ఆర్థిక మాంద్యం ఛాయలు ఉరుముతున్నప్పటికీ రియల్టీకి కొంగుబంగారంగా నిలిచిన గ్రేటర్ హైదరాబాద్ నగరంలో రియల్ఎస్టేట్ రంగానికి ఢోకాలేదని రియల్టీ వర్గాలు అంచనా వేస్తుండడం విశేషం. గత కొన్నేళ్లుగా ఈ రంగంలో పెరుగుదలను పరిగణలోకి తీసుకుంటే ఏటా సుమారు 10 నుంచి 12 శాతం పెరుగుదల నమోదవుతోందని తాజా అధ్యయనంలో తేలింది. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న వాణిజ్య,నివాస,కార్యాలయ భవనసముదాయాలకు డిమాండ్ ఏమాత్రం తగ్గదని నేషనల్ అసోసియేషన్ ఆఫ్ రియల్టర్స్ సంస్థ తాజాగా అంచనా వేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న టీఎస్ఐపాస్, ఐటీ, హార్డ్‌వేర్ పాలసీలతో అమెజాన్, యాపిల్ వంటి దిగ్గజ సంస్థలు సైతం నగరానికి క్యూ కడుతున్నాయని ఈ సంస్థ తాజా అధ్యయనంలో తెలిపింది. ఏటా గ్రేటర్ హైదరాబాద్‌లో 4 నుంచి 4.5 లక్షల మిలియన్ చదరపు అడుగుల కార్యాలయ స్పేస్‌ను వివిధ వ్యాపార, వాణిజ్య సంస్థలు అద్దెకు తీసుకుంటున్నాయని పేర్కొంది. ఇక వాణిజ్య స్థలాల విషయానికి వస్తే ఏటా సుమారు 9 లక్షల చదరపు అడుగుల వాణిజ్య స్థలం అందుబాటులోకి వస్తుందని.. ఈ స్థలాలకు సైతం ఏటేటా డిమాండ్ అనూహ్యంగా పెరుగుతోందని తెలిపింది. ఈ విషయంలో బెంగళూరు తరవాత గ్రేటర్ సిటీ ద్వితీయస్థానంలో నిలిచినట్లు పేర్కొంది. ఇక భూముల ధరలు సైతం కొన్ని చోట్ల రెండేళ్లలో రెట్టింపవుతాయని అంచనా వేయడం విశేషం.
తాజాగా పెరుగుదల ఇలా..
ఈ ఏడాది జనవరి నుంచి జూన్ మధ్యకాలంలో గ్రేటర్ పరిధిలో ఆఫీస్ స్పేస్ డిమాండ్‌కు సంబంధించి సుమారు 27 శాతం పెరుగుదల నమోదైనట్లు ఈ సంస్థ వెల్లడించింది. గతేడాది (2018) ఇదే కాలంలో వృద్ధి 8 శాతానికే పరిమితమైనట్లు తెలిపింది. బెంగళూరు తరవాత మన గ్రేటర్ నగరంలోనే ఈ స్థాయిలో వృద్ధి నమోదవుతుందని పేర్కోంది. ముంబాయి, ఢిల్లీ, కోల్‌కతా, చెన్నై నగరాల్లో వృద్ధి పదిశాతానికి లోపుగానే ఉన్నట్లు తెలిపింది. ఇక రియల్ ఎస్టేట్ రంగంలో ప్రధానంగా స్టాంప్‌డ్యూటీ, రిజిస్ట్రేషన్లు, ఆస్తిపన్నులు, భవనాల అనుమతులకు సంబంధించి ప్రభుత్వానికి సైతం భారీగానే ఆదాయం సమకూరుతుందని.. ఈ రంగం రాష్ట్ర ఆర్థిక రంగానికి సైతం ఊతమిస్తోందని పేర్కొంది.
భూముల ధరలు బంగారం..
రాజధాని గ్రేటర్ శివార్లలో భూమి బంగారమైంది. ఔటర్‌రింగ్ రోడ్డు చుట్టూ ఉన్న శివారు ప్రాంతాల్లో నివాస భూముల ధరలు కోట్లకు చేరుకున్నాయి. గత రెండేళ్లలో భూముల ధరలు రెట్టింపు కావడంతో కోట్లరూపాయలు గుమ్మరిస్తేగాని జాగా దొరకని పరిస్థితి నెలకొంది. శివారు ప్రాంతాల్లో నూతన ఐటీ, హార్డ్‌వేర్ పరిశ్రమల కార్యకలాపాలు పెరగడం, జాతీయ, అంతర్జాతీయ స్థాయి విద్యాసంస్థలు నెలకొనడం, ఔటర్‌రింగ్‌రోడ్డుతో అంతర్జాతీయ విమానాశ్రయానికి కనెక్టివిటీ పెరగడం, ప్రధాన రహదారుల విస్తరణ, హరిత వాతావరణం, ఇంటిగ్రేటెడ్ టౌన్‌షిప్‌లు, విల్లాలు, గేటెడ్ కమ్యూనిటీలు భారీగా వెలియడంతో ఆయా ప్రాంతాల్లో భూములకు డిమాండ్ అనూహ్యంగా పెరిగిందని ఈ అధ్యయనం పేర్కొంది.
అభివృద్ధి గ్రేటర్ నలుచెరుగులా విస్తరించడం, ఆయా ప్రాంతాల్లో వృత్తి, విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరగడం, సూక్ష్మ, చిన్న, మధ్యతరహా, కుటీర పరిశ్రమలు నెలకొనడం, ప్రభుత్వం నూతనంగా తీసుకొచ్చిన ఐటీ, హార్డ్‌వేర్ పాలసీ, లాజిస్టిక్ హబ్‌ల ఏర్పాటు వెరసి ఆయా ప్రాంతాల్లో నిర్మాణరంగ కార్యకలాపాలు గత రెండేళ్లుగా అనూహ్యంగా పెరిగాయి. ప్రధానంగా పటాన్చెరు, నానక్‌రామ్‌గూడా, తెల్లాపూర్, మియాపూర్, అమీన్పూర్, కొల్లూర్, రాయదుర్గం, బాచుపల్లి, కూకట్పల్లి, పుప్పాల్గూడా, కొంపల్లి, మేడ్చల్, ఉప్పల్, పోచారం ప్రాంతాల్లో భూములకు డిమాండ్ భారీగా పెరగడంతో ఆయా ప్రాంతాల్లో నివాస భూముల కోసం కోట్ల రూపాయలు వెచ్చించాల్సి వస్తోందని ఈ అధ్యయనం పేర్కొంది. ఇక మంగల్‌పల్లి, బాటసింగారం ప్రాంతాలతో పాటు శంషాబాద్, పెద్దఅంబర్‌పేట్, మనోహరాబాద్, మియాపూర్ ప్రాంతాల్లో ప్రభుత్వం నూతనంగా లాజిస్టిక్ హబ్‌లను ఏర్పాటు చేస్తుండడంతో ఆయా ప్రాంతాల్లో భూముల ధరలు అనూహ్యంగా పెరిగాయి. ఆయా ప్రాంతాల్లో ఎకరం భూమి విలువ సుమారు రూ.5 నుంచి రూ.10 కోట్లకు చేరుకోవడం విశేషం.