ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణం కోసం భూమి కోల్పోయిన తిమ్మాయిపాలెం రైతుల ‘మహా’ నిరీక్షణ ఫలించబోతోంది. 2006లో ఓఆర్ఆర్ భూసేకరణ కోసం వందల్లో ఎకరాలను కొల్పోయిన భూనిర్వాసితులు అప్పటి నుంచి హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ) చుట్టూ చక్కర్లు కొడుతూ ఉండగా… సుమారు 13 ఏళ్ల తర్వాత వారిచేతికి ప్లాట్ల పత్రాలు అందబోతున్నాయి. తిమ్మాయిపాలెంలోనే హెచ్ఎండీఏ భూమితో పాటు రెవెన్యూ విభాగం నుంచి రెండు దశల వారీగా తీసుకున్నా ఆరు ఎకరాలు కలుపుకొంటే 68 ఎకరాల్లో లేఅవుట్‌ను అభివృద్ధి చేసిన హెచ్ఎండీఏ విభాగం అధికారులు ఈ నెల 29న రైతుల చేతికి లాటరీ రూపంలో ప్లాట్లు కేటాయించాలని నిర్ణయించారు. సుమారు 181 మంది రైతులకు ప్రయోజం దక్కనుంది. ఇదిలాఉండగా ఓఆర్ఆర్ భూనిర్వాసితుల కోసం కోహెడలో అభివృద్ధి చేస్తున్న లేఅవుట్ కూడా పూర్తయితే మరో 200 మంది రైతులకు ఊరట కలగనుంది. హైదరాబాద్‌కే తలమానికంగా మారిన ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణం కోసం 2006లో హెచ్ఎండీఏ అధికారులు 211 నోటిఫికేషన్లు జారీ చేసి 6,064 ఎకరాల 12 గుంటలు సేకరించారు. వీటిలో 5,148 ఎకరాల 25 గుంటలు రైతుల భూములు, 582 ఎకరాల 18 గుంటల ప్రభుత్వ భూములు, 312 ఎకరాల ఎనిమిది గుంటలు అటవీ భూములు ఉన్నాయి. ఇందులోనే తిమ్మాయిపాలెంకు చెందిన 181 మంది రైతులు వందల్లో ఎకరాలను హెచ్ఎండీఏ భూసేకరణలో కోల్పోయారు. వీరు అప్పటి నష్టపరిహరానికి ఒప్పుకోకపోవడంతో భూమికి భూమి తరహాలోనే వీరికి ఆధునిక మౌలిక వసతులతో లేఅవుట్‌ను అభివృద్ధి చేసి ప్లాట్లను కేటాయించాలని అప్పటి అధికారులు నిర్ణయించారు. ఎంతో మంది కమిషనర్లు మారినా ఆ లేవుట్ అడుగు ముందుకుపడలేదు. అయితే ప్రస్తుతం రిజిష్టార్ అండ్ స్టాంప్స్ ఐజీగా ఉన్న చిరంజీవులు హెచ్ఎండీఏ కమిషనర్‌గా ఉన్న సమయంలో తిమ్మాయిపాలెం రైతుల సమస్యపై ప్రత్యేక దృష్టి సారించడంతో పాటు రెవెన్యూ విభాగం నుంచి ఆరు ఎకరాలు వచ్చే విధంగా ఎప్పటికప్పుడూ సమీక్షిస్తూ తిమ్మాయిపాలెం లేఅవుట్ దిశగా అడుగులు వేయించారు. అలా మూడేళ్ల క్రితం ప్రారంభమైన ఈ లేఅవుట్ ఇప్పుడూ సకలహంగులతో సిద్ధమైంది. ప్రస్తుత హెచ్ఎండీఏ కమిషనర్ అరవింద్‌కుమార్ కూడా ప్రత్యేక దృష్టి సారించడంతో తిమ్మాయిపాలెం రైతుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. ఇన్నాళ్లు నిరీక్షించినా మాకు సరైన ప్రతిఫలం దక్కుతోందని సంబరపడుతున్నారు.