Prapancha Telugu

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  teluguabroad.com@gmail.com 

గాడి తప్పిన పట్టణ ప్లానింగ్‌

అధికారుల పర్యవేక్షణ కొరవడటంతో పోచారం మున్సిపాలిటీలో పట్టణ ప్రణాళిక గాడితప్పుతోంది. నాయకుల అండదండలతో కొందరు ఇష్టారాజ్యంగా నిర్మాణాలు చేపడితే… మరో వైపు నాయకులే నేరుగా నిర్మాణాలు చేపట్టి వ్యాపార కార్యకలాపాలు నిర్వర్తిస్తున్నారు. పోచారం మున్సిపాలిటీలో ఎటు చూసినా ఆకాశాన్ని తాకే అంతస్తులు… సెట్‌ బ్యాక్‌ వదలని నిర్మాణాలు.. రహదారులపైకి వస్తున్న భవనాలు… పచ్చదనం మచ్చుకైనా కానరాని ఆవాసాలు… ఇంకుడు గుంతలు లేని ఇళ్లే కనిపిస్తున్నాయి. నియంత్రించాల్సిన అధికారులు నిర్లిప్తంగా వ్యవహరిస్తున్నారు.
పర్యవేక్షణ లోపం..
మున్సిపాలిటీలో టౌన్‌ ప్లానింగ్‌ విభాగం ఎంతో కీలకమైనది. ఈ విభాగానికి చెందిన సిబ్బంది పర్యవేక్షణ లేకపోవడంతో అక్రమ నిర్మాణాల జోరు కొనసాగుతోంది. దీనికి తోడు నిర్మాణ అనుమతులు తీసుకున్న వారూ నిబంధనలకు తిలోదకాలిస్తున్నారని ఫిర్యాదులు అందుతున్నా అధికారులు స్పందించడం లేదు. కనీసం 30 అడుగులు ఉండాలన్న నిబంధన ఎక్కడా పాటించడం లేదు. దీనికి తోడు ఉన్న రోడ్లూ కుచించుకుపోతున్నాయి. ప్రతి ఇంటి ఆవరణలో మొక్కలు పెంచడంతో పాటు ఇంకుడు గుంత ఏర్పాటు చేసుకోవాలి. కానీ, వీటి జాడే కన్పించడం లేదు.
అక్రమ నిర్మాణాలపై చర్యలేవి?
సామాన్య, మధ్య తరగతి ప్రజలు సొంతంగా ఇళ్లు కట్టుకోవాలంటే అడుగడుగునా అవరోధాలే వస్తాయన్న భయంతో వారు బిల్డర్లను ఆశ్రయిస్తున్నారు. దీంతో వీరి వ్యాపారం ‘మూడు పువ్వులు ఆరు కాయలు’గా సాగుతోంది. అన్నోజిగూడలోని మిత్ర లే అవుట్‌లో కొంత మంది బిల్డర్లు నిబంధనలకు వ్యతిరేకంగా భవనాలు నిర్మిస్తున్నారు. మున్సిపల్‌ ఆఫీస్‌ ముందే ఓ వెంచర్‌లో అనుమతి రాకముందే పనులు ప్రారంభించారు. ఇస్మాయిల్‌ఖాన్‌గూడలోని అనధికార లేఅవుట్‌లోనూ నిర్మాణాలు కొనసాగుతున్నాయి. నారపల్లిలోని ఎమ్మెస్సార్‌ నగర్‌ సమీపాన, యమ్నంపేట్‌లోని నాలా దగ్గర నిబంధనలను తుంగలో తొక్కి నిర్మాణాలు చేపట్టారు. పోచారం పాత ఊరు దాటిన తర్వాత ఆకాశాన్ని తాకే అంతస్తులు వస్తుంటే… కొరడా జుళిపించాల్సిన అధికారులు మిన్నకున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి పట్టణ ప్రణాళికను గాడిలో పెట్టాలని ప్రజలు కోరుతున్నారు.
ఫిర్యాదు చేసినా ఫలితం శూన్యం..
ఇస్మాయిల్‌ ఖాన్‌గూడలోని సర్వే నెం.32–36లో కొనసాగుతున్న అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని పలుమార్లు ఫిర్యాదు చేసినా అధికారులు స్పందించ లేదు. ఆర్టీఐ కింద సమాచారం కోరితే.. పై సర్వే నెంబర్లలో ఎలాంటి నిర్మాణాలకు అనుమతులు ఇవ్వలేదని వివరణ ఇచ్చారు. చర్యలు తీసుకోమంటే… పరిశీలించి ఆ దిశగా అడుగులు వేస్తామని చెప్పి ఊరుకున్నారని పోలగోని కృష్ణ తెలిపారు.

Related Posts

Latest News Updates