మహారాష్ట్ర లో మరో్ ట్విస్ట్ జరిగింది. తదుపరి ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్ అంటూ తెగ ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. బీజేపీ చివరికి ట్విస్ట్ ఇచ్చింది. రెబెల్స్ కి సారథ్యం వహించి, మహా వికాస్ అగాఢీ కూలిపోవడంలో కీలక పాత్ర వహించిన ఏకనాథ్ షిండేని ముఖ్యమంత్రిగా ప్రకటించింది. మహారాష్ట్ర తదుపరి ముఖ్యమంత్రిగా ఏకనాథ్ షిండే బాధ్యతలు నిర్వర్తిస్తారని మాజీ సీఎం, సీనియర్ నేత దేవేంద్ర ఫడ్నవీస్ ప్రకటించారు. దేవేంద్ర ఫడ్నవీస్, ఏకనాథ్ ఇద్దరూ గవర్నర్ భగత్ సింగ్ కోషియారీతో భేటీ అయ్యారు. ఈ భేటీ తర్వాత జరిగిన విలేకరుల సమావేశంలోనే దేవేంద్ర ఫడ్నవీస్ ఈ కీలక ప్రకటన చేశారు. తాను ప్రభుత్వానికి బయటి నుంచి మద్దతిస్తానని ప్రకటించారు.
మహారాష్ట్ర ప్రజలు గత ఎన్నికల్లో మహా వికాస్ అగాఢీకి తగిన మెజారిటీ ఇవ్వలేదని, బీజేపీకే ఇచ్చారని గుర్తు చేశారు. బీజేపీ-శివసేన కలిసే ఎన్నికల్లో పోటీ చేశాయని, అయితే.. శివసేన ఎన్సీపీ, కాంగ్రెస్ తో జట్టు కట్టిందని గుర్తు చేశారు. ఇలా చేసి.. బాలా సాహెబ్ సిద్ధాంతాన్ని కూడా పక్కన పెట్టేశారని ఎద్దేవా చేశారు.
మంత్రులు ఏకంగా జైలు జీవితం అనుభవించారని, గతంలో మహారాష్ట్ర చరిత్రలో ఎన్నడూ ఇలా జరగలేదన్నారు. బాలా సాహెబ్ ఎప్పుడూ దావూద్ ను వ్యతిరేకిస్తూ వుండేవారని, కానీ.. శివసేనలోని ఓ మంత్రి ఏకంగా దావూద్ తో కలిసిపోయారని తీవ్రంగా ధ్వజమెత్తారు. ఆ మంత్రి జైలు కెళ్లినా మంత్రి వర్గం నుంచి తొలగించలేదని, ఇది బాలాసాహెబ్ ను అవమానించడమేనని దేవేంద్ర ఫడ్నవీస్ ధ్వజమెత్తారు.