Prapancha Telugu

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  teluguabroad.com@gmail.com 

హెచ్‌ఎండీఏ లక్ష గజాలు ఆన్‌లైన్‌ వేలం

హైదరాబాద్‌ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ)కు బడ్జెట్‌లో ఊహించని నిరాశ ఎదురవడంతో సొంత ఆదాయంపై దృష్టి సారించింది. ఔటర్‌ రింగ్‌ రోడ్డుకు జైకా రుణాలు, బీవోటీ అన్యూటీ పేమెంట్స్‌ కింద 2019–20కి రూ.401.38 కోట్లు చెల్లించాల్సి ఉండటంతో ఆదాయమార్గాలను అన్వేషిస్తోంది. ఇందులో భాగంగానే ఉప్పల్‌ భగాయత్‌లో అభివృద్ధి చేసి ఉన్న లక్షగజాల విస్తీర్ణ ప్లాట్లను ఈ–వేలం వేసే అంశాన్ని సీరియస్‌గా ఆలోచిస్తోంది. ఇన్నాళ్లు మున్సిపల్‌ ఎన్నికల తర్వాత ఈ–వేలం వేద్దామంటూ ఆసక్తి చూపని హెచ్‌ఎండీఏ ఉన్నతాధికారులు ఇప్పుడూ వాటిని ఆన్‌లైన్‌ వేలం వేసే దిశగా అడుగులు వేస్తున్నారు.
కేటీఆర్‌ రాకతో జోష్‌..
ఇన్నాళ్లు మున్సిపల్‌ శాఖ మంత్రి లేకపోవడంతో ఏ నిర్ణయాలు చకచకా తీసుకోలేకపోయినా ఇప్పుడూ తిరిగి కేటీఆర్‌ ఆ శాఖను చేపట్టడంతో ఈ ప్రతిపాదనను సిద్ధం చేస్తున్నారు. ఈ లక్ష గజాల విస్తీర్ణంలో ఉన్న ప్లాట్లను విక్రయించడం ద్వారా రూ.400 నుంచి రూ.600 కోట్ల ఆదాయం వస్తుందని వివరించి సాధ్యమైనంత తొందరగా అమ్మాలని ఆసక్తి చూపుతున్నారు. ఇలా వీటి విక్రయం ద్వారా వచ్చే ఆదాయంతో ఓఆర్‌ఆర్‌ జైకా రుణాలు, బీవోటీ అన్యూటీ పేమెంట్‌లు మార్గం సులభం కానుంది. దీంతోపాటు ఇప్పటికే మే 5న ల్యాండ్‌ పూలింగ్‌ నోటీఫికేషన్‌ ఇచ్చిన అధికారులు ఆసక్తి చూపిన రైతుల భూములను తీసుకొని విక్రయించడం ద్వారా మరో రూ.600 కోట్ల ఆదాయం రాబట్టాలని ఆలోచిస్తున్నారు.
మళ్లీ ఉప్పల్‌భగాయత్‌ వరమే…
హెచ్‌ఎండీఏకు మరోమారు ఉప్పల్‌ భగాయత్‌ ‘మహా’ వరంగా మారుతోంది. ఇప్పటికే ఈ ఏడాది ఏప్రిల్‌ 7,8 తేదీల్లో 67 ప్లాట్లను ఆన్‌లైన్‌ వేలం ద్వారా విక్రయించగా రూ.677 కోట్లు హెచ్‌ఎండీఏ ఖజానాలోకి వచ్చి చేరిన సంగతి తెలిసిందే. ఈ ఆదాయాన్ని ఓఆర్‌ఆర్‌ గ్రోత్‌ కారిడార్‌లోని రోడ్ల అనుసంధాన వ్యవస్థను, అసంపూర్తిగా ఉన్న సర్వీసురోడ్లు, రేడియల్‌ రోడ్లను నిర్మించి ప్రజలకు మెరుగైన వసతులు కల్పించే దిశగా అడుగులు వేస్తున్నారు. దీంతో పాటు ఓఆర్‌ఆర్‌ బీవోటీ అన్యూటిపేమెంట్‌ ఒక టర్మ్‌ రూ.165.69 కోట్లు ఈ ఆదాయం నుంచే సమకూర్చారు. అయితే తాజాగా 2019–20 బడ్జెట్‌లో ఓఆర్‌ఆర్‌ జైకా రుణాలు, బీవోటీ అన్యూటీ పేమెంట్‌లు పాతవాటితో కలిపి ఈ ఏడాదికి రూ.1800 కోట్లు ఇవ్వాలని హెచ్‌ఎండీఏ ప్రతిపాదనలు సిద్ధం చేస్తే కేవలం రూ.20 లక్షలను మాత్రమే కేటాయించింది. దీంతో ఈ ఏడాది చెల్లించాల్సిన రూ.401.38 కోట్లు సమకూర్చుకోవాలంటే ప్రస్తుతం సిద్ధంగా ఉన్న ఉప్పల్‌ భగాయత్‌ ప్లాట్లను ఈ–వేలం వేయడం అనివార్యమైంది. అలాగే హెచ్‌ఎండీఏ కొనసాగిస్తున్న అభివృద్ధి పనులను ఎల్‌ఆర్‌ఎస్, బిల్డింగ్, లేఅవుట్‌ పర్మిషన్ల ద్వారా వచ్చే ఆదాయంతో కొంతమేరకైనా పూర్తి చేయాలని అధికారులు ఆలోచిస్తున్నారు.
మెట్రో రాకతో మంచి డిమాండ్‌…
2005లో ప్రభుత్వం చేపట్టిన మూసీ రీవర్‌ కన్సర్వేషన్‌ అండ్‌ రివర్‌ ఫ్రంట్‌ డెవలప్‌మెంట్‌లో భాగంగా ల్యాండ్‌ పూలింగ్‌ కింద ఉప్పల్‌ భగాయత్‌ రైతుల నుంచి 733 ఎకరాలను సేకరించింది. ఇందులో మెట్రో రైలు డిపో, జలమండలి మురుగు శుద్ధి నీటి కేంద్రం, మూసీ సుందరీకరణ ప్రాజెక్టుకు కొంత కేటాయించింది. మిగిలిన 413.32 ఎకరాల్లో 20,00,468 చదరపు గజాల్లో ఉప్పల్‌ భగాయత్‌ పేరు మీద లే అవుట్‌ను అభింఋద్ధి చేసింది. రాష్ట్ర విభజన, కోర్టు కేసులు, యూఎల్‌సీ భూములు ఉండటంతో భూములు కోల్పోయిన రైతులకు ఆలస్యంగానైనా 2017 మార్చిలో 1,520 మంది రైతులకు లాటరీ రూపంలో ప్లాట్లు కేటాయించారు. ఎకరం భూమి కోల్పోయిన వారికి వేయిగజాలు చొప్పున కేటాయించారు. 8,84,205 చదరపు గజాల్లో లే అవుట్‌లు చేస్తే7,58,242 చదరపు గజాలు 1,520 మందికి ప్లాట్లు ఇచ్చారు. వీరికిపోను అభివృద్ధి చేసిన 1,25,963 చదరపు అడుగుల్లో ఉన్న 67 ప్లాట్లను ఈ ఏడాది ఏప్రిల్‌ ఏడు, ఎనిమిది తేదీల్లో ఆన్‌లైన్‌ వేలం వేయగా రూ.667 కోట్ల ఆదాయం సమకూరింది. అయితే ఇందులో రెండు ప్లాట్ల బిడ్డర్లు హెచ్‌ఎండీఏ నియమ నిబంధనల ప్రకారం అసలులో 25 శాతం డబ్బును చెల్లించకపోవడంతో రద్దు చేశారు. అయితే ఇప్పుడూ అందుబాటులో ఉన్న లక్ష గజాల విస్తీర్ణం ప్లాట్లలో ఎక్కువగా 200 నుంచి రెండు వేల గజాల మధ్య ఉన్నవే అత్యధికంగా ఉన్నాయి. ప్లాట్‌ సైజు, లోకేషన్‌ బట్టి గజానికి ధరను రూ.30వేల నుంచి రూ.35 వేల వరకు నిర్ణయించే అవకాశముందని హెచ్‌ఎండీఏ వర్గాలు అంటున్నాయి. ఇదికాకుండా ఉప్పల్‌ భగాయత్‌కు సమీపంలోనే మరో 120 ఎకరాల భూమి అందుబాటులో ఉండటంతో సాధ్యమైనంత తొందరగా వీటిని కూడా ప్లాట్లు చేస్తే సంస్థకు కోట్ల ఆదాయం సమకూరుతుందని లెక్కలు వేస్తున్నాయి.
ల్యాండ్‌ పూలింగ్‌ స్పీడ్‌ పెంచాల్సిందేనా..
మరోవైపు ఇప్పటికే హెచ్‌ఎండీఏ చేపట్టిన భారీ ప్రాజెక్టులతో పాటు ప్రతిపాదిత ప్రాజెక్టులను పట్టాలెక్కించేందుకు ల్యాండ్‌ పూలింగ్‌ వేగిరం పెంచాల్సిన అవసరముంది. ఈ దిశగా ల్యాండ్‌ పూలింగ్‌ విభాగ అధికారులు ఇప్పటికే ఆసక్తి చూపిస్తున్న ప్రతాపసింగారం, భువనగిరి, చౌటుప్పల్, కీసర రైతుల భూములు తీసుకొని లేఅవుట్లుగా అభివృద్ధి చేయాల్సిన అవశ్యకత ఉంది. మే ఐదున ల్యాండ్‌ పూలింగ్‌ నోటిఫికేషన్‌ విడుదల చేస్తే ఇప్పటివరకు ఏ ఒక్క ప్రాంతం విషయంలోనూ పూర్తి స్పష్టత రాలేదు. అయితే తాజా అంశాల నేపథ్యంలో ల్యాండ్‌ పూలింగ్‌ వేగిరం చేస్తేనే హెచ్‌ంఎండీఏ అభివృద్ధి ప్రాజెక్టులకు న్యాయం చేసినట్టవుతుంది. ఇప్పటికే పూర్తిస్థాయి సిబ్బందితో ఉన్న ల్యాండ్‌ పూలింగ్‌ అధికారులు ఆయా భూయజమాన్య హక్కులు గుర్తించడం, లేఅవుట్‌కు అనువైన ప్రాంతం కాదా అని నిర్ధారించుకోవడం చేస్తే ఆరు నెలల్లోనే దాదాపు నాలుగు లేఅవుట్లు అభివద్ధి చేయవచ్చని హెచ్‌ఎండీఏ వర్గాలే వ్యాఖ్యానిస్తున్నాయి.

Related Posts

Latest News Updates