Prapancha Telugu

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  teluguabroad.com@gmail.com 

ఓపెన్‌ ప్లాట్లకూ రుణాలు లభిస్తాయ్‌

బ్యాంక్‌లు, ఎన్‌బీఎఫ్‌సీల ఆర్ధిక ఇబ్బందులతో రియల్‌ ఎస్టేట్‌ రంగం పీకల్లోతు కష్టాల్లో ఉంది. ఇలాంటి సమయంలో రియల్టీ ప్రాజెక్ట్‌లకు నిధులు సమీకరించడం సాధ్యమయ్యే పనేనా? ఎస్‌.. సాధ్యమే అంటున్నారు ఏషియా పసిఫిక్‌ డైరెక్టర్‌ రాధాకృష్ణ. కాకపోతే మూడేళ్ల లోగా ప్రాజెక్ట్‌ నుంచి ఎగ్జిట్, స్థానిక మార్కెట్‌ పరిస్థితులు, పారదర్శక లావాదేవీలు వంటి షరతులుంటాయని చెబుతున్నారు. పూర్తి వివరాలు ఆయన మాటల్లోనే..


బ్యాంక్‌లు, ఎన్‌బీఎఫ్‌సీల నిధుల కొరతతో రియల్టీ ప్రాజెక్ట్‌లకు రుణాలు అంత ఈజీగా దొరకటం లేదు. కొత్త ప్రాజెక్ట్‌లకు లోన్స్‌ సంగతి దేవుడెరుగు.. నిర్మాణంలో ఉన్న ప్రాజెక్ట్‌లకూ ఫండింగ్‌ దొరకటం కష్టంగా మారింది. నాలుగు గోడల ఇంటికి కాలం చెల్లింది. కాంక్రీట్‌ భవనాలకు కొనుగోలుదారులు స్వస్తి పలికేశారు. సాంకేతికతను వినియోగించే టెకీ భవనాలు, ఆధునిక వసతులుండే విలాస గృహాలకు జై కొడుతున్నారు. సౌర విద్యుత్, హోమ్‌ ఆటోమేషన్, ఎస్‌టీపీ, రెయిన్‌ హార్వెస్టింగ్‌ వంటి ఏర్పాట్లు ఉన్న గృహాల కొనుగోళ్లకే మద్దతు పలుకున్నారు. కొనుగోలుదారులు, పెట్టుబడిదారులు ఇద్దరూ ఈ తరహా ప్రాజెక్ట్‌ల పెట్టుబడులకే మొగ్గుచూపుతున్నారు. అందుకే డెవలపర్లు కూడా ఇలాంటి ప్రాజెక్ట్‌ల నిర్మాణాలనే చేపట్టాలి. దీంతో బ్యాంక్‌లు, ఎన్‌బీఎఫ్‌సీల నుంచి రుణాలు, ప్రైవేట్‌ ఈక్విటీ ఇన్వెస్టర్ల నుంచి పెట్టుబడులు వస్తాయి.
బ్యాంక్‌లు, పీఈలతో ఒప్పందం..
నిర్మాణ సంస్థలకు, బ్యాంక్స్‌. ఎన్‌బీఎఫ్‌సీలు, పీఈ సంస్థలకు మధ్య వారధిలా పనిచేస్తూ.. ప్రాజెక్ట్‌ ఫండింగ్‌ను సమకూర్చడమే ఏషియా పసిఫిక్‌ సంస్థ ప్రత్యేకత. హైదరాబాద్‌లో 30, బెంగళూరులో 20 నిర్మాణ సంస్థలు దీని కస్టమర్లుగా ఉన్నాయి. ఎల్‌ అండ్‌ టీ, టాటా, బజాజ్, హెచ్‌డీఎఫ్‌సీ, ఎల్‌ఐసీ, మోతీలాల్‌ బస్వాల్, ఏఎస్‌కే, ఫుల్‌ట్రన్, ఐఏఎఫ్‌ఎల్, వాల్టన్‌స్ట్రీట్‌ క్యాపిటల్, జేఎం ఫైనాన్స్, ఐసీఐసీఐ వెంచర్స్, అర్థవేద వంటి కంపెనీలతో ఒప్పందం చేసుకుంది. రియల్‌ ఎస్టేట్, హాస్పిటల్, ఎడ్యుకేషన్, ఎంఎస్‌ఎంఈ, ట్రేడ్‌ ఫైనాన్స్‌ రంగాల్లో నిధులను సమకూర్చి పెడుతుంది.
రూ.1,500 కోట్ల ఫండింగ్‌..
గత పదిహేను ఏళ్లలో ఏషియా పసిఫిక్‌ కస్టమర్లకు రూ.3–4 వేల కోట్ల ఫండింగ్‌ను సమకూర్చి పెట్టింది. గతేడాది 80 లక్షల చదరపు అడుగుల్లోని ప్రాజెక్ట్‌లకు రూ.500 కోట్ల పెట్టుబడులను సమీకరించి పెట్టాం. ప్రైవేట్‌ ఈక్విటీ నుంచి 25 శాతం పెట్టుబడులు వచ్చాయి. సాకేత్‌ గ్రూప్‌లో వాల్టన్‌స్ట్రీట్‌ క్యాపిటల్, ఎస్‌ఎంఆర్‌లో ఎల్‌ఐసీ వెంచర్‌ క్యాపిటల్, జీకేలో అర్థవేద ఇన్వెస్ట్‌ చేశాయి. వచ్చే ఏడాది కాలంలో రూ.1,500 కోట్ల ఫండింగ్‌ చేయించనున్నాం. ఒక్కో ప్రాజెక్ట్‌ కనిష్ట ఫండింగ్‌ విలువ రూ.50 కోట్లుగా ఉంటుంది. కనీసం లక్ష చదరపు అడుగుల్లో ప్రాజెక్ట్‌లను పూర్తి చేసి, ఆర్ధిక క్రమ శిక్షణతో పాటూ సిబిల్‌ స్కోర్‌ బాగుండే డెవలపర్లకు ఫండింగ్‌లో ప్రాధాన్యత ఇస్తాం. వార్షిక వడ్డీ రేటు 14 నుంచి 16 శాతం మధ్య ఉంటుంది.

లే–అవుట్‌ ప్రాజెక్ట్‌లకూ రుణాలు..
గృహ నిర్మాణ ప్రాజెక్ట్‌లకే కాకుండా ఓపెన్‌ ప్లాటింగ్‌ వెంచర్లకు కూడా నిధులను సమకూరుస్తాం. ఇటీవలే వెస్ట్రన్‌ కన్‌స్ట్రక్షన్‌ కంపెనీకి యాప్రాల్‌ దగ్గర వెస్ట్రన్‌ బ్లిస్‌ ఓపెన్‌ ప్లాట్‌ వెంచర్‌కు ఫండింగ్‌ చేసిచ్చాం. ఓపెన్‌ ప్లాట్ల మార్కెట్‌ బాగుండి, మంచి అనుభవం ఉన్న డెవలపర్లకు ఫండింగ్‌ చేస్తాం. ప్లాటింగ్‌ వెంచర్‌లో నిర్మాణ వ్యయం తక్కువగా ఉంటుంది. స్థలం కొన్న తర్వాత రోడ్లు, లైటింగ్, ఎలక్ట్రిసిటీ వంటి ఖర్చులకు మినహా పెద్దగా వ్యయం కాదు. అందుకే స్థలం కొనేందుకు కూడా లోన్లను ఇప్పిస్తాం. 5 ఎకరాల లోపు చేసే ఓపెన్‌ ప్లాట్‌ వెంచర్లకు, రూ.100 కోట్ల వరకూ ప్లాటింగ్‌ వెంచర్లకు ఫండింగ్‌ చేయిస్తాం. పేరున్న డెవలపర్లకు లేదా కనీసం 10 ఓపెన్‌ లే–అవుట్స్‌ చేసిన కంపెనీలకు ఫండింగ్‌ చేయిస్తాం.

Related Posts

Latest News Updates