తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న మిషన్ కాకతీయ లక్ష్యాన్ని తప్పుతోంది. మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాలో మిషన్ కాకతీయ పథకం కింద చిన్న నీటి వనరులు పునరుద్ధరించి, రైతులు, చేతి వృత్తి దారుల్లో వెలుగు నింపాలన్న లక్ష్యం నీరుగారుతోంది. నీటి పారుదల శాఖ అధికారుల నిర్లక్ష్యం, ప్రజాప్రతినిధుల అలసత్వం వెరసీ కాంట్రాక్టర్ల కక్కుర్తితో పనులు అస్తవ్యస్తంగా కొనసాగాయి.
జిల్లాలో 503 చెరువులు..
చెరువుల పునరుద్ధరణ పనులను సబ్ కాంట్రాక్టర్లు నిర్వహించటంతో నాణ్యత లేకుండా పోతోంది. సగం చెరువుల్లో పూడికతీత పనులు చేపట్టకుండానే బిల్లులు పొందినట్లు ఆరోపణలు ఉన్నాయి. జిల్లాలో మొత్తం చెరువులు 503. మిషన్ కాకతీయ పథకం కింద నాలుగు విడతల్లో 213 చెరువుల్లో పునరుద్ధరణకు పనులకు ప్రభుత్వం రూ.53.06 కోట్లు విడుదల చేయగా, ఇప్పటి వరకు 190 చెరువుల్లో పునరుద్ధరణ పనులు పూర్తి చేయటం ద్వారా రూ. 19.95 కోట్లు ఖర్చు చేసినట్లు నీటిపారుదల శాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. జిల్లాలో 503 చెరువుల కింద మొత్తం ఆయకట్టు 23,576 ఎకరాలు ఉంది. ఇందులో 49 మధ్యతరహా చెరువుల కింద 16,482 ఎకరాల ఆయకట్టు, 453 చిన్నతరహా చెరువుల కింద 7,095 ఎకరాల భూమి సాగవుతుంది.
నాలుగో విడతలో పనులు ఇలా..
మిషన్ కాకతీయ పథకం కింద జిల్లాలో నాలుగో దశ మిషన్ కాకతీయ కింద 52 చెరువుల పునరుద్ధరణ పనులకు జిల్లా నీటి పారుదల శాఖ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపగా, 23 చెరువుల పురుద్దరణకు రూ.3 కోట్లు మంజూరు చేసింది. ఇందులో 15 చెరువుల పునరుద్ధరణ పనులు పూర్తయ్యాయి. మిగతా ఏనమిది చెరువుల పనులు పెండింగ్‌లో ఉన్నాయి. ఘట్కేసర్ మండలం బాడిసాహెబ్గూడలోని నాడెం చెరువు ఆయకట్టు 40 ఎకరాలు కాగా, మిషన్ కాకతీయ పనులకు రూ.9.05 లక్షలు కేటాయించారు. శామీర్‌పేట్ మండలం జంగంగూడలోని మోగలోనికుంటకు రూ.15.88 లక్షలు, కోల్తూర్లోని కావలికుంటకు రూ.25.25 లక్షలు, కీసర మండలం అన్నరాయక చెరువు పనులకు రూ.17.87 లక్షలు కేటాయించారు. నాలుగవ విడతలో మొత్తంగా 4 చెరువుల పరిధిలో ఆయకట్టు 256 ఎకరాలు ఉండగా, వీటి మరమ్మత్తుకు మిషన్ కాకతీయ కింద రూ.68.05 లక్షలతో జిల్లా నీటిపారుదల శాఖ పనులు చేపట్టింది. మిగతా చెరువుల పునరుద్ధరణ పనులు కొనసాగుతున్నట్లు తెలుస్తున్నది.
లోపించిన నాణ్యత…
జిల్లాలో మిషన్ కాకతీయ పథకం కింద మూడు దశలో 185 చెరువుల పునరుద్ధరణ పనులతో పాటు ఘట్కేసర్ మండలం ఏదులాబాద్‌లోని లక్ష్మినారాయణ చెరువును మినీ ట్యాంక్ బండ్‌గా అభివృద్ధి పరిసేందుకు ప్రభుత్వం రూ.49.52 కోట్లు మంజూరు చేసింది. జిల్లా నీటి పారుదల శాఖ మాత్రం మొదటి దశలో 95 చెరువులకు గానూ, 88 చెరువుల పనులు, రెండో దశలో 73 చెరువులకు గానూ 59 చెరువులు, మూడో దశలో 22 చెరువులకు గానూ 18 చెరువుల పనులు పూర్తి చేశారు. ఏదులాబాద్‌లోని లక్ష్మీనారాయణ చెరువు మినీ ట్యాంక్ బండ్‌గా అభివృద్ధి పనులను 80 శాతం పూర్తి చేశారు. జిల్లాలో మూడు దశల్లో చేపట్టిన మోజారిటీ చెరువుల పునరుద్దరణ పనుల్లో నాణ్యత లోపించటంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మిషన్ కాకతీయ పథకంలో భాగంగా మూడు విడతల్లో చెరువు కట్టలు, తూముల మరమ్మత్తులు, పూడికతీత పనులు చేపట్టగా, ఇందుకోసం రూ.19.95 కోట్లకు పైగా ఖర్చు పెట్టారు. ఈ చెరువుల్లో నుంచి 6.72 లక్షల క్యూబిక్ మీటర్ల పూడిక తీసినట్లు నీటి పారుదల శాఖ పేర్కొంటున్నది.
మచ్చుకు కొన్ని…
మిషన్ కాకతీయ పథకం కింద శామీర్‌పేట్ మండలం మూడు చింతలపల్లిలో ఎల్లంరాజ్కుంటకు రూ.4.18 లక్షలు, అడ్రాస్‌పల్లి ఆనకట్ట పనులకు రూ.13.34 లక్షలు, ఉద్దెమర్రి ఆనకట్టకు రూ.13.28 లక్షలు, కీసర మండలం రాంపల్లి సూర్యనారాయణ చెరువు పునరుద్ధరణ పనులకు రూ.44.35 లక్షల మంజూరైనప్పటికిని.. పనులు మాత్రం అరకోరగా నిర్వహించినట్లు రైతులు పేర్కొంటున్నారు. ఏదులాబాద్ లక్ష్మినారాయణ చెరువును మినీ ట్యాంకుగా అభివద్ధి పరిచే పనుల్లో నాణ్యత లేకపోగా, 80 శాతం కూడా పూర్తి కాలేదని తెలుస్తుంది. కీసరలోని నూర్ మహ్మాద్ చెరువు పునరుద్దరణ పనులకు రూ.52.42 లక్షలు రాగా, ఆలస్యంగా చేపట్టి అరకొరగా పూర్తి చేశారు. రాంపల్లి దాయరలో జాఫర్‌ఖాన్ చెరువు పురుద్ధరణ పనులు రూ.42.20 లక్షలతో చేపట్టినప్పటికీ.. నాణ్యత లోపించిందన్న ఆరోపణలు ఉన్నాయి.