ఈ ఏడాది ఆగస్టు నెల ప్రారంభం నుంచే తెలుగు పండుగలతో స్వాగతం పలుకుతోంది. పంద్రాగస్టుతో మొదలై రాఖీ పౌర్ణమి, శ్రీ కృష్ణ జన్మాష్టమి ఇలా వరుస పర్వదినాలు ఒకవైపు ఆనందాన్ని నింపుతుంటే.. మరోవైపు రెండేళ్ల క్రితం ఇదే ఆగస్టు నెలలో బీభత్సమైన వర్షాలతో తీవ్ర ప్రాణ, ఆస్తి నష్టాలు భయగొల్పుతున్నాయి.
ఆగస్టు నెల అంటే చాలు పాతబస్తీ ప్రజలు జడుసుకుంటున్నారు. ఎందుకంటే ఆగస్టు మాసంలో సాధారణంగా వర్షాలు ఎక్కువగా పడడం, పురాతన భవనాలు కుప్పకూలడంలాంటి ప్రమాదకర సంఘటనలు గతంలో ఎన్నో చోటు చేసుకున్నాయి. ఈ నెలలో వర్షాలు పడుతున్నాయంటే శిథిలావస్థకు చేరిన పురాతన భవనాల పట్ల స్థానికులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. నిజాం కాలం నాటి గోడలు తడిసి ముద్దయి కూలి పోవడానికి సిద్దంగా ఉన్నాయి. దారులకు ఇరువైపులా అక్కడక్కడా ఈ పురాతన భవ నాలు ఉండడంతో వాటి పక్క నుంచి వెళ్లడానికి పాదచారులు, వాహనదారులు జంకుతున్నారు.
మరమ్మత్తులపై అధికారుల కినుకు..
శిథిలావస్థకు చేరిన భవనాలకు మరమ్మతులు చేపట్టాల్సి ఉండగా ఆ దిశలో సంబంధిత యజమానులు స్పందించడం లేదు. చిన్నపాటి వర్షానికే ఈ పురాతన భవ నాలు నెలకొరుగుతున్నాయి. ప్రాణనష్టంతో పాటు ఆస్తినష్టం సంభవించాయి. ఇలాంటి దుర్ఘటనలు పునరావృతం కాకుండా సంబంధిత అధికారులు వెంటనే స్పందించాల్సిన అవసరం ఉంది. ఎన్నో ఏళ్లుగా ఎలాంటి మరమ్మత్తులకు నోచుకోకుండా పూర్తిగా శిథిలావస్థకు చేరుకున్న పురానాపూల్ డివిజన్లోని ఎస్వీనగర్ క్యార్టర్లకు వెంటనే మరమ్మత్తులు చేయాల్సిన అవసరం ఉందని స్థానికులు కోరుతున్నారు. ఇప్పటికే అక్కడక్కడ పెచ్చులూడి ప్రమాదకరంగా మారాయని ఎప్పుడు ఏం జరుగుతుందోననే భయాందోళన తమలో ఉందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
నోటీసులతో సరి..
జీహెచ్ఎంసీ చార్మినార్ జోన్ పరిధిలోని సంబందిత అధికారులు కేవలం నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకుంలున్నారు. ప్రమాదకరంగా మారిన శిథిలావస్థకు చేరిన పురాతన భవనాల పట్ల అప్రమత్తంగా వ్యవహరించడం లేదు. ఎవరైనా ఫిర్యాదులు చేసి ఉన్నతాధికారుల ద్వారా వత్తిడి తీసుకొచ్చిన వాటినే అక్కడక్కడ ఒకటి, రెండు పురాతన భవనాలను కూల్చివేస్తున్నారు తప్పా క్షేత్ర స్థాయిలో పరిశీలన చేయడం లేదనే ఫిర్యాదులున్నాయి.
సమన్వయ లోపం..
ఇంజనీరింగ్ విభాగం, టౌన్ ప్లానింగ్ విభాగం అధికారుల నడుమ సమన్వయ లోపం కారణంగా ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా తయారైంది పురాతన భవనాల పరిస్థితి. చార్మినార్ జోన్ పరిధిలో మలక్‌పేట్ సర్కిల్–6, సంతోష్‌నగర్ సర్కిల్–7, చాంద్రాయణగుట్ట సర్కిల్–8, చార్మినార్ సర్కిల్–9, ఫలక్‌నుమా సర్కిల్–10, రాజేంద్రనగర్ సర్కిల్–11 పరిధిల్లో పలు పురాతన భవనాలున్నాయి. శిథిలావస్థకు చేరుకుని కూలడానికి సిద్దంగా ఉన్న పురాతన భవనాల తాజా పరిస్థితులు సంబందిత అధికారుల వద్ద ఉన్నప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు.
గతంలో ఆగస్టులో చోటు చేసుకున్న సంఘటనలివే..
– 9 ఆగస్టు 2008లో: ఏకదాటిగా కురిసిన భారీ వర్షానికి పాతబస్తీ పంజెషాలోని పురాతన ఇళ్లు కూలి ముగ్గురు కుటుంబ సభ్యులు అక్కడికక్కడే మృతిచెందగా ఇద్దరు స్వల్ప గాయాలకు గురయ్యారు.
– 9 ఆగçస్టు 2008లో: కోట్ల అలీజా లోని రాయల్ ఎంబసీ స్కూలు పక్కనున్న పురాతన భవనం గోడ కూలిపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఆ సమయంలో అక్కడున్న విద్యార్థులు అప్రమత్తంగా ఉండడంతో ఎలాంటి ప్రమాదం జరగలేదు.
– 9 ఆగçస్టు 2008లో: మదీనా వద్ద గల ఆర్.డి డ్రెస్సెస్, మదీనా ఎంబ్రాయిడరీ హౌజ్, విద్యామిషన్ తదితర వ్యాపార సముదాయాల పురాతన భవనాలు కుప్పకూలాయి.
– 18 ఆగస్టు 2009లో: రాత్రి కురిసిన భారీ వర్షానికి హెరిటేజ్ కట్టడమైన యునానీ ఆసుపత్రి భవనం (మక్కా మసీదు వైపు ఉన్న) ప్రధాన గోపురం, చార్మినార్ వైపు ఉన్న మినార్ల పెచ్చులు కుప్పకూలాయి.
– 31 ఆగస్టు 2009లో: ఒకే రోజు రెండు పురాతన భవనాలు, రెండు ఇళ్ల గోడలు నెలకొరిగాయి. కోమటివాడి బోదేఅలీషా కిడికిలో ఓ పెంకుటిల్లు నేలకొరిగింది. కోమటివాడి ప్రధాన రోడ్డుపై ఓ పురాతన భవనం కుప్పకూలింది. అలాగే దక్షిణ మండలం డిసిపి కార్యాలయం ప్రహారీగోడ కూడా కూలిపోయింది. చార్‌కమాన్ రోడ్డులోని ఓ ఇంటి పురాతన గోడ కూలింది.
– 25 ఆగస్టు 2010లో: ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాలకు డబీర్‌పురా– దారుషిఫాలో రాత్రి 12 గంటలకు అరవై ఏళ్లకు పైబడిన పురాతన భవనంలోని కొంత భాగం కుప్పకూలింది. ఈ భవనంలో ఎనిమిది మంది కుటుంబ సభ్యులుండగా… జరీనాఖాన్ అనే మహిళ తీవ్ర గాయాలకు గురయ్యింది.
– 25 ఆగస్టు 2010లో: డబీర్‌పురాలో మరో పురాతన భవనం గోడ కూలిపోయింది. ఈ సంఘటనలో అదృష్టవశాత్తు ఎవరూ గాయపడలేదు. రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది.
– 30 ఆగస్టు 2010లో: రోజంతా కురిసిన భారీ వర్షానికి ఫూల్బాగ్లోని అహ్మద్ కాలనీలోని ఓ ఇళ్లు కుప్పకూలడంతో సోహేల్, హీనా, తహేర్ అనే చిన్నారులు అక్కడికక్కడే మృతి చెందగా… సబియా అనే మహిళ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించింది.