ఓవైపు రోడ్లపై వరదనీటి సమస్యలు తొలగించడంతో పాటు మరోవైపు నగరంలో భూగర్భజలాల పెంపు కోసం జీహెచ్ఎంసీ ఇటీవల చేపట్టిన ఇంజెక్షన్ బోర్‌వెల్స్ మంచి ఫలితాలిస్తుండటంతో దాదాపు 70 ప్రాంతాల్లో రూ. 1.10 కోట్లతో వీటిని ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు రూపొందించారు. మరోవైపు వాననీటిని ఒడిసి పట్టేందుకు జీహెచ్ఎంసీకి చెందిన సర్కిల్, వార్డు, జోనల్ కార్యాలయాల రూఫ్‌టాప్ నుంచి వాన నీరు ఇంకుడుగుంతల్లోకి చేరేలా కూడా ఇంజెక్షన్ బోర్‌వెల్స్ ఏర్పాటు చేయాలని యోచించారు. వీటికి సంబంధించి జీహెచ్ఎంసికి చెందిన అన్ని జోనల్, సర్కిల్, వార్డు కార్యాలయాలను పరిశీలించి అనువైన ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేయనున్నారు. దాదాపు యాభై ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేసేందుకు అవకాశం ఉంటుందని భావిస్తున్నామని ఉన్నతాధికారులు పేర్కొన్నారు. మరోవైపు ప్రధాన రహదారులపై వరదనీరు చేరకుండా నిర్మించేందుకు ప్రతిపాదించిన ప్రాంతాల్లో దాదాపు 70 ఇంజెక్షన్ బోర్‌వెల్స్‌కు జేఎన్టీయూ నిపుణులు కూడా ఓకే చెప్పడంతో వాటికి ప్రతిపాదనలు రూపొందించారు. అందులో భాగంగా ఇప్పటికే ఆయా సర్కిళ్ల పరిధిలో పదికి పైగా ఇంజెక్షన్ బోర్‌వెల్స్‌ను ఏర్పాటు చేశారు. మలక్‌పేట సర్కిల్ పరిధిలో రూ. 7.85 లక్షల వ్యయంతో 10 ఇంజెక్షన్ బోర్‌వెల్స్‌కు నిధులు మంజూరు చేయగా వాటిల్లో నాలుగింటి పనులు పూర్తయ్యాయి. అలాగే శేరిలింగంపల్లి పరిధిలో పదింటికి సిద్ధం కాగా,రెండు పూర్తయ్యాయి. మిగతా 8 టెండర్ల ప్రక్రియలో ఉన్నాయి. చందానగర్ సర్కిల్ పరిధిలో 9 మంజూరు కాగా, 2 పూర్తయ్యాయి. అంబర్‌పేట సర్కిల్లో మంజూరైన 2 టెండర్ దశలో ఉన్నాయి. బేగంపేట సర్కిల్లో 3, ఖైరతాబాద్ సర్కిల్ పరిధిలో 4 టెండర్ల దశలో ఉన్నాయి. ఖైరతాబాద్ సర్కిల్ పరిధిలో లేక్‌వ్యూ గెస్ట్‌హౌస్, విల్లామేరీ కాలేజ్ ప్రాంతాల్లో ఎక్కువ నీరు నిల్వ ఉండటంతో అక్కడ ఎక్కువ నీరు భూమిలోకి ఇంకేలా పెద్ద ఇంకుడుగుంతలతో కూడిన ఇంజెక్షన్ బోర్‌వెల్స్ ఏర్పాటు చేయనున్నారు. ఇందుకుగాను రూ. 4 లక్షలు ఖర్చు కాగలదని అంచనా వేశారు. ప్రస్తుతం వర్షాలు కురుస్తున్నందున, వర్షాలు వెలిశాక ఇంజెక్షన్ బోర్‌వెల్స్ పనులు జరుగుతాయని చీఫ్ ఇంజినీర్ జియావుద్దీన్ తెలిపారు.
ఐటీ కారిడార్‌లో బహుళ అంతస్తుల భవనాల్లో..
జీహెచ్ఎంసీ కార్యాలయాలపై చేరే వాననీటిని ఒడిసిపట్టేందుకు సిద్ధమైన జీహెచ్ఎంసీ.. గ్రేటర్‌లోని బహుళ అంతస్తుల భవనాల ప్రాంతాల్లో కూడా ఇంజెక్షన్ బోర్స్‌తో కూడిన ఇంకుడుగుంతలు ఏర్పాటు అవసరమని భావిస్తోంది. ముఖ్యంగా ఐటీ కారిడార్‌లో కిక్కిరిసి వెలసిన బహుళ అంతస్తుల భవనాలున్న ప్రాంతాల్లో నీరు బయటకు వెళ్లే మార్గంలేక పలు సమస్యలు ఎదురవుతున్నాయి. ఆయా భవనాలపై నుంచి వర్షపునీరు రోడ్లపై వృథాగా పోకుండా ఇంజెక్షన్ బోర్‌వెల్స్‌తో ఇంకుడుగుంతలు ఏర్పాటు చేసుకోవాల్సిందిగా సూచించనున్నామని అధికారులు పేర్కొన్నారు.