రూ.56,200! ఇది దేని ధరో తెలుసా? ముంబైలోని ఓ ప్రాపర్టీ ప్రైజ్! ముంబైలో మరీ ఇంత చీపా అనుకోకండి.. ఎందుకంటే ఇది ప్రాపర్టీ మొత్తం కాస్ట్ కాదు.. జస్ట్ చదరపు అడుగు (చ.అ.) ధర. దేశంలోని అత్యంత ఖరీదైన ప్రాంతంలో దక్షిణ ముంబైలోని టార్డియో ప్రాంతం నిలిచింది. ఇక, మన హైదరాబాద్‌లో అత్యంత ప్రీమియం ప్లేస్ మాదాపూర్. ఇక్కడ ధర చ.అ.కు రూ.6,500.
దేశంలో 2013 నుంచి 2019 జూన్ మధ్య కాలంలో ప్రారంభమైన లగ్జరీ ప్రాపర్టీలు, వాటి ధరలను విశ్లేషిస్తూ అనరాక్ ప్రాపర్టీ కన్సల్టెంట్స్ సర్వే చేసింది. వీటి ఆధారంగా టాప్–10 లగ్జరీ మార్కెట్స్ జాబితాను విడుదల చేసింది. వీటిల్లో ముంబైలోని టార్డియో ప్రాంతం తొలి స్థానంలో నిలిచింది. ఆ తర్వాత వరుసగా చెన్నై, ఎన్సీఆర్, పుణే, కోల్కత్తా నగరాల్లోని పలు ప్రాంతాలు నిలిచాయి. అత్యంత ప్రీమియం లొకేషన్స్‌లో బెంగళూరు, హైదరాబాద్‌లోని ఒక్క ప్రాంతానికీ చోటు దక్కకపోవటం గమనార్హం.
వృద్ధికి కారణం సూపర్ రిచ్ కమ్యూనిటే
సామాన్య, మధ్య తరగతిలో ఆర్ధిక ఇబ్బందులు, కెరీర్, భవిష్యత్తు లక్ష్యాలు వంటి వాటిల్లో చిక్కుకున్నప్పటికీ.. లగ్జరీ గృహాల అమ్మకాలు వృద్ధికి కారణం సూపర్ రిచ్ కమ్యూనిటే. ప్రస్తుతం దేశంలో 3.42 లక్షల మంది మిలియనీర్లు ఉన్నారని, వీరి సంపద విలువ 6 ట్రిలియన్ డాలర్లను నివేదిక తెలిపింది. 2023 నాటికి ఈ సంఖ్య 5.26 లక్షల మిలియనీర్లకు, 8.8 ట్రిలియన్ డాలర్ల సంపదకు చేరుతుందని అంచనా. భూముల లభ్యతలో కొరత, నిర్మాణ వ్యయం పెరుగుదల వల్లే ప్రాపర్టీల ధరలు వృద్ధికి కారణమని అనరాక్ ప్రాపర్టీ కన్సల్టెంట్స్ చైర్మన్ అనూజ్ పూరీ తెలిపారు.
ఆధునిక వసతుల్లో ఆర్గానిక్కు చోటు..
2013 నుంచి నేటి వరకు టార్డియోలో 1,100 లగ్జరీ గృహాలు వచ్చాయి. ఆయా ప్రాపర్టీల సగటు విస్తీర్ణం 1,690 చ.అ. వర్లీ, మహాలక్ష్మి ప్రాంతాల్లో 9,600 ప్రీమియం ప్రాపర్టీలు వచ్చాయి. ముంబైలో ప్రీమియం ప్రాపర్టీల్లో ఆధిపత్యం 2, 3 బీహెచ్‌కే అపార్ట్మెంట్లదే. ఆయా ఫ్లాట్ల విస్తీర్ణం గరిష్టంగా 1,690 చ.అల. నుంచి 3,500 చ.అ. మధ్య ఉన్నాయి. రేస్ కోర్స్, సముద్ర వ్యూస్, ఆధునిక వసతులు, ప్రైవసీ వంటివి ఈ ప్రాపర్టీల ప్రత్యేకతలు. కొంత మంది డెవలపర్లు అయితే ఆయా లగ్జరీ ప్రాజెక్ట్స్‌ల్లో ఆర్గానిక్ గార్డెన్, ఆర్గానిక్ కేఫ్, హెర్బ్ గార్డెన్ వంటివి ఏర్పాటు చేస్తున్నారు.
హైదరాబాద్‌లో ప్రీమియం ధర రూ.6,500
దక్షిణాది నగరాల్లో అత్యంత ప్రీమియం రియల్టీ మార్కెట్ చెన్నైది. నున్గంబక్కమ్లో ధర చ.అ.కు రూ.18 వేలు, ఎగ్మోర్‌లో రూ.15,100, అన్నానగర్‌లో రూ.13 వేలుగా ఉంది. ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. ముంబైలోని ప్రీమియం ప్రాపర్టీ సగటు విస్తీర్ణం కంటే చెన్నైలోని ప్రాపర్టీల విస్తీర్ణం 17 శాతం ఎక్కువ. ఇక్కడ లగ్జరీ యూనిట్ సైజ్ 2,190 చ.అ. నుంచి 2,890 చ.అ.లుగా ఉన్నాయి.
– గృహ విభాగంలో దేశంలోనే అత్యంత ఖరీదైన టాప్–10 ప్రాంతాల జాబితాలో హైదరాబాద్, బెంగళూరులకు చోటు దక్కలేదు. ప్రైమరీ మార్కెట్స్‌ను పరిగణలోకి తీసుకుంటే.. బెంగళూరులో అత్యంత లగ్జరీ ప్రాంతం రాజాజీనగర్. ఇక్కడ ధర చ.అ.కు రూ.11,500. కోరమంగళంలో రూ.10,600, జగ్జీవన్‌రామ్ నగర్లో రూ.10 వేలుగా ఉన్నాయి. ఇక, హైదరాబాద్‌లో అత్యంత లగ్జరీ ప్రాంతం మాదాపూర్ నిలిచింది. ఇక్కడ ధర చ.అ.కు రూ.6,500. ఆ తర్వాతి ప్రీమియం ప్రాంతాలు హైటెక్ సిటీలో రూ.6,200, గచ్చిబౌలిలో రూ.5,700లుగా ఉన్నాయి. సెకండరీ మార్కెట్లో బంజారాహిల్స్, జూబ్లిహిల్స్ ప్రాంతాలు నిలిచాయి. ఇక్కడ ధర చ.అ.కు రూ.6 వేల నుంచి రూ.14 వేల వరకున్నాయి.