదస్సు తిరిగి కొనసాగింది. తెలంగాణలో జరుగుతున్న వ్యవసాయ, సాగునీటి రంగ అభివృద్ధిని క్షేత్రస్థాయిలో పరిశీలించి, అధ్యయనం చేసేందుకు ఉత్తరప్రదేశ్‌, తమిళనాడు, మధ్యప్రదేశ్‌, కర్ణాటక, పంజాబ్‌, జార్ఖండ్‌, ఒడిశా సహా 25 రాష్ర్టాలకు చెందిన వందమందికి పైగా రైతుసంఘాల నాయకులు, ప్రతినిధులు శుక్రవారం రాష్ర్టానికి చేరుకున్నారు. తెలంగాణ అమలు చేస్తున్న వ్యవసాయ విధానాలను స్వయంగా చూసేందుకు వారు వచ్చారు.

 

ఈ సందర్భంగా తెలంగాణ సీఎం కేసీఆర్ మాట్లాడుతూ… దేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు గడిచినా… కేంద్ర ప్రభుత్వ పాలన ఇంకా గాడిలో పడలేదని, దేని కారణంగా గాడిన పడలేదో.. అన్వేషించాలన్నారు. స్వాతంత్ర పోరాటం ముగిసి చాలా కాలమైందని, అయినా అనేక వర్గాలు తమ ఆకాంక్షలను, హక్కులను సాధించుకోవడం కోసం ఇంకా పోరాటాలకు సిద్ధపడుతూనే వున్నారని అన్నారు. ముఖ్యంగా దేశంలోని రైతుల సమస్యలకు ఇంకా పరిష్కారం దొరకడం లేదా? లేదా… ఈ పాలకులు వైఫల్యం చెందుతున్నారా? ఆలోచించాలని రైతు సంఘాల నేతలను సీఎం కేసీఆర్ కోరారు.

 

చట్టసభల్లో ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయాల్సిన వారు నిర్లక్ష్యంగా వున్నారని, ప్రజల కోసం పనిచేసే వారే ప్రజలను ఇబ్బందులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల క్షేమాన్ని కాంక్షించే వారు సంఘర్షించాల్సి వుంటుందని, కలిసొచ్చే శక్తులను కలుపుకోవాలని పిలుపునిచ్చారు. అడ్డంకులన్నింటినీ దాటుకొని, ఐక్యతా దిశగా ముందుకు సాగాలని సీఎం రైతు సంఘాల నేతలకు దిశానిర్దేశం చేశారు. తెలంగాణలో రైతులందరికీ ఉచిత విద్యుత్ ఇస్తూ, సాగునీటిని అందిస్తున్నామని, ఇదే పని కేంద్రం ఎందుకు చేయదని సూటిగా ప్రశ్నించారు. రైతులు కూర్చొని మాట్లాడుకోవడానికి తెలంగాణలో ఉన్నట్లు దేశంలో ఎక్కడైనా కిసాన్ మంచ్ వుందా? అంటూ నిలదీశారు. ఈ దేశంలో వ్యవసాయం సంకక్షోభంలో వుందని, రైతుల ఆత్మహత్యలు ఇంకా కొనసాగుతున్నాయని అన్నారు. దేశ సౌభాగ్యాన్ని డెవలప్ చేసుకుంటూ, రైతు వ్యవసాయ సంక్షేమ దిశగా సాగే సుపరిపాలన కోసం మనం అడుగులు వేయాల్సి వుందని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.

Related Posts

Latest News Updates