కాంట్రాక్టుల కోసమే ఎమ్మెల్యే కోమటిరెడ్డి పార్టీ మారుతున్నారన్న పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గట్టి కౌంటర్ ఇచ్చారు. తాను కేవల కాంట్రాక్టుల కోసమే పార్టీ మారుతున్నట్లు రేవంత్ నిరూపిస్తే… రాజకీయ సన్యాసం తీసుకుంటానని అన్నారు. దీనిని నిరూపించకుంటే.. పీసీసీ పీఠాన్ని రేవంత్ వదులుకుంటారా? అంటూ కోమటిరెడ్డి సవాల్ విసిరారు. రేవంత్ రెడ్డి తమ పార్టీలోకి వచ్చి, తమనే తప్పుబడుతున్నారని మండిపడ్డారు. పీసీసీ అధ్యక్ష పీఠాన్ని రేవంత్ డబ్బులిచ్చి కొన్నారని, సీఎం పదవి చేపట్టి, తెలంగాణను దోచుకోవాలన్న ప్లాన్ లో వున్నారని కోమటిరెడ్డి ఆరోపించారు. ఎప్పటికప్పుడు పార్టీలు మారే వ్యక్తులు తమపై విమర్శలు చేస్తే ప్రజలు నమ్మరని తేల్చి చెప్పారు. గతంలోనూ కాంగ్రెస్ ని రేవంత్ నోటికొచ్చినట్లు తిట్టారని, అలాంటి వ్యక్తితో తాను కలిసి పనిచేయనని కోమటిరెడ్డి తెగేసి చెప్పేశారు.
12 మంది ఎమ్మెల్యేలు పార్టీని వదిలి వెళ్లిపోతుంటే ఇప్పుడు మాట్లాడుతున్న వారంతా ఏం చేశారని సూటిగా ప్రశ్నించారు. వ్యాపారులను రేవంత్ బ్లాక్ మెయిల్ చేస్తారని, రాజకీ ముసుగులో డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. రేవంత్ ఓ ప్లాన్ ప్రకారమే తెలంగాణ టీడీపీని ఖతం చేశారన్నారు. రేవంత్ సారథ్యంలోని కాంగ్రెస్ బతికి బట్టకట్టడం అసాధ్యమని, ఓ బ్లాక్ మెయిలర్ తో తాము చెప్పించుకునే స్థితిలో లేమని స్పష్టం చేశారు.