Prapancha Telugu

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  info@prapanchatelugu.com

గృహాల అమ్మకాలు డౌన్‌ డౌన్‌!

తెలంగాణ రాష్ట్రంలో గృహ నిర్మాణం రంగం మందకొడిగా నడుస్తోంది. ప్లాట్‌ల క్రయ విక్రయాలు జోరుగా సాగుతున్నా.. ఫ్లాట్‌ల అమ్మకాలు మాత్రం పడిపోతున్నాయి. దేశ వ్యాప్తంగా ఈ పరిస్థితి దారుణంగా ఉండగా, రాష్ట్రంలో కొంత మెరుగ్గానే ఉందని, అయితే ఇక్కడ కూడా కాంక్రీట్‌ నిర్మాణాల అమ్మకాలు తగ్గాయని గణాంకాలు చెబుతున్నాయి. భూముల విలువలు నింగినంటడం, ముమ్మర నిర్మాణాలు, నిర్మాణ ఖర్చులు పెరిగిపోవడంతో విల్లాలు, ఫ్లాట్‌ల ధరలు అనూహ్యంగా పెరిగాయి. ఈ ధరలకు అనుగుణంగా కొనుగోళ్లు లేకపోవడంతో గృహాల అమ్మకాల్లో వృద్ధి తగ్గింది.
9 నగరాల్లో అమ్మకాలకు 7.97 లక్షల ఫ్లాట్‌లు!
దేశంలోని తొమ్మిది ప్రధాన నగరాలలో సర్వే చేసిన ప్రాప్‌ టైగర్‌ ఏజెన్సీ ఈ ఏడాది జూన్‌ ముగిసేనాటికి 7,97,623 ఇళ్లు అమ్మకాలకు నోచుకోలేదని తేల్చింది. వీటిల్లో దాదాపు 4.13 లక్షల ఇళ్లు మధ్యతరగతి వర్గాల కోసం సరసమైన ధరల్లో రూ.45 లక్షల కోవలో ఉన్నవే కావడం గమనార్హం. అయితే కేంద్ర బడ్జెట్‌లో గృహ రుణాల వడ్డీ తగ్గింపు పరిమితిని రూ.2 లక్షల నుంచి రూ.3.5 లక్షలకు పెంచడం వల్ల ఇళ్ల ఖరీదు ఊపందుకుంటుందని నిర్మాణరంగ నిపుణులు అంచనా వేస్తున్నా.. ప్రస్తుతానికి మాత్రం నిలకడ కనిపిస్తోంది.
ఏ నగరంలో ఎంతంటే..
అందుబాటు ధరలో అమ్ముడుకాని గృహాలు ముంబై 1,39,984, పుణెలో 98,378, అహ్మదాబాద్‌లో 41,791, నోయిడాలో 35,811, కోల్‌కతాలో 30,923, గుర్గావ్‌లో 22,307, బెంగుళూరులో 20,146, చెన్నైలో 18,709, హైదరాబాద్‌లో 4,881 గృహాలున్నాయి.
స్థలాల జోరు.. విల్లాలు బేజారు..
ఇళ్ల స్థలాల కొనుగోలుకు మొగ్గు చూపుతున్న ప్రజలు డూప్లెక్స్‌ విల్లాలు, ఫ్లాట్‌లు కొనడానికి అంతగా ఆసక్తి చూపడంలేదు. విల్లాలు, ఫ్లాట్‌ల నిర్వహణ వ్యయం భారీగా ఉండడంతో పాటు ఆర్థిక స్థోమతను దృష్టిలో ఉంచుకొని కొనుగోలుదారులు స్థలాల కొనుగోలుకే ప్రాధాన్యతనిస్తున్నారు. దీంతో అత్యాధునిక వసతులతో విలాసవంతంగా నిర్మించిన గేటెడ్‌ కమ్యూనిటీ, ఆపార్ట్‌మెంట్లలోని ఫ్లాట్‌ల అమ్మకాల్లో క్షీణత కనిపిస్తోంది. ఇతర రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో ఈ పరిస్థితి కనిపిస్తే.. హైదరాబాద్‌ విషయానికి వస్తే మాత్రం ఆసాధారణంగా పెరిగిన ధరలు రియల్‌రంగంపై ప్రభావం చూపిస్తున్నాయి. ఈ రంగంలో పెట్టుబడులు కాసుల వర్షం కురిపిస్తుండడంతో నల్లధనం కూడా వెల్లువలా వస్తోంది. దీంతో భూముల విలువలు అందనంత ఎత్తుకు ఎగబాకాయి. అయితే, రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ల సంఖ్య మాత్రం దినదినాభివృద్ధి చెందుతోంది. ఆషాఢమాసంలో రూ.500 కోట్ల ఆదాయం రిజిస్ట్రేషన్ల శాఖ ద్వారా ప్రభుత్వ ఖజానాకు చేరింది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికే గత ఏడాదితో పోలిస్తే 20 శాతం అధికంగా రూ.2250 కోట్ల వరకు ఆదాయం వచ్చింది. అంటే ఇళ్ల కొనుగోలుపై దృష్టి పెట్టని వారంతా స్థలాలు, వ్యవసాయ భూముల కొనుగోలు వైపు మళ్లుతున్నట్టు అర్థమవుతోంది.
నేల చూపులు.. నింగిలో ధరలు
రెరా చట్టం అమలు.. నిర్మాణ వ్యయం పెరగడం.. డెవలప్‌మెంట్‌లో భూ యజమానికి ఇచ్చే నిష్పత్తి శాతం పెరగడం కూడా ఫ్లాట్‌ల ధరలు అనూహ్యంగా పెరగడానికి కారణంగా చెప్పవచ్చు. భూయజమానికి లెక్కకు మించి ఫ్లాట్లు ఇవ్వాల్సి రావడం, గుడ్‌విల్‌ కూడా చెల్లించాల్సి రావడంతో ఫ్లాట్ల ధరలు పెంచక తప్పడం లేదు. దీంతో నిర్మాణ సంస్థలు తగిన సమయంలో ప్రాజెక్టు పూర్తి చేసేలా అమ్మకాలు జరగడం లేదు. ఈ కారణంగా ప్రాజెక్టు అంచనా వ్యయంలో కూడా పెరుగుదల వస్తోంది. ఈ కారణాలన్నింటితో సదరు ప్రాజెక్టు పూర్తి కావాలంటే ఆ అపార్ట్‌మెంట్‌లోని ఫ్లాట్ల ధరలు క్రమేణా పెంచాల్సి వస్తోంది. ఈ క్రమంలో అమ్మకాల్లో తరుగుదల కనిపిస్తోందని ఒక ప్రముఖ బిల్డర్‌ అభిప్రాయపడ్డారు. గతంతో పోలిస్తే కొనుగోలుదారుల్లో అవగాహన పెరగడంతో నిర్మాణ సంస్థ గురించి వాకబు చేస్తున్నారు. అంతకుముందు చేపట్టిన ప్రాజెక్ట్‌ల నాణ్యత, సమయానికి ఇస్తారా లేదా వంటి విషయాలను తెలుసుకున్న తర్వాతనే కొనేందుకు ముందుకొస్తున్నారు. అన్ని అనుమతులు ఉన్నాయా? నిబంధనల మేరకు కడుతున్నారో లేదో తెలుసుకున్న అనంతరం అడుగు వేస్తున్నారు. ఈ మార్పులు మార్కెట్‌ను ప్రభావితం చేస్తున్నాయని బిల్డర్లు చెపుతున్నారు. దీంతో పాటు బడా బడా సంస్థలు స్థిరాస్తి వ్యాపారంలోకి రావడంతో భూముల విలువలు ఆకాశన్నంటాయి. ఈ నేపథ్యంలో డెవలపర్లు లాభాపేక్షతో ధరలు పెంచేయడం.. సౌకర్యాలకు తగ్గట్టుగా చదరపు అడుగుల చొప్పున ధరలను నిర్దేశించడంతో ఫ్లాట్‌లు అందుబాటులో లేకుండా పోయాయి. దీనికితోడు గచ్చిబౌలి, మాదాపూర్, చందానగర్, మేడ్చల్, కొంపల్లి, కొండాపూర్, నార్సింగి, మంచిరేవుల, నెక్నాంపూర్, మణికొండ, హైదర్షాకోట్‌ ప్రాంతాల్లో ఐటీ కంపెనీల తాకిడితో టెకీలు వ్యయం ఎక్కువైనా ఫ్లాట్‌ల కొనుగోలు చేస్తున్నారు. అదే సమయంలో గేటెడ్‌ కమ్యూనిటీ, బడా సంస్థలు నిర్మించే ప్రాజెక్టుల్లో విల్లాలను కొనేందుకు సంపన్నవర్గాలు, సెలబ్రిటీలు ఆసక్తి చూపుతున్నారు. అయితే, ఇదే తరహాలో నగరంలోని ఇతర ప్రాంతాల్లో నిర్మిస్తే మాత్రం వాటిని అమ్మడం బిల్డర్లకు తలప్రాణం తోకకు వస్తోంది. దీంతో బడా సంస్థలు కూడా మూతపడాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఇక, రాజధాని మినహాయిస్తే సెమీ అర్బన్‌ ప్రాంతాల్లోనూ గృహ నిర్మాణాలు, అమ్మకాలు ఈ మధ్య కాలంలో తగ్గిపోవడం గమనార్హం.
నిర్మాణరంగం స్థిరంగా వృద్ధి..
గ్రేటర్‌ హైదరాబాద్‌ నగరంలో నిర్మాణరంగం శరవేగంగా పురోగమించడంతోపాటు స్థిరంగా వృద్ధి రేటు సాధిస్తోందని క్రెడాయ్‌ తెలంగాణ చాచాప్టర్‌ అధ్యక్షులు జి.రాంరెడ్డి తెలిపారు. గత కొంత కాలంగా రియల్‌ఎస్టేట్‌ కార్యకలాపాలు మందగించినప్పటికీ ఇప్పడు ట్రెండ్‌ మారింది. ప్రభుత్వం తీసుకొచ్చిన టీఎస్‌ఐపాస్, ఐటీ, హార్డ్‌వేర్‌ పాలసీలతో పలు ప్రముఖ సంస్థలు నగరం వైపు దృష్టిసారించాయి. ఇతర మెట్రో నగరాలతో పోలిస్తే ఆఫీస్‌ స్పేస్, రెసిడెన్షియల్‌ ఫ్లాట్ల ధరలు నగరంలోనే అందుబాటు ధరల్లో ఉన్నాయి.

Related Posts

Latest News Updates