తెలంగాణ ప్రజల సొంతింటి కల కలగానే మిగిలిపోతుంది. మేడ్చల్ –మల్కాజిగిరి జిల్లాలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణ పనులు చేపట్టి మూడేళ్లు గడిచినప్పటికిని, లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియతోపాటు పంపిణీ కార్యక్రమాన్ని అధికార యంత్రాంగం చేపట్టలేకపోతోంది. జిల్లాలో వివిధ బస్తీలు, ప్రాంతాల్లో 1050 డబుల్ బెడ్ ఇళ్ల నిర్మాణాలు పూర్తయినప్పటికిని, పంపిణీకి ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ లేకపోవటం వల్ల అధికార యంత్రాంగం ముందుకు కదలలేక పోతున్నది. జిల్లాలో లక్ష్యానికి అనుగుణంగా పూర్తి స్థాయిలో ఇళ్ల నిర్మాణం పూర్తి చేయక ముందే… కొంత మంది లభ్థిదారులకు మాత్రమే ఇళ్లు పంపిణీ చేయటం వల్ల… సమస్య క్లిష్టంగా మారటంతోపాటు ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్న వందలాది నిరుపేద కుటుంబాలకు ఏం జవాబు ఇవ్వాలన్న అభిప్రాయంతో నిమ్మకున్నట్లు తెలుస్తున్నది.
రూ.150 కోట్లతో నిర్మాణాలు..
జిల్లాలో నిరుపేద కుటుంబాల సొంతింటి కలను నిజం చేసేందుకు ప్రభుత్వం రూ.150 కోట్ల వ్యవయంతో 2840 డబుల్ బెడ్రూమ్ ఇళ్లను మంజూరు చేసింది. జిల్లాలో 12ప్రాంతాల్లో ఇప్పటి వరకు 1050 ఇళ్ల నిర్మాణాలు పూర్తి కాగా, మిగతా 1790 డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణాలు చివరి దశలో ఉన్నాయి. ఇందులో 40 శాతం ఇళ్ల పరిస్థితి మాత్రం టెండర్లు, బేసిమెంట్ ప్రక్రియల్లో కొనసాగుతుంది. ఈ ఇళ్ల పనులు సకాలంలో పూర్తయ్యేలా జిల్లా మంత్రి ,కొత్త ఎన్నికైన ప్రజాప్రతినిధులు , అధికార యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారిస్తే తప్ప ముందడగు పడే పరిస్థితి కనిపించటం లేదు. అలాగే పూర్తయిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను అర్హులైన లబ్ధిదారులకు కేటాయించే పనిలో భాగంగా జిల్లా అధికారయంత్రాంగం కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తున్నది. జిల్లాలో గృహా నిర్మాణ శాఖను ప్రభుత్వం రద్దు చేయటంతో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణ బాధ్యతలను ఆర్అండ్ బి, పీఆర్ శాఖలు నిర్వహిస్తున్నాయి. ఇదిలా ఉండగా,.. అర్బన్, సెమీ అర్బన్‌గా అభివద్ధి చెందుతున్న మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కోసం 1.23 లక్షల మంది నిరుపేదలు దరఖాస్తులు చేసుకుని ..ఎప్పుడేప్పుడానని ఇళ్ల కోసం ఎదురు చూస్తున్నారు.
ఇళ్ల నిర్మాణాలు ఇలా ..
జిల్లాలో ఆర్అండ్బి శాఖ అధ్వర్యంలో12 ప్రాంతాల్లో 1050 డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం చేపట్టినప్పటికిని, ఇప్పటి వరకు 560 ఇళ్లు మాత్రమే సత్వరమే లబ్దిదారులకు కేటాయించేందుకు వీలుగా ఉన్నాయి. మిగతా ఇళ్లకు సంబందించి కరంటు,రోడ్డు తదితర ప్రాధమిక వసతులు కల్పించాల్సి ఉంది. జిల్లాలో కీసరలో 50 ఇళ్లు, యాద్గార్‌పల్లిలో 40, పీర్జాదిగూడలో 74 ఇళ్లు, పర్వతాపూర్‌లో 40, చెంగిచర్లలో 40, తుర్కపల్లిలో 40 ఇళ్లు , కిష్టాపూర్‌లో 80, సోమారంలో 30 ఇళ్లు, చీర్యాలలో 40 ఇళ్లు, బోడుప్పల్లో 74, ఘట్కేసర్లో 50 ఇళ్లు, కొర్రెములలో ఒకటి ఇళ్ల నిర్మాణాలు పూర్తయిన వాటిలో ఉన్నాయి. మిగతా 490 ఇళ్ల నిర్మాణాలు పూర్తయిన .. ఆ ప్రాంతాల్లో వసతులకు సంబంధించిన పనులు చేపట్టాల్సి ఉంది. అలాగే జిల్లాలో పంచాయతీ రాజ్ (పీఆర్) శాఖ అధ్వర్యంలో 33 ప్రాంతాల్లో 1790 డబుల్‌బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణాలు వివిధ దశల్లో కొనసాగుతున్నాయి. పీఆర్ అధ్వర్యంలో శ్రీరంగవరం, గిర్మాపూర్, గౌడవెళ్లి, రాజబోల్లారం, పూడుర్,నారాయణపూర్, అనంతారం, జగ్గంగూడ, తుర్కపల్లి, అలియాబాద్, కీసర, అంకిరెడ్డిపల్లి, తిమ్మాయిపల్లి, చీర్యాల, యాద్గార్పల్లి, కేశవపూర్, చౌదరిగూడ, నారపల్లి, అవుషాపూర్, పోచారం, ప్రతాప్‌సింగారం, మేడిపల్లి, బోడుప్పల్, పర్వాతాపూర్, లక్ష్మాపూర్,మూడు చింతలపల్లి, కేశవరం,యాడారం,ఉప్పరపల్లి, డబీల్‌పూర్, ఏదులాబాద్, శామీర్‌పేట్ ప్రాంతాల్లో 1790 డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు నిర్మాణాలు వివిధ దశల్లో సాగుతున్నాయి.