Prapancha Telugu

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  info@prapanchatelugu.com

అభివృద్ధికి భూసేకరణే అడ్డు

గ్రేటర్‌ నగరంలో చేపట్టిన అభివృద్ధి పనులకు భూసేకరణ ప్రధాన అవరోధంగా మారింది. రాజధానిలో ట్రాఫిక్‌ చిక్కులకు చెక్‌ పెట్టేందుకు, సిగ్నల్‌ ఫ్రీ ప్రయాణానికి ఎస్సార్డీపీ (వ్యూహాత్మక రహదారుల పథకం) కింద పలు ఫ్లై ఓవర్లు, జంక్షన్ల అభివృద్ధి తదితర పనులకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. దాదాపు రూ.6,760 కోట్ల పనులకు సిద్ధమైంది జీహెచ్‌ఎంసీ.
చేసింది కొంతే.. చేయాల్సింది ఎంతో..
ఇప్పటిదాకా సుమారు రూ.300 కోట్ల మేర పనులు పూర్తిచేసి, ఆయా మార్గాల్లో ప్రజలకు ట్రాఫిక్‌ ఇక్కట్లు తగ్గించింది. మరో రూ.2,100 కోట్లకు పైగా పనులు వివిధ దశల్లో కొనసాగుతున్నాయి. భూసేకరణ, ఆస్తుల సేకరణ వంటివి అవసరం లేని ప్రాంతాల్లో వడివడిగా పనలు చేపట్టిన అధికారుల వేగానికి ప్రస్తుతం బ్రేక్‌ పడింది. ఈ పనులు పూర్తి కావాలంటే ప్రధానమైన భూసేకరణ చేయాలి. అయితే, ఆయా పనులు చేపట్టే ప్రాంతాలు డిమాండ్‌ ఉన్న ఏరియాల్లో ఉండటంతో భూసేకరణ జటిలంగా మారింది. ఎస్సార్‌డీపీ పనులతో పాటు ఆయా ప్రాంతాల్లో రహదారుల విస్తరణ, నాలాల విస్తరణకు సైతం భూసేకరణ చేయాల్సి ఉంది. ఇలా సేకరించాల్సిన ఆస్తులు వేల సంఖ్యలో ఉన్నాయి. ఈ సేకరణ పూర్తయితే కానీ ప్రాజెక్టులు ముందుకు వెళ్లలేని పరిస్థితి. ఇవి ఎప్పుడు పూర్తవుతాయో, ప్రాజెక్టుల పనులు ఎప్పుడు ముందుకెళ్తాయో ప్రస్తుతం చెప్పలేని పరిస్థితి. భూసేకరణను వేగవంతం చేసేందుకు ప్రత్యేకంగా ఒక అడిషనల్‌ కమిషనర్‌ను పర్యవేక్షణకు నియమించడంతో పాటు అదనపు సిబ్బందినీ సమకూర్చుకుంటామని కమిషనర్‌ దానకిశోర్‌ ప్రకటించారు. ఇందుకు ప్రత్యేక విభాగం ఏర్పాటై.. భూసేకరణ పనులు వేగవంతం చేయడంతో పాటు చెల్లించేందుకు నిధులూ కావాలి. ఈ నేపథ్యంలో జీహెచ్‌ఎంసీకి భూసేకరణ పెనుభారంగా మారింది. 
అండర్‌ పాస్‌ కావాలి..
ఎస్సార్డీపీలో భాగంగా ఇప్పటి వరకు చేపట్టిన వివిధ ఫ్లై ఓవర్ల పనులకు సంబంధించిన భూసేకరణకు దాదాపు 70 ఆస్తులకు అవార్డు పాస్‌ కాగా, దాదాపు 370 ఆస్తుల సేకరణకు సంబంధించి అవార్డు పాస్‌ కావాల్సి ఉంది. నగరంలోని రహదారుల విస్తరణకు సంబంధించి దాదాపు 95 ఆస్తుల సేకరణకు నోటిఫికేషన్‌ జారీ చేశారు. ఇంకో 500 ఆస్తులకు నోటిఫికేషన్‌ జారీ చేయాల్సి ఉంది. ఇక నాలాల విస్తరణకు తొలిదశలో చేపట్టే పనులకే 112 ఆస్తులకు నోటిఫికేషన్‌ జారీ చేయాలి. దాదాపు 70 ఆస్తులకు మాత్రం నోటిఫికేషన్‌ ఇచ్చారు. ఆర్‌ఓబీలు, ఆర్‌యూబీలకు సంబంధించి దాదాపు 90 ఆస్తుల సేకరణకు నోటిఫికేషన్‌ జారీ చేసిననప్పటికీ, ఇంకా 12 ఆస్తులకు నోటిఫికేషన్‌ జారీ చేయాల్సి ఉంది. ఈ పరిస్థితుల్లో భూసేకరణ ప్రక్రియ మొత్తం పూర్తయి, ఆయా స్థలాలు జీహెచ్‌ఎంసీ అధీనంలోకి వచ్చేందుకే ఎంతో సమయం పడుతుంది. అప్పటి దాకా పనులు ముందుకు సాగే పరిస్థితి లేదు. 
ఎక్కడ ఎంతంటే..
– ఎస్సార్‌డీపీలో చేపట్టిన ఫ్లై ఓవర్లు, అండర్‌పాస్‌లు వంటి పనులు జీహెచ్‌ఎంసీ ఈస్ట్, వెస్ట్, సౌత్‌జోన్లలో పురోగతిలో ఉన్నాయి. ఈస్ట్‌జోన్‌ పరిధిలోని బైరామల్‌గూడ, చింతల్‌కుంట, ఒవైసీ హాస్పిటల్, కామినేని హాస్పిటల్, ఎల్‌బీనగర్, నాగోల్‌ ప్రాంతాల్లో పనులు పూర్తి కావాలంటే మొత్తం 273 ఆస్తులకు సంబంధించి 43,620 చ.గ. స్థలం సేకరించాల్సి ఉంది. ఇందులో 227 ఆస్తులకు సంబంధించిన 38,500 చ.గ. స్థల సేకరణకు నోటిఫికేషన్‌ జారీ చేశారు. వీటితో పాటు ప్రభుత్వ భూముల్లోని 43 ఆస్తులకు సంబంధించిన 4,477 చ.గ. స్థలం కూడా జీహెచ్‌ఎంసీ పరం కావాల్సి ఉంది. 
– వెస్ట్‌జోన్‌ పరిధిలోని బయోడైవర్సిటీ జంక్షన్‌లో పనులకు 47 ఆస్తులకు సంబంధించి 16,567 చ.గ. స్థలం అవసరం. ఇందులో 24 ఆస్తుల నుంచి 14,232 చ.గ. భూసేకరణ కోసం నోటిఫికేషన్‌ జారీ చేశారు. 
– సౌత్‌జోన్‌లో బహదూర్‌పురా, ఓవైసీ హాస్పిటల్, మిథాని తదితర ప్రాంతాల్లో 45 ఆస్తులకు చెందిన 6,531 చ.గ. స్థలం అవసరం కాగా 30 ఆస్తులకు సంబంధించి 3,275 చ.గ. మేర సేకరణకు నోటిఫికేషన్‌ జారీ చేశారు. వీటిలో ఎనిమిది ఆస్తులకు చెక్కుల తయారీ పనుల్లో ఉన్నట్లు సమాచారం. వివిధ దశల్లో ఉన్న భూసేకరణ ప్రక్రియ మొత్తం పూర్తయి సదరు భూములు జీహెచ్‌ఎంసీ చేతికి వస్తేనేగాని ఈ ప్రాజెక్టులు పూర్తయ్యే అవకాశం కనిపించడం లేదు.

Related Posts

Latest News Updates