తెలంగాణ బీజేపీ చేపట్టిన సాలు దొర- సెలవు దొర అంటూ సీఎం కేసీఆర్ ని ఉద్దేశించి చేపట్టిన క్యాంపెయిన్ పై కేంద్ర ఎన్నికల సంఘం నిషేధం విధించింది. సీఎం కేసీఆర్ కు వ్యతిరేకంగా సాలు దొర- సెలవు దొర అంటూ పోస్టర్లు ముద్రించడానికి ఈసీ అనుమతి ఇవ్వలేదు. ఆయా రాజకీయ పార్టీ నేతలను కించపరిచే విధంగా పోస్టర్లు, ఫొటోలు, రాతలు వుండరాదని ఈసీ స్పష్టం చేసింది. సాలు దొర- సెలవు దొర ప్రచారానికి కేంద్ర ఎన్నికల సంఘం అనుమతి కోసం బీజేపీ నేతలు సంప్రదించారు. దీనిని ఈసీ తోసిపుచ్చింది. దీంతో తెలంగాణ బీజేపీ ఇబ్బందుల్లో పడిపోయింది.
ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవహార శైలిని నిరసిస్తూ తెలంగాణ బీజేపీ ఆధ్వర్యంలో సాలు దొర- సెలవు దొర అన్న క్యాంపెయిన్ ను ప్రారంభించారు. అయితే.. ప్రధాని మోదీని ఉద్దేశించి కూడా టీఆర్ఎస్ డిజిటల్ క్యాంపెయిన్ ను చేసింది. అధిక ధరలు, జీఎస్టీ తదితర అంశాలను ఆధారంగా టీఆర్ఎస్ కూడా ఇలాంటి ప్రచారాన్నే చేసింది. దీనికి కౌంటర్ గా బీజేపీ కూడా సాలు దొర- సెలవు దొర అంటూ కొత్త స్లోగన్ ను అందుకుంది. కొన్ని రోజుల వరకు తెలంగాణ బీజేపీ రాష్ట్ర కార్యాలయం ముందు సాలు దొర సెలవు దొర అన్న డిజిటల్ పోస్టర్ కూడా వుంచారు. దీనిపై టీఆర్ఎస్ నేతలు తీవ్ర అభ్యంతరం కూడా వ్యక్తం చేశారు.