సీపీఐ అధికార టీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకోవడాన్ని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ తీవ్రంగా తప్పుబట్టారు. ప్రజల సమస్య విషయంలో వామపక్ష పార్టీలు ఏనాడైనా ప్రగతి భవన్ లో అడుగు పెట్టారా? ట్రేడ్ యూనియన్లు సమ్మె చేస్తే… సీపీఎం, సీపీఐ నేతలు ఒక్కసారైనా కేసీఆర్ తో చర్చించారా? అంటూ ఈటల సూటిగా ప్రశ్నించారు. ప్రజల సమస్యల పరిష్కారంలో ముందున్నారా? అంటూ నిలదీశారు. టీఆర్ఎస్ ప్రభుత్వం పోవాలని చాలా కాలంగా తెలంగాణ ప్రజానీకం కోరుకుంటున్నారని, చ్చే సాధారణ ఎన్నికల్లో కూడా బీజేపీని గెలపిస్తామనే నమ్మకాన్ని మునుగోడు ప్రజలు ఇప్పటికే కలిగించారని అన్నారు.
ఈ సభ విజయవంతం కావద్దన్న దురుద్దేశంతోనే సీఎం కేసీఆర్ ఒక రోజు ముందు సభ పెట్టారని విమర్శించారు. మునుగోడులో బీజేపీ గెలిస్తే బంగాళాఖాతంలో వేస్తారని కేసీఆర్ తన గురించి తానే చెప్పుకున్నారని ఎద్దేవా చేశారు. మునుగోడులో బీజేపీ వస్తే ఏం జరుగుతుందోనని సీఎం కేసీఆర్ భయపడుతున్నారని, ఆ భయంతోనే ఒక్క రోజు ముందు సభ పెట్టుకున్నారని దెప్పిపొడిచారు. ఓటమి భయంతోనే మోటార్లకు మీటర్లు పెడతామన్న తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ఇదంతా తప్పుడు ప్రచారమేనని స్పష్టం చేశారు. మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ ని ఓడించి, బీజేపీ అభ్యర్థిని గెలిపించాలని ఈటల మునుగోడు ప్రజలకు పిలుపునిచ్చారు.