Prapancha Telugu

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  info@prapanchatelugu.com

మూసాపేటలో హెచ్‌ఎండీఏ 28 ఎకరాల వేలం

హైదరాబాద్‌ విశ్వనగరం కావాలంటే నగరమే కాదు శివారు ప్రాంతాలన్నీ అభివద్ధి బాట పట్టాలి. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ లక్ష్యాన్ని చేరుకునేందుకు కీలకంగా వ్యవహరించాల్సిన హైదరాబాద్‌ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ) ఖజానాను నింపుకునే ఏ ఒక్క ప్రయత్నాన్నీ వదులుకోవడం లేదు. మియాపూర్‌లోని ఇంటర్‌ సిటీ బస్‌ టెర్మినల్, బాలానగర్‌ భారీ ఫ్లైఓవర్, బాటాసింగారం, మంగళపల్లి లాజిస్టిక్‌ హబ్‌లు, కొత్వాల్‌గూడలో ఏకో టూరిజం పార్కు, హుస్సేన్‌సాగర్‌ సుందరీకరణ, ఔటర్‌ రింగ్‌ రోడ్డుపై పూర్తిస్థాయిలో ఎల్‌ఈడీ బల్బుల ఏర్పాటు.. ఇలా అనేక ప్రాజెక్టులు చేతిలో పెట్టుకున్న హెచ్‌ఎండీఏ వాటికయ్యే వ్యయానికి కావాల్సిన కాసులు సమకూర్చుకోవడంపై దృష్టి సారించింది. ఇందులో భాగంగానే ఉప్పల్‌ భగాయత్‌ ప్లాట్లతో పాటు హెచ్‌ఎండీఏ అభివృద్ధి చేసిన లే అవుట్లలోని స్ట్రయిట్‌ బీట్‌ భూములు ఆన్‌లైన్‌ వేలం ద్వారా సుమారు రూ.750 కోట్లు రాబట్టింది. అయితే సిటీలో కీలక ప్రాంతంలో ఉన్న మూసాపేటలోని 28 ఎకరాల స్థలాన్ని విక్రయిస్తే ఒకేసారి రూ.600 కోట్ల వరకు ఆదాయం వస్తుందని అంచనా వేస్తోంది. ఆ స్థలంలో షాపింగ్‌ కాంప్లెక్స్‌ నిర్మించాలని భావించినా అదంతా పెట్టుబడితో కూడిన వ్యవహరంతో వెనక్కి తగ్గినట్టుగా తెలుస్తోంది.
శివారుల్లో అభివృద్ధి కోసం విక్రయిస్తే బెటర్‌…
దాదాపు 30 ఏళ్ల క్రితం రైతుల నుంచి 28 ఎకరాల స్థలాన్ని హెచ్‌ఎండీఏ కొనుగోలు చేసింది. అప్పటినుంచి ఈ స్థలంలో ట్రక్కులు పార్క్‌ చేస్తున్నారు. నగరానికి అవసరమయ్యే వివిధ వస్తువులు, సరుకులు తీసుకొచ్చే ఈ భారీ వాహనాల నుంచి డబ్బులు ఏమాత్రం వసూలుచేయకుండా నిలుపుకునేలా అనుమతి ఇచ్చింది. అయితే గతంలో శివారు ప్రాంతంలో ఉన్న ఈ ప్రాంతం అభివృద్ధిలో భాగంగా కీలక ప్రాంతంగా మారడంతో ఈ భూమికి ఒక్కసారిగా డిమాండ్‌ వచ్చింది. దీనికితోడు భారీ వాహనాలు నగరంలోకి రావడం వల్ల రోడ్డు ప్రమాదాలు జరుగుతుండటం, ట్రాఫిక్‌ రద్దీ పెరుగుతోందనే కారణంతో మూసాపేటలో పార్కింగ్‌ చేస్తున్న ట్రక్కులను శివారు ప్రాంతమైన హెచ్‌ఎండీఏకు ప్రభుత్వం కేటాయించిన 17 ఎకరాల్లో పార్క్‌ చేసేలా చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే ట్రక్కు యజమానులందరికీ సూచించిన హెచ్‌ఎండీఏ అధికారులు తొలుత పటాన్‌చెరులోని ఐదు ఎకరాల్లో వాహనాలు పార్క్‌ చేయడంతో పాటు డ్రైవర్లకు అవసరమైన కనీస వసతులు ఏర్పాటు చేస్తోంది. అయితే మియాపూర్‌లోని 28 ఎకరాల భూమిలో ట్రాన్సిట్‌ ఓరియంటెడ్‌ డెవలప్‌మెంట్‌ (టీవోడీ)లో భాగంగా షాపింగ్‌ కాంప్లెక్స్‌ నిర్మించి గదులను అద్దెకివ్వడం ద్వారా ఆదాయాన్ని సమకూర్చుకోవాలని భావించింది. అయితే ఇప్పటికే హెచ్‌ఎండీఏకు ఉన్న వాణిజ్య సముదాయాల్లో అనేక గదులు ఖాళీగా ఉండటం ద్వారా భారీ మొత్తంలోనే ఆదాయానికి గండి పడుతోంది. దీనికితోడు అదనంగా నిర్వహణ భారంగా ఉండటంతో చేతుల నుంచి పెట్టాల్సిన పరిస్థితి ఉంది. దీంతో ఆ ప్రాంతంలో షాపింగ్‌ కాంప్లెక్స్‌ నిర్మించడం కంటే ఆ భూమిని విక్రయించగా వచ్చే ఆదాయంతో శివారుల్లో భూమి కొనుగోలు చేయడం, లేదంటే అభివద్ధి ప్రాజెక్టులకు ఉపయోగించేలా చేస్తే బాగుంటుందని హెచ్‌ఎండీఏ అధికారులు భావిస్తున్నారు. గతంలోనే కార్యచరణదాల్చుకున్న∙ఈ ప్రతిపాదనను ప్రభుత్వం దష్టికి తీసుకెళ్లి మూసాపేట భూమిని విక్రయించే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది.
రోడ్డు ప్రమాదాలు తగ్గే అవకాశం…
రామచంద్రపురం, చందానగర్, మియాపూర్, కేపీహెచ్‌బీ, కూకట్‌పల్లి మీదుగా రాత్రి పది నుంచి ఉదయం ఎనిమిది గంటల వరకు భారీ వాహనాలను పోలీసులు అనుమతిస్తున్నారు. అయితే ఈ ప్రాంతాల్లో ఆయా సమయాల్లో ట్రాఫిక్‌ జామ్‌తో పాటు అనేక రోడ్డు ప్రమాదాలు జరిగిన ఘటనలు ఉన్నాయి. ఈ ప్రమాదాల్లో పదుల సంఖ్యలో మతి చెందగా, ఎక్కువ సంఖ్యలో క్షతగాత్రులయ్యారు. మరోవైపు మూసాపేటలో ట్రక్కులు చేస్తున్న పార్కింగ్‌ వల్ల నయాపైసా దమ్మిడీ లేకపోవడం కూడా హెచ్‌ఎండీఏను ఆలోచనలో పడేసింది. దీంతో ట్రక్కు పార్కింగ్‌ల కోసం పటాన్‌చెరులో హెచ్‌ఎండీఏ స్థలాన్ని కేటాయించి చకచక వసతులను అభివద్ధి చేస్తోంది. అంతా అనుకున్నట్టే జరిగితే మరో రెండునెలల్లో అక్కడనే ట్రక్కులు పార్క్‌ చేయనున్నారు.

Related Posts

Latest News Updates