Prapancha Telugu

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  info@prapanchatelugu.com

1000 అడుగుల లోతైనా బోరేశెయ్‌

హైదరాబాద్‌లో జల ఘంటికలు మోగుతున్నాయి. వర్షను నీరు వృథా అవుతుండటం, వాటర్‌ పిట్స్‌ లేకపోవటం వంటివి ఒకవైపు కారణాలైతే.. విచక్షణారహితంగా వెయ్యి అడుగుల లోతైనా సరే బోర్లు తవ్వుతుండటం మరోవైపు కారణం! వాస్తవానికి భూగర్భ జలశాఖ నుంచి సాధ్యాసాధ్యల నివేదిక అందిన తరవాతే రెవెన్యూ శాఖ నూతన బోరుబావుల తవ్వకానికి అనుమతి ఇవ్వాల్సి ఉంటుంది. అదీ కేవలం 400 అడుగుల లోతు వరకు తవ్వేందుకు మాత్రమే అనుమతించాలి. కానీ, ఈ నిబంధన గ్రేటర్‌ పరిధిలో కాగితాలకే పరిమితమౌతోంది.
నగరం మొత్తం ఇదే సీన్‌..
ప్రధాన నగరంతో పాటు శివారు ప్రాంతాల్లో వెయ్యి అడుగులకు పైగా బోరుబావులు తవ్వుతున్నా రెవెన్యూ శాఖ ప్రేక్షకపాత్రకే పరిమితమౌతోంది. ప్రధానంగా కుత్భుల్లాపూర్‌ మియాపూర్, చందానగర్, గచ్చిబౌలి, మాదాపూర్, రాజేంద్రనగర్, శంషాబాద్, హయత్‌నగర్‌ తదితర ప్రాంతాల్లో చెరువులు, కుంటల్లో నిబంధనలకు విరుద్ధంగా బోరుబావులు తవ్వేస్తున్నారు. ఈ నీటిని అపార్ట్‌మెంట్లు, గేటెట్‌కమ్యూనిటీలు, హోటళ్లు, హాస్టళ్లు, పిల్టర్‌ వాటర్‌ ప్లాంట్లకు సరఫరా చేస్తూ జేబులు నింపుకుంటున్నారు. అత్యంత లోతుగా బోరుబావులు తవ్వుతుండడంతో ఆయా ప్రాంతాల్లో ఇప్పటికే ఉన్న బోరుబావులు వట్టిపోవడంతోపాటు, విచక్షణారహితంగా నీటిని తోడేస్తుండడంతో భూగర్భ జలమట్టాలు అనూహ్యంగా పడిపోతున్నట్లు భూగర్భజలశాఖ నిపుణులు స్పష్టంచేస్తున్నారు.
గ్రేటర్‌లో భూగర్భ జలవిల..
సుమారు 625 చ.కి.మీ పరిధిలో విస్తరించిన గ్రేటర్‌ జనాభా కోటికి చేరువైంది. మహానగరం పరిధిలో భవంతుల సంఖ్య సుమారు 25లక్షలుకాగా..బోరుబావులు 23 లక్షలమేర ఉన్నాయి. కానీ ఇంకుడు గుంతలసంఖ్య ఐదు లక్షలకు మించిలేవు. మరోవైపు నగరం దక్కన్‌పీఠభూమి కావడంతో రాతినేలలోకి వర్షపునీరు ఇంకడం చాలా ప్రాంతాల్లో కనాకష్టంగా మారింది. మరోవైపు రోజువారీగా ఆయా బోరు బావుల నుంచి సుమారు 650 కోట్ల లీటర్ల మేర భూగర్భజలాలు తోడుతున్నట్లు అంచనా. ఇక నగరంలో ఏటా కురుస్తున్న వర్షపాతం నేలగర్భంలోకి ఇంకేందుకు అవసరమైన ఇంకుడుగుంతలు, కుంటలు లేక సుమారు 65 శాతం మేర వృథాగా రహదారులపై ప్రవహించి చివరగా మూసీలో కలుస్తోంది. దీంతో నగరంలో ఏటేటా భూగర్భజలమట్టాలు అథఃపాతాళంలోకి పడిపోతున్నాయి. గ్రేటర్‌ శివార్లలో ప్రధానంగా భూగర్భజలాల వినియోగం అత్యధికంగా ఉంది. ప్రైవేటు ట్యాంకర్ల మాఫియా రెవెన్యూ శాఖ నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోకుండా ఇష్టారాజ్యంగా బోరుబావులు తవ్వి ట్యాంకర్‌నీళ్లను విక్రయించి రూ.కోట్లు సొమ్ముచేసుకుంటున్నారు.

Related Posts

Latest News Updates