జూబ్లీహిల్స్ రోడ్ నెం. 34లో ప్లాట్ నంబర్ 623ఎఫ్ వెనుకాల ఉన్న స్థలంలో షేక్‌పేట మండల రెవెన్యూ అధికారులు ప్రభుత్వ హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేశారు. గత నెల 15వ తేదీన ఓల్డ్ సిటీకి చెందిన హరికృష్ణ అనే వ్యక్తి ఇక్కడున్న 428 గజాల స్థలాన్ని కబ్జా చేశారంటూ షేక్‌పేట మండల తహసిల్దార్ వెంకట్‌రెడ్డి జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా హరికృష్ణతో పాటు మరో ముగ్గురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఈ ప్లాట్ తనదేనని రిజిస్ట్రేషన్ కూడా జరిగిందని ఇందులోకి పోలీసులు గాని, రెవెన్యూ అధికారులుగాని అడుగు పెట్టవద్దని కోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిందని హైకోర్టు ఆదేశాలు ధిక్కరించి రెవెన్యూ అధికారులు స్థలంలోకి అక్రమంగా ప్రవేశించారంటూ హరికృష్ణ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. రెవెన్యూ అధికారులపై కోర్టు ధిక్కరణ కేసు నమోదు చేయాల్సిందిగా ఆయన వరుసగా మూడు సార్లు జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఓ వైపు ఈ ఫిర్యాదు పోలీస్‌స్టేషన్‌లో విచారణలో ఉండగానే తాజాగా మండల అధికారులు ఈ స్థలంలో మరోసారి హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేశారు. ఇది ప్రభుత్వానికి చెందిందని అధికారులు అంటుండగా పూర్తిగా ప్రై వేట్దని అన్ని పత్రాలు ఉన్నాయంటూ హరికృష్ణ వాధిస్తున్నారు.