Prapancha Telugu

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  teluguabroad.com@gmail.com 

సొంతింటి ఎంపికలో మహిళలదే పైచేయి

మహిళలకు బంగారానికి మించిన ఇన్వెస్ట్‌మెంట్‌ లేదు. కానీ, గత కొంతకాలంగా పసిడి ధర పెరుగుతోంది. దీంతో మహిళలు పెట్టుబడి రూట్‌ మార్చారు. ప్రాపర్టీల కొనుగోళ్లలో ఆసక్తి చూపిస్తున్నారు. మహిళలకు స్టాంప్‌ డ్యూటీ, గృహ రుణ వడ్డీ రేట్లలో తగ్గింపులు, పన్ను ప్రయోజనాలుండటంతో గృహాల కొనుగోళ్ల వైపు మళ్లుతున్నారు. దేశంలోని 42 శాతం మంది మహిళలు రియల్టీలో పెట్టుబడులకు ఆసక్తిగా ఉన్నారని అనరాక్‌ కన్జ్యూమర్‌ సెంటిమెంట్‌ సర్వే తెలిపింది. 30 శాతం మంది ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు, 17 శాతం మంది బంగారం బెస్ట్‌ ఆప్షన్‌గా ఎంచుకుంటున్నారని సర్వే పేర్కొంది.
మారుతున్న ప్రపంచంలో ఇల్లు తన పేరు మీద ఉండటం అత్యంత భద్రంగా భావిస్తుంది నేటి మహిళ. అందుకే ఇంటి యజమానిగా లేదా సహ–యజమానిగా ఉండేందుకు ఇష్టపడుతున్నారు. గతంలో ఇంటి వసతుల విషయంలో మాడ్యులర్‌ కిచెన్, పూజ గది, గార్డెన్‌ వంటి వాటికి ప్రాధాన్యమిచ్చే స్త్రీలు.. నేడు పురుషులతో సమానమైన వసతులను కోరుకుంటున్నారు. విస్తీర్ణం విషయంలోనూ నేటి మహిళలు రాజీ పడట్లేదు. 80 శాతం మంది మహిళలు పెద్ద సైజు గృహాలనే కోరుకుంటున్నారు. 1,000–1,250 చ.అ. 2 బీహెచ్‌కే, 1,250–2,000 చ.అ. 3 బీహెచ్‌కే నిర్మాణాలనే ఎంపిక చేస్తున్నారు. 60 శాతం మహిళలు రూ.80 లక్షల లోపు ఇళ్ల కొనుగోళ్లకు, 52 శాతం మహిళలు గృహ ప్రవేశానికి సిద్దంగా ఉన్న గృహాల కోసం ఆసక్తిగా ఉన్నారు.
స్టాంప్‌డ్యూటీలో మినహాయింపులు..
మన దేశంలోని కొన్ని రాష్ట్రాలు గృహ కొనుగోళ్ల వైపు మహిళలను ఆకర్షించేందుకు స్టాంప్‌ డ్యూటీలోనూ మినహాయింపులు ఇస్తున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో అయితే పట్టణ, గ్రామీణ వేర్వేరు ప్రాంతాలను బట్టి స్టాంప్‌ డ్యూటీలో తగ్గింపులున్నాయి. ఆయా రాష్ట్రాలను బట్టి ఇది 1–2 శాతంగా ఉంది. ఢిల్లీ, ఉత్తర్‌ప్రదేశ్, రాజస్థాన్, పంజాబ్, హర్యానా వంటి రాష్ట్రాల్లో మహిళలకు స్టాంప్‌ డ్యూటీలో సడలింపులున్నాయి. ఉత్తర్‌ప్రదేశ్‌లో 7 శాతం స్టాంప్‌ డ్యూటీ ఉండగా.. మహిళలకు మాత్రం మొత్తం చార్జీల మీద రూ.10 వేలు తగ్గింపు ఉంది. కొందరు పురుషులు ఏం చేస్తున్నారంటే? స్టాంప్‌ డ్యూటీ చార్జీలను తగ్గించుకునేందుకు ముందుగా మహిళల పేరు మీద రిజిస్ట్రేషన్‌ చేసి.. కొంత కాలం తర్వాత ఇంట్లోని పురుషుల పేరు మీద తిరిగి రిజిస్ట్రేషన్‌ చేస్తున్నారు. గోవా వంటి కొన్ని రాష్ట్రాలు కనీసం ఏడాది లోపు గృహాల రీ–రిజిస్ట్రేషన్స్‌ మీద నిషేధం విధించాయి. సంయుక్త ఆంధ్రప్రదేశ్‌ సమయంలో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి హాయంలో రాష్ట్రంలో మహిళల పేరు మీద ప్రాపర్టీ రిజిస్ట్రేషన్‌ చేపిస్తే స్టాంప్‌ డ్యూటీలో 2 శాతం తగ్గింపు ఉండేది. కానీ, ఆయన అనంతరం దీన్ని ప్రభుత్వాలు అటకెక్కించాయి.
అందుబాటు గృహాలు ఓన్లీ లేడీస్‌..
ప్రభుత్వం కూడా మహిళ గృహ కొనుగోలుదారులకు అదనపు పన్ను రాయితీలు, ప్రయోజనాలను అందిస్తుంది. దీంతో ప్రాపర్టీ కొనుగోళ్ల మీద మహిళల ఆసక్తి మరింత పెరిగింది. అందుబాటు గృహాలను కేవలం మహిళల యజమాని లేదా సహ–యజమాని ఉండాలన్న నిబంధనను కేంద్రం తప్పనిసరి చేసింది. ఇల్లు మహిళ పేరు మీద లేదా కో–ఓనర్‌గానైనా ఉన్నట్లయితే అందులోనూ సంపాదించే మహిళ అయితే భార్యభర్తలిద్దరూ వ్యక్తిగతంగా పన్ను తగ్గింపులు పొందే వీలుంది.
బ్యాంక్‌ వడ్డీ రేట్లూ తక్కువే..
పురుషులతో పోలిస్తే మహిళలకు గృహ రుణాల్లోనూ సడలింపులున్నాయి. ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ వంటి బ్యాంక్‌లు మహిళలకు తక్కువ వడ్డీ రేట్లకు రుణాలను అందిస్తున్నాయి. బ్యాంక్‌ను బట్టి ఇది 1 శాతం వరకుంటుంది.

Related Posts

Latest News Updates