హైదరాబాద్లో ఇళ్ల యజమానులు అధిక అద్దెలకు ఆశపడి మోసపోతున్నారు. అప్పులు చేసి ఇళ్లు కట్టుకున్న చాలా మంది ఆ సొమ్మును అద్దె రూపంలో తొందరగా వసూళు చేయాలనుకుంటారు. మరి కొందరు ఆ ప్రాంతాన్ని బట్టి అద్దెలు పెంచుతుంటారు. మరి కొందరు యజమానులు వారి అవసరాలను బేరీజు వేసుకుని అద్దెను వసూళు చేస్తుంటారు. ఇలా అద్దె వసూళుపై దృష్టి పెట్టే యజమానులు ఇంట్లో చేరిన వారిపై దృష్టి పెట్టడం లేదు. ఫలితంగా కొన్ని సందర్భంలో ఆ ఇళ్లలో హత్యలు, వ్యభిచారం, పేకాట వంటి సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి.
తర్వాత ఇబ్బందులే..
ఈ సంఘటనల తరువాత ఇంటి యజమానులు మరిన్ని ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఎందుకంటే ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ఆ ఇళ్లలో ఎవరు ఉండటానికి ముందుకురారు. ఒక వేళ విషయం తెలియకుండా చేరినా చుట్టుపక్కల వాళ్లు చెప్పిన తరువాల ఆ ఇంటిలో ఉండటానికి ఇష్టపడరు. అప్పుడు యజమానులు సంవత్సరాల పాటు అద్దెను కోల్పోయే పరిస్థితి ఉంటుంది. అందుకే యజమానులు అధిక అద్దెలకు ఆశపడకుండా ఇళ్లల్లో చేరే వ్యక్తులు ఎలాంటి వాళ్లో తెలుసు కోవాలి. వీలైతే వారి గత చరిత్రను కూడా తెలుసుకోవాలి.
అద్దెకు దిగే వారు గుర్తుంచుకోండి..
తరుచూ ఒక ఇంటికి టులెట్ బోర్డు వేలాడుతుంటే ఆ ఇంట్లో ఏదో లోపం ఉందని గుర్తించండి. ఎక్కువ కాలం ఆ ఇళ్లు కాళీగా ఉందంటే ఏదో సమస్య ఉందని భావించాలి. చుట్టుపక్కల వారిని విచారిస్తే తెలిసే అవకాశముంటుంది. చాలా ఇళ్లలో యజమానులు సవాలక్ష షరతులను విధిస్తుంటారు. అలాంటివేమైనా ఉన్నాయేమో తెలుసుకోవాలి.
నీటి సమస్య ఏదైనా..
అది లోతట్టు ప్రాంతమైతే వర్షాకాలంలో ఇబ్బందులు తప్పవని గ్రహించాలి. ఆ వీధిలో కానీ, ఆ ప్రాంతంలో కానీ తరుచూ గొడవలు లాంటివి జరుగుతున్నాయా, ఏ నేపథ్యంలో జరుగుతున్నాయో కూడా తెలుసుకోవాలి. అన్నీ తెలుసుకున్న తరువాతే ఇంట్లో దిగడం మంచిది.
యజమానులు అద్దె కోసం కక్కుర్తి వద్దు..
అద్దెకు దిగేవాళ్లు అద్దె కాస్త తగ్గించమని అభ్యర్థిస్తున్నారంటే వారు మధ్య తరగతికి చెందినవారుగా పరిగణించాలి. వారు అదే ప్రాంతంలో ఉద్యోగం కాని వ్యాపారం కాని చేస్తుంటే ఆ ఇంట్లో ఎక్కువకాలం వారు అద్దెకు ఉంటారని భావించవచ్చు. ఆ ఇంటి చుట్టుపక్కల ఉన్న విద్యా సంస్థల్లో వారి పిల్లలు చదువుతుంటే అలాంటి వారికి నిర్భయంగా అద్దెకు ఇవ్వవచ్చు. ఎందుకంటే వారి సంబంధించిన అసలు వివరాలు ఆ స్కూలు రికార్డుల్లో ఉంటాయి. అద్దె చెప్పగానే ఎంతైనా ఓకే ఆంటే అడ్వాన్సు ఇస్తున్నారంటే వారి గురించి మరోసారి ఆలోచించాలి. అద్దె ఎక్కువగా వస్తుందనుకుంటే మునుముందు కష్టాలు తప్పవు. వారు ఉపయోగించే వాహనాల నంబర్లు, ఆధార్ కార్డు నంబర్ల వంటివి సేకరించాలి. కొంతమంది ధనవంతుల ఇళ్లను గమనించి ఖాళీ అయిన సమయంలో అద్దెకు దిగుతారు. ఇంటి యజమానితో ఆప్యాయంగా ఉన్నట్లు నటించి ఎవరూ లేని సమయంలో చంపో బెదిరించో నగదు, నగలను దోచుకుని పారిపోతారు. హైటెక్ మోసగాళ్లు ఉన్నందున మరింత అప్రమత్తంగా ఉండడం మంచిది.
ఇంటి యజమానిదే బాధ్యత..
ఇంట్లో అద్దెకు దిగిన వారి పట్ల ఇంటి యజమానులే బాధ్యత. అద్దెకు దిగే వారి గురించి పూర్తిగా తెలుసుకోవాలి. వారి వద్ద నుంచి ఏదైనా గుర్తింపు కార్డు తప్పనిసరిగా తీసుకుని అగ్రిమెంట్ కూడా చేసుకోవాలి. ఫేక్ గుర్తింపు కార్డులు కూడా ఇచ్చే అవకాశముంది. వారు ఏమి చేస్తుంటారు, ఎక్కడి నుండి వస్తున్నారు, కుటుంబ సభ్యుల నేపథ్యం, ఎంత మంది ఉంటారు అన్న వివరాలను అడిగి తెలుసుకోవాలి. వివరాలు తెలుసుకోకపోతే ఎవరైనా నేరాలకు పాల్పడితే యజమాని చిక్కుల్లో పడే ప్రమాదముందని పోలీసులు గుర్తు చేస్తున్నారు.