మన దేశంలో మెట్రో నగరాల్లో జలఘంటికలు మోగుతున్నాయి. తాగునీరు కోసం కోట్లాది మంది అల్లాడుతున్నారు. తాజాగా వరల్డ్ వాటర్ ఫోరం విశ్వవ్యాప్తంగా 400 మహానగరాలపై నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. మహానగరాల్లో తాగునీటి ఎద్దడి ఎదుర్కొంటున్న ప్రధాననగరాలపై అర్భన్ వాటర్ బ్లూ ప్రింట్ నివేదిక విడుదల చేసింది.
చెన్నై ఫస్ట్; కోల్కతా సెకండ్..
నీటి ఎద్దడి తాజా జాబితాలో చెన్నై, కోల్కతా సిటీలు ఒకటి, రెండు స్థానాల్లో నిలిచాయి. ఇక ఈ జాబితాలో 11వ స్థానంలో ముంబాయి సిటీ నిలిచింది. దేశరాజధాని ఢిల్లీ 15వ స్థానాన్ని ఆక్రమించింది. ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్ నగరంలోనూ భూగర్భజలాలు అథఃపాతాళంలోకి చేరుకున్నాయి. విచక్షణారహితంగా బోరుబావుల తవ్వకం, నీటివినియోగం అనూహ్యంగా పెరగడంతో పాతాళగంగ అడుగంటుతోంది. గతేడాదితో పోలిస్తే పలు మండలాల్లో సరాసరిన 2 నుంచి 5 మీటర్ల మేర భూగర్భజలమట్టాలు తగ్గడం ఆందోళన కలిగిస్తోంది. పరిస్థితి ఇలాగే కొనసాగితే 2030 నాటికి గ్రేటర్ సిటీలోనూ చెన్నై దుస్థితి తలెత్తుతుందని ఈ నివేదిక స్పష్టంచేయడం గమనార్హం.
చెన్నైకి ట్రెయిన్లో నీటి సరఫరా..
చెన్నై నగరానికి తాగు నీరందిస్తోన్న రెండు జలాశయాలు వట్టిపోవడంతో తీవ్ర నీటిఎద్దడి నెలకొంది. నీటి కరువుతో పలు హాస్టళ్లు మూతపడ్డాయి. పది బిందెల నీటి కోసం మహిళలు ట్యాంకర్ల వద్ద పానీపట్టు యుద్ధాలు చేస్తున్నారు. చెన్నై సిటీకి త్వరలో రైలు వ్యాగన్లలో తాగునీటిని సరఫరా చేసేందుకు అక్కడి ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్న విషయం విదితమే. మన నగరంలో ఆ దుస్థితి రాకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానిది, ప్రజలదేనని నిపుణులు స్పష్టంచేస్తున్నారు.
మహా నీటికరువు..
శివారు ప్రాంతాల్లో గేటెడ్ కమ్యూనిటీలు, స్వతంత్ర గృహాలు, బహుళ అంతస్తుల భవంతుల నిర్మాణం ఊపందుకోవడం, కాంక్రీటు మహారణ్యాలు విస్తరిస్తున్న కారణంగా వర్షపు నీరు నేలగర్భంలోకి ఇంకే దారులు లేకపోవడం, భూగర్భ జలాల వినియోగం రెట్టింపవుతున్న కారణంగా పాతళగంగ అడుగంటింది. మరోవైపు జలమండలి సరఫరాచేస్తున్న నల్లానీరు ఏమూలకూ సరిపోవడంలేదు. సిటీలో నిత్యం 465 మిలియన్ గ్యాలన్ల నీటిని 9.80 లక్షల నల్లాలకు సరఫరా చేస్తోంది. ప్రతీ వ్యక్తికీ తలసరిగా 75 లీటర్ల నీరు అందుతోంది. కానీ ఇతర అవసరాలకు భూగర్భజలాలే ఆధారం కావడం.. ప్రస్తుతం భూగర్భజలాలు అడుగంటడంతో పరిస్థితి ఆందోళన కలిగిస్తోంది.
గతంలోనే స్పష్టంచేసిన నీతి ఆయోగ్..
దేశంలోని 21 మెట్రో నగరాల్లో 2020 నాటికి పాతాళగంగ ప్రస్తుతం ఉన్న మట్టం కంటే అథఃపాతాళంలోకి చేరుకునే ప్రమాదం ఉందని.. తక్షణం మేలుకోకపోతే 2030 నాటికి పరిస్థితి మరింత విషమిస్తుందని నీతి ఆయోగ్ ఇటీవల విడుదల చేసిన ‘కంపోజిట్ వాటర్ మేనేజ్మెంట్ ఇండెక్స్’ నివేదికలో హెచ్చరించింది. తక్షణం మేలుకోని పక్షంలో 2030 నాటికి దేశజనాభాలో సుమారు 40 శాతం మందికి స్వచ్ఛమైన తాగునీరు అందడం కనాకష్టంగా మారనుందని ఆందోళన వ్యక్తంచేసింది. ప్రధానంగా ఢిల్లీ, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ నగరాల్లో భూగర్భజలాలను విచ్చలవిడిగా తోడడం, వర్షపునీటిని నేలగర్భంలోకి ఇంకించేందుకు అవసరమైన రీఛార్జింగ్ పిట్స్ అవసరమైన మేరకు అందుబాటులో లేకపోవడంతో ఏటా భూగర్భజలమట్టాలు సుమారు 0.5 మీటర్ల చొప్పున అడుగంటుతుండడంతో పరిస్థితి విషమిస్తోందని స్పష్టంచేసింది.