తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల సమయంలో ఓటర్లకు డబ్బులు ఆశ చూపుతూ.. లంచం ఇస్తుండగా పట్టుబడిన కేసుల్లో పురోగతి కనిపిస్తుంది. ప్రముఖ తెలుగు సినిమా నటుడు, తెలుగు దేశం పార్టీ (టీడీపీ) పార్లమెంటరీ సభ్యుడు (ఎంపీ) మాగంటి మురళీ మోహన్, ఖమ్మం తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) ఎంపీ నామానాగేశ్వర రావుల మీద ఎన్నికల సమయంలో లంచం కేసులు నమోదైన విషయం తెలిసిందే. ఈ కేసుల్లో కొంత కదలిక వచ్చిందని పోలీసు వర్గాలు తెలిపాయి.
రూ.2 కోట్లతో జయభేరి ఉద్యోగులు..
మురళీ మోహన్‌కు హైదరాబాద్‌లో జయభేరి పేరిట నిర్మాణ సంస్థ ఉంది. ఏప్రిల్ 3వ తేదీని మాదాపూర్ ఎస్ఐ హైటెక్ సిటీ ఎంఎంటీఎస్ రైల్వే స్టేషన్ సమీపంలో వాహనాలను తనిఖీ చేస్తున్నారు. ఆ సమయంలో జయభేరి కన్స్ట్రక్షన్స్లో పనిచేసే ఇద్దరు ఉద్యోగులు ఎన్ శ్రీహరి, ఎ. పండారిలు రూ.2 కోట్ల నగదును తరలిస్తుండగా పట్టుబడ్డారు. హైదరాబాద్ నుంచి రైలు ద్వారా వెళ్లి రాజమండ్రిలో మురళీ మోహన్‌కు అందజేయాలని సూచించారని పోలీసుల సమక్షంలో నిందితులు ఒప్పుకున్నారు. దీంతో మురళీమోహన్ మీద కేసు నమోదు చేశారు.
రూ.1.17 లక్షలతో నామా..
ఈ ఏడాది ఏప్రిల్ 9వ తేదీన నామా నాగేశ్వరరావు పోటీ చేసిన ఖమ్మం నియోజకవర్గంలో నామా పేరు మీద జి. హటిరామ్ అనే అనుచరుల బృందం రూ.1.17 లక్షల నగదును ఓటర్లకు పంచుతుండగా ఫ్లయింగ్ స్క్వాడ్ చేతికి చిక్కారు. సదరు అనుచరుల చేతుల్లో టీఆర్ఎస్ పార్టీ గులాబీ రంగు టవల్స్, 29 మోడల్ బ్యాలెట్ పేపర్లు, డమ్మీ ఈవీఎంలు కూడా ఉన్నాయి.
5 నెలలు గడుస్తున్నా..
అయితే కేసులు నమోదు చేసి 5 నెలలు గడుస్తున్నా.. ఇంకా ఇన్వెస్టిగేషన్ కొనసాగుతూనే ఉందని, తక్షణమే ఈ కేసులను విచారణ చేసి, నిందితులకు తగిన శిక్ష వేయాలని కోరుతూ ఫోరమ్ ఫర్ గుడ్ గవర్నెన్స్ ప్రతినిధులు ఎం పద్మనాభ రెడ్డి ఎన్నికల ప్రధానాధికారికి లేఖ రాశారు.