Prapancha Telugu

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  info@prapanchatelugu.com

అక్రమ నిర్మాణాలను కూల్చరు! సీజ్‌ చేస్తారు!!

తెలంగాణలో అక్రమ నిర్మాణాలను ఇక కూల్చరు.. సీజ్‌ చేస్తారు. ఎందుకంటే అక్రమ నిర్మాణాలను కూల్చివేసినా.. వాటిని తిరిగి నిర్మిస్తుండటంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిసింది. అక్రమ నిర్మాణాలపై వార్తాపత్రికల్లో కథనాలు వచ్చినప్పుడో, హైకోర్టు మందలించినప్పుడో జూలు విదిల్చినట్లు హడావుడి చర్యలు చేపడుతున్న అధికారులు ఆ తర్వాత పట్టించుకోవడం లేరు. మరోవైపు కూల్చివేతల సందర్భంగా అక్రమంగా జరిగిన నిర్మాణాలను పూర్తిగా కూల్చకుండా గోడలకు అక్కడక్కడా కొన్ని రంధ్రాలు చేసి వదిలేస్తున్నారు. తిరిగి వాటిని పట్టించుకోవడం లేరు. రెండు మూడు నెలలు కాగానే ఆ రంధ్రాలను పూడ్చివేసుకుంటున్నారు. దీంతో అనుమతి లేకున్నా ఏమీ ఫరవాలేదనే ధీమాతో అనుమతి పొందిన దానికంటే అదనపు అంతస్తులు వేస్తున్నవారు రోజురోజుకూ పెరిగిపోతున్నారు. ఈ సంవత్సరం ఆరంభం నుంచే జీహెచ్‌ఎంసీ అధికారులు ఆరొందలకు పైగా ఇలాంటి అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు. ఇటీవలే అక్రమ నిర్మాణాలపై మునిసిపల్‌ పరిపాలన శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ అర్వింద్‌కుమార్‌ సీరియస్‌కావడంతో నెలన్నర క్రితం సర్వే జరపగా ప్రస్తుతం నిర్మాణాలు జరుగుతున్న వాటిల్లోనూ 156 స్ట్రెచ్‌ల్లో 455 అనుమతి లేని నిర్మాణాలు జరుగుతున్నట్లు గుర్తించారు.
పార్కింగ్, రిటైల్‌ అన్నీ సీజ్‌..
మరోవైపు టౌన్‌ప్లానింగ్‌ అధికారుల అండదండలతోనే అక్రమ నిర్మాణాలు వెలుస్తున్నాయనే విమర్శలున్నాయి. ఉన్నతాధికారులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా, ఎన్ని హెచ్చరికలు చేస్తున్నా క్షేత్రస్థాయి అధికారులు భవన యజమానులతో కుమ్మక్కవుతుండటంతో అక్రమ నిర్మాణాలు ఆగడం లేవనే అభిప్రాయాలున్నాయి. మూడు అక్రమ నిర్మాణాలు కూల్చివేసేలోగా ఆరు అక్రమనిర్మాణాలు పుట్టుకొస్తున్నాయి. నగరంలో భూముల విలువ ఎక్కువగా ఉండటం, అద్దెల డిమాండ్‌ కూడా అధికంగా ఉండటంతో రెండంతస్తులకు మాత్రమే అనుమతులుండేచోట నాలుగంతస్తులు వేస్తున్నారు. తద్వారా కట్టే అదనపు పోర్షన్లతో అద్దెల ద్వారా భారీ ఆదాయం రావడమే ఇందుకు కారణమని అధికారులు భావిస్తున్నారు. అక్రమ నిర్మాణాలను కూల్చివేసేందుకు వెళ్లిన వారు మొత్తం భవనాన్ని నేలమట్టం చేయడం లేరు. అనుమతి పొందిన దానికంటే అదనంగా కట్టిన అంతస్తులనే కూల్చివేస్తున్నారు. అక్రమ నిర్మాణాన్ని మాత్రమే కూల్చివేయాలి కనుక కేవలం వాటినే కూలుస్తున్నామని, వాటి కూల్చివేతల వల్ల అనుమతి పొందిన కింది అంతస్తులు దెబ్బతినకూడదు కాబట్టి అక్రమ అంతస్తులను సైతం పూర్తిగా కూల్చకుండా కేవలం కొద్దిపాటి రంధ్రాలు చేస్తున్నట్లు అధికారులు ఒప్పుకొంటున్నారు. దీన్ని అవకాశంగా మలచుకొని కూల్చిన కొద్దిరోజులకే యజమానులు తిరిగి పూడ్చివేస్తున్నారు. ఈ తంతు నిరోధించే మార్గాలను అన్వేషించిన అధికారులు ఇకపై అక్రమంంగా నిర్మించిన నిర్మాణాలను అధికారికంగా సీజ్‌ చేయాలని భావిస్తున్నారు. ఫైర్‌సేఫ్టీ ఏర్పాట్లు, పార్కింగ్‌ సదుపాయాలు, లైసెన్సుల్లేని బార్లు, పబ్బులను సీజ్‌ చేసినట్లుగానే అక్రమ నిర్మాణాలను కూడా సీజ్‌ చేయాలని భావిస్తున్నారు. తద్వారా అక్రమంగా నిర్మాణం జరిపినా వినియోగానికి అవకాశం ఉండదు కనుక భవిష్యత్‌లో అక్రమంగా అదనపు అంతస్తులు నిర్మించకుండా ఉంటారని భావిస్తున్నారు. దీంతోపాటు సీజ్‌ చేసిన వాటిని భవన యజమానులే కూల్చివేసేలా కూడా చర్యలు తీసుకోనున్నారు. తద్వారా జీహెచ్‌ఎంసీకి కూల్చివేతల పని తప్పడంతో పాటు మున్ముందు అనుమతుల్లేకుండా అదనపు అంతస్తులు నిర్మించేవారు ఇక వాటి జోలికి పోరని భావిస్తున్నారు. వీటికి సంబంధించి తగిన విధివిధానాలను రూపొందించి త్వరలో అమలు చర్యలు చేపట్టనున్నట్లు జీహెచ్‌ఎంసీ చీఫ్‌సిటీప్లానర్‌ ఎస్‌. దేవేందర్‌రెడ్డి ‘సాక్షి’కి తెలిపారు.
ఆగని అక్రమ అంతస్తులు..
నగరంలో జరుగుతున్న అక్రమ నిర్మాణాకు, అధికారులు జరుపుతున్న కూల్చివేతలకు పొంతన ఉండటం లేదు. వీరు కొన్ని కూల్చేలోగా ఎన్నో పుట్టుకొస్తున్నాయి. కూల్చివేసినవి సైతం తిరిగి మళ్లీ కడుతున్నారు. ఈ సంవత్సరం ఆరంభంనుంచి ఇప్పటి వరకు 600కు పైగా అక్రమ నిర్మాణాల్ని కూల్చివేసినట్లు జీహెచ్‌ఎంసీ ప్రకటించింది.

Related Posts

Latest News Updates