తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావుకు హైకోర్ట్ మొట్టికాయ వేసింది. ఎర్రమంజిల్ భవనాన్ని కూల్చివేసి.. ఆ స్థానంలో కొత్తగా శాసనసభ (అసెంబ్లీ) నిర్మించాలని తలచిన తెలంగాణ సర్కారుకు హై కోర్ట్ ప్రశ్నల వర్షం కురిపించింది. వీటికి సమాధానాలు చెబితేనే ముందుకెళ్లాలంటూ ఆదేశాలు జారీ చేసింది.
హెచ్ఎండీఏ అనుమతి ఉందా?
కొత్త అసెంబ్లీ నిర్మాణానికి హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ) అనుమతి తీసుకున్నారా? లేదా? ప్రస్తుతం ఉన్న భవనం అవసరాలకు సరిపోతుందా? లేదా? ఒకవేళ సరిపోతే కొత్త భవనం నిర్మించాల్సిన అవసరం ఏముంది? కొత్త భవనం కట్టడానికి డిజైన్, ప్లాన్ రూపొందించారా? లేకుండా ఎలా ముందుకెళ్తున్నారు? భవిష్యత్తులో ఎదురయ్యే ట్రాఫిక్ సమస్యలను ఎలా ఎదుర్కొంటారు? వీటిని సమాధానాలు చెప్పాలంటూ హైకోర్టు తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.
పాత చట్టం రద్దవుతుంది..
అయితే ప్రభుత్వం తరుఫున ఏఏజీ జె. రామచంద్రరావు వాదనలు వినిపించారు. రద్దయిన చట్టంలో ఏమేరకు హక్కులున్నాయో అవే కొత్త చట్టంలోనూ ఉంటాయని చెప్పారు. పాత చట్టంలోని అంశాలకు కొత్త చట్టంలోని అంశాలతో పొంతన కుదరకపోతే పాత చట్టంలోని అంశాలన్నీ రద్దయిపోతాయని గుర్తు చేశారు. ఎర్రమంజిల్‌కు పాత నిబంధన ప్రకారం రక్షణ ఉందని పేర్కొంది. ఒకవేళ నిబంధనను జీవో 183 కింద రద్దు చేసినప్పటికీ మాస్టర్‌ప్లాన్‌లో కొనసాగుతున్నందున, దానికి రక్షణ ఉందని భావిస్తున్నా మంది. అందువల్లే హెచ్ఎండీఏ అనుమతి తీసుకున్నారా అని ప్రశ్నించామంది.