దేశవ్యాప్తంగా సుమారు 5 లక్షల గృహాలు అసంపూర్తి నిర్మాణాలుగా ఉన్నాయని ది ఫోరం ఫర్ పీపుల్స్ కలెక్టివ్ ఎఫోర్ట్స్ (ఎఫ్‌పీసీఈ) తెలిపింది. ఆయా గృహాల నిర్మాణాలు 10 ఏళ్ల నుంచి ఆలస్యంగా ఉన్నాయని పేర్కొంది. గృహ నిర్మాణాల జాప్యం మీద ఫోరెన్సిక్ ఆడిట్ జరిపించాల ఎఫ్‌పీసీఈ అధ్యక్షుడు అభయ్ ఉపాధ్యాయ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఎఫ్‌పీసీఈ ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంవో), అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖలు రాసింది.
నిధుల మళ్లింపు..
ఆమ్రపాలి కేసులో సుప్రీం కోర్ట్ ఇచ్చిన తీర్పు దేశవ్యాప్తంగా గృహ కొనుగోలుదారుల్లో ధైర్యాన్ని నింపిందని ఎఫ్‌పీసీఈ తెలిపింది. ఆమ్రపాలి కేసు తరహాలోనే దేశంలోని అన్ని గృహాల ఆలస్యాల్లో ఫోరెన్సిక్ ఆడిట్‌కు ఆదేశించాలని ఫోరమ్ కోరింది. నిర్మాణాల జాప్యంలో భారీ స్థాయిలో అవినీతి, నిధుల మళ్లింపు వంటివి జరిగాయని తెలిపారు. మూడేళ్ల కంటే ఎక్కువ జాప్యం జరిగిన గృహ నిర్మాణ ప్రాజెక్ట్లన్నింటిలోనూ ఆడిట్‌కు ఆదేశించాలని ఎఫ్‌పీసీఈ పీఎంఓకు రాసిన లేఖలో పేర్కొన్నారు.
కుమ్మకైన బిల్డర్లు..
ఏడాది కంటే ఎక్కువ ఆలస్యమైన ప్రాజెక్ట్‌లు, వాటి ప్రమోటర్ల వివరాలు చెప్పేందుకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు సహకరించాలని కోరింది. ఆడిటర్లు, బిల్డర్లతో కుమ్మకైన వ్యక్తులు, సంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలని, గృహ కొనుగోలుదారులకు రక్షణ, భరోసా కల్పించాలని ఫోరమ్ కోరింది.
ప్రత్యేక సెల్ ఏర్పాటు..
అన్ని రాష్ట్రాలు, డెవలపర్లు, అథారిటీలు, బ్యాంక్‌లు, గృహ కొనుగోలుదారులను సమన్వయ పరిచి, దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించడానికి కేంద్ర గృహ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా సెల్‌ను ఏర్పాటు చేయాలని ఎఫ్‌పీసీఈ సూచించింది. ఆలస్యమైన ప్రాజెక్ట్‌లను పూర్తి చేయడానికి అవసరమైన నిధులను గుర్తించాలని, స్ట్రెస్ ఫండ్‌ను కేటాయించాలని కోరింది. ఆలస్యం చేసిన ప్రాజెక్ట్ ప్రమోటర్ల ఆస్తులను, ప్రాజెక్ట్‌లను నిధుల సమీకరణ కోసం వినియోగించుకోవాలని సూచించింది.