కల్లూరులోని ప్రభుత్వ బాలికల ఉన్నతపాఠశాలలో చదువుకుంటున్న 220 మంది బాలికలకు ఉమెన్ ఎంపవర్ మెంట్ తెలుగు అసోసియేషన్ (వేటా) వారి సౌజన్యంతో తోపుడుబండి ఆధ్వర్యంలో పుస్తకాలను పంపిణీ చేశారు. ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు ఉన్న మొత్తం 220 మంది విద్యార్థినులకు ఒక్కొక్కరికి ఆరు చొప్పున లాంగ్ నోట్ బుక్స్,పెన్స్,పెన్సిల్స్,ఎరెజర్స్, పౌచ్ లు, షార్ప్ నర్స్ పంపిణీ చేశారు. అమెరికాలో ఉన్న వేటా సభ్యులు, వేటా వ్యవస్థాపక అధ్యక్షురాలు ఝాన్సీ రెడ్డి ప్రెసిడెంట్ ఎలక్ట్ శైలజ కల్లూరితోపాటు ఇతర వేటా సభ్యులు ఈ పుస్తకాల పంపిణీ విజయవంతంగా జరగడానికి తోడ్పాటును అందించారు.
ఇదే సందర్భంగా జాతీయ స్థాయిలో జరిగిన ఎన్‌ఎంఎంఎస్ పరీక్షలో విజయం సాధించిన విద్యార్థిని సాదియాకు సన్మానం చేసి మెమొంటో, 5000 రూపాయల నగదు బహుమతితో సత్కరించారు. త్రోబాల్ రాష్ట్రస్థాయి సబ్ జూనియర్ పోటీల్లో పాల్గొన్న మదారున్నిసాకు సన్మానం చేసి మెమొంటోను బహుకరించారు. ఆదిలాబాద్ అడవుల్లో ఆదివాసీ బిడ్డలకు అపార సేవలు అందించి మన్ననలు పొందిన పోలీస్ అధికారి ఆప్తమిత్రులు పుష్పాల రామారావు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరయ్యారు. వారు పిల్లల్లో స్ఫూర్తిని నింపారు. సుదూర తీరాల నుంచి ఎప్పటికప్పుడు సమన్వయం చేసిన శైలజ కల్లూరికి రేఖా రెడ్డికి అందరూ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలిపారు.