మునుగోడు ఉప ఎన్నికల్లో తాము టీఆర్ఎస్ కే మద్దతిస్తామని సీపీఐ కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి ప్రకటించారు. కేవలం మునుగోడు మాత్రమే కాదని, ప్రతి ఎన్నికల్లోనూ టీఆర్ఎస్ తోనే కలిసి నడుస్తామని కుండబద్దలు కొట్టారు. అయితే.. మునుగోడు సభకు మాత్రం సీపీఐ పార్టీ తరపున ఆ పార్టీ సహాయ కార్యదర్శి పల్లా వెంకట్ రెడ్డి హాజరయ్యారు. ప్రగతిశీల రాజకీయాలకు సీఎం కేసీఆర్ కంకణబద్దుడై ఉన్నారని, భవిష్యత్తులో కూడా టీఆర్ఎస్ తో కలిసి వెళ్తామని అన్నారు. మునుగోడు ఉప ఎన్నిక అనివార్యంగా తెరపైకి వచ్చిందని, తన స్వార్థ ప్రయోజనాల కోసమే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారని అన్నారు.
ఇప్పుడు రాజకీయ పరిస్థితులకు అనుకూలంగా బీజేపీని ఓడించేందుకు బలమున్న టీఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇవ్వాలని నిర్ణయించుకున్నామని తెలిపారు. ఇప్పుడు పరిస్థితుల్లో మునుగోడు నియోజకవర్గంలో సీపీఐ ఒంటరిగా పోటీ చేసే పరిస్థితి లేదని, కాంగ్రెస్ కి చాలా బలహీనతలు ఉన్నాయని, ప్రస్తుతం ఆ పార్టీ గురించి తానేమీ మాట్లాడదలచుకోలేదన్నారు. అయితే… సీఎం కేసీఆర్ కూడా ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని, అయితే నెరవేరుస్తారన్న ఆశ వుందని చాడ వెంకట్ రెడ్డి పేర్కొన్నారు.
మతోన్మాద బీజేపీని ఓడించేందుకు .. మునుగోడు బై పోల్ లో టీఆర్ఎస్ కు మద్దతు ఇస్తున్నామని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి పల్లా వెంకట్ రెడ్డి ప్రకటించారు. మునుగోడులో జరుగుతున్న టీఆర్ఎస్ బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. అమిత్ షా కాదు.. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వచ్చినా ఈ నియోజకవర్గంలో బీజేపీ గెలవలేదు అని ఎద్దేవా చేశారు. సీఎం కేసీఆర్ ఆహ్వానం మేరకు తాను ఈ సభకు హాజరైనట్లు పల్లా వెంకట్ రెడ్డి చెప్పారు.