హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ) మరొక వేలం పాటకు సిద్ధమైంది. కోకాపేట లే–అవుట్ అభివృద్ధిని ముమ్మరం చేసింది. 195.47 ఎకరాల్లో ప్లాటింగ్ చేసి విక్రయించాలని నిర్ణయించింది. దీంతో సుమారు రూ.5,850 కోట్ల ఆదాయాన్ని ఆర్జించాలని లక్ష్యించింది. అత్యాధునిక వసతులతో కూడిన సువిశాలమైన విస్తీర్ణంలో రోడ్లు, అన్ని రకాల వసతులను కల్పించనుంది. భవిష్యత్తు జనాభాను దృష్టిలో పెట్టుకొని సుమారు 120–150 అడుగుల రోడ్లు వేయాలని నిర్ణయించింది.
హెచ్ఎండీఏ గతంలో చేసిన లే–అవుట్‌కు, ఈ కోకాపేట లే–అవుట్‌కు భారీ వ్యత్యాసం ఉండేలా అధికారులు ప్రణాళికలు చేస్తున్నారు. భవిష్యత్తులో జరిగే అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని రోడ్లను, ఇతరత్రా మౌలిక వసతులను కల్పించాలని నిర్ణయించారు. ఔటర్ రింగ్ రోడ్డు సర్వీస్ రోడ్లు, శంకర్పల్లి రోడ్డుకు ఈ కోకాపేట లే–అవుట్ లింక్ ఉండేలా ప్రత్యేక ప్రణాళికలు చేస్తున్నారు.
గతంలో కోకాపేట వివాదం..
2007లో హెచ్ఎండీఏ కోకాపేటలో ఉన్న 634 ఎకరాల్లో కొంత స్థలాన్ని వేలం ద్వారా విక్రయించిన విషయం తెలిసింది. 167 ఎకరాల్లో గోల్డెన్ మైల్ ప్రాజెక్ట్ పేరుతో 100 ఎకరాలు, అంపైర్–1, 2 పేరుతో 67 ఎకరాలను విక్రయించింది. అయితే ఈ భూముల విషయం వివాదం నెలకొంది. 2017లో కోకాపేటలోని సదురు భూములన్నీ హెచ్ఎండీయేవే అని, వాటిని విక్రయించుకునే అధికారం హెచ్ఎండీఏకు ఉందని కోర్టు తీర్పునిచ్చింది. దీంతో వివాదం ముగిసి.. 634 ఎకరాలు హెచ్ఎండీఏ చేతికి వచ్చాయి. ఇందులో ముందుగా వేలం వేసిన సంస్థలకు 167 ఎకరాలు పోను, ఐటీ స్పెషల్ ఎకనామిక్ జోన్‌కు 110 ఎకరాలు, వివిధ సంఘాలకు 50 ఎకరాలను కేటాయించారు. ఇక మిగిలిన 300 ఎకరాల్లో ఇప్పుడు 195.47 ఎకరాలను లే–అవుట్ చేసి విక్రయించాలని నిర్ణయించారు.