Prapancha Telugu

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  info@prapanchatelugu.com

తెలంగాణను కాపాడేందుకు సర్వశక్తులూ ధారబోస్తా : సీఎం కేసీఆర్ హామీ

తన కంఠంలో ప్రాణం వున్నంత వరకూ తెలంగాణను ఆగం కానివ్వనని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు హామీ ఇచ్చారు. రాష్ట్రాన్ని కాపాడేందుకు సర్వ శక్తులనూ ధారబోస్తానని, తన బలగం ప్రజలేనని చెప్పుకొచ్చారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ ను ప్రారంభించారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో ప్రసంగించారు. తెలంగాణ ప్రజల ఆశీర్వచనాలు వున్నంత వరకూ తనకేమీ కాదన్నారు. రంగారెడ్డి జిల్లా తెలంగాణ‌కే బంగారు కొండ‌గా మారింద‌ని కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. ఎక‌రం భూమి ఉన్న వ్య‌క్తి కూడా పెద్ద కోటీశ్వ‌రుడని, ఈ మ‌త పిచ్చిల ప‌డి దాన్ని చెడ‌గొట్టుకోవాలా? అంటూ ప్రశ్నించారు. నీచ రాజ‌కీయాల కోసం రాష్ట్రాన్ని అల్ల‌క‌ల్లోలం చేస్తుంటే చూసి ఊరుకోవ‌ద్దని అన్నారు. ఓట్ల కోసం భార‌త సొసైటీని గోస పెట్టే ప‌రిస్థితి తెస్తున్నారని కేంద్రంపై మండిపడ్డారు. తెలంగాణ స‌మాజాం ప్ర‌శాంతంగా ఉందని, అద్భుత‌మైన‌టువంటి ప్ర‌శాంత వాతావ‌ర‌ణంలో అభివృద్ధి జ‌రుగుతోందని వివరించారు.

అన్నదాతల కోసం దేశంలో ఏ రాష్ట్రంలో లేనటువంటి అద్భుతమైన సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టామని సీఎం కేసీఆర్ తెలిపారు. రైతు సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నామని చెప్పారు. రైతులు పండించే ధాన్యం మొత్తాన్ని ప్రభుత్వమే కొంటుందన్నారు. వారం రోజుల్లోనే ధాన్యం డబ్బులు ఇస్తున్నామన్నారు.ప్రజల్లో విద్వేషాలు రెచ్చగొట్టేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని అలాంటి వారి ట్రాప్ లో పడొద్దన్నారు. తెలంగాణ మాదిరిగానే దేశానికి 24 గంటలు విద్యుత్ ఎందుకు సరఫరా చేయలేకపోతున్నారని నిలదీశారు. దేశంలో పుష్కలంగా నీటి లభ్యత ఉన్నా.. ప్రజలకు మంచినీటి అందించలేని పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం ఉందని విమర్శించారు. హైదరాబాద్ లో 24 గంటల కరెంట్ ఉంటే..దేశ రాజధాని ఢిల్లీలో మాత్రం ఎప్పుడు కరెంట్ వస్తుందో..ఎప్పుడు పోతుంతో తెలియదని మరోసారి విమర్శించారు.

 

కేంద్రం కుట్రలను ప్రజలు గమనిస్తున్నారని కేసీఆర్ తెలిపారు. కుట్రలు పన్ని 9 రాష్ట్రాల్లో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలను కూలగొట్టారని చెప్పారు. తమిళనాడు, బెంగాల్, ఢిల్లీలో ప్రభుత్వాలను పడగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఆప్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు ఒక్కొక్కరికి రూ.25 కోట్లు ఇచ్చేందుకు సిద్ధమైందన్నారు. ఇది ప్రజా స్వామ్యమా లేక రాజకీయ అరాచకత్వమా సమాధానం చెప్పాలని సీఎం కేసీఆర్ డిమాండ్ చేశారు.

 

Related Posts

Latest News Updates