Telugu Abroad

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  teluguabroad.com@gmail.com 

భూములు కావలెను!

మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లాలో కొత్త పరిశ్రమల ఏర్పాటుకు ప్రతిపాదనలు రూపొందించిన అధికార యంత్రాంగం…భూసేకరణపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నది. హైదరాబాద్‌ నగరానికి శివారు ప్రాంతంగా పరిశ్రమలకు కేంద్ర బిందువుగా ఉన్న మేడ్చల్‌ జిల్లాలో దాదాపు పది వేల ఎకరాల భూములు నూతన పరిశ్రమల స్థాపనకు అనువుగా ఉండగా, ఇందులో 30 శాతం ప్రైవేట్‌ భూములు ఉన్నట్లు అధికార యంత్రాంగం పేర్కొంటున్నది. మిగతా 70 శాతం ప్రభుత్వ భూములు ఉన్నప్పటికీ, ఇందులో ఆక్రమణలు కూడా ఎక్కువగా ఉన్నట్లు గుర్తించిన యంత్రాంగం క్షేత్రస్థాయి నుంచి సర్వే నంబర్ల వారిగా సమగ్ర సమాచారాన్ని సేకరిస్తున్నది. ఎలాంటి వివాదాలు లేకుండా జిల్లాలో 5,194 ఎకరాల ప్రభుత్వ భూమి ఉన్నట్లు గుర్తించిన యంత్రాంగం కొత్త పరిశ్రమల స్థాపనకు అనువైనదిగా భావిస్తున్నది. అత్యధికంగా బాలానగర్, శామీర్‌పేట, ఘట్‌కేసర్, కుత్బుల్లాపూర్, బాచుపల్లి, మేడిపల్లి, కాప్రా మండలాల్లో ప్రభుత్వ భూములు ఉన్నట్లు ఇటీవల రెవెన్యూ శాఖ నిర్వహించిన సర్వేలో వెల్లడైనట్లు రికార్డులు చెబుతున్నాయి. జిల్లాలో కొత్తగా 590 భారీ, సూక్ష్మ, మధ్యతరహా పరిశ్రమలను రూ.12,523 కోట్ల పెట్టుబడులతో స్థాపించేందుకు ఔత్సాహికులు(పారిశ్రామివేత్తలు) టీఎస్‌ఐఐసీకి దరఖాస్తు చేసుకోగా..అందుకు అనుగుణంగా బాలానగర్, కుత్బుల్లాపూర్, బాచుపల్లి, మేడిపల్లి, పోచారం, ఘట్‌కేసర్, ఉప్పల్, శామీర్‌పేట, మేడ్చల్, కీసర, బోడుప్పల్, చెంగిచర్ల తదితర ప్రాంతాల్లో పరిశ్రమలకు సంబంధించి భూసేకరణపై కసరత్తు నిర్వహిస్తున్నట్లు తెలుస్తున్నది. జిల్లాలో నూతన పరిశ్రమలు ఏర్పడితే 45 వేల మందికి పైగా నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు లభించనున్నట్లు పేర్కొంటున్నది.
భూసేకరణపై యంత్రాంగం ప్రత్యేక చర్యలు
టీఎస్‌ఐఐసీ చేరిన ఔత్సాహికుల దరఖాస్తులకు పరిశీలించిన జిల్లా పరిశ్రమల శాఖ కొత్త పరిశ్రమల స్థాపనపై తమ ప్రతిపాదనలను ప్రభుత్వంతోపాటు అధికార యంత్రాంగానికి సమర్పించింది. జిల్లా రెవెన్యూ వర్గాల అంచనా ప్రకారం బాలానగర్‌ మండలంలో 700 ఎకరాల ప్రభుత్వ భూమి ఉందని లెక్కతేల్చిన రెవెన్యూ శాఖ శామీర్‌పేట మండలంలో 420 ఎకరాలు ఉన్నట్లు పేర్కొంది. అలాగే, దుండిగల్‌ గండిమైసమ్మ మండలంలో 425 ఎకరాలు, మేడిపల్లి మండలంలో 900 ఎకరాలు, ఘట్‌కేసర్‌ మండలంలో 500 ఎకరాలు, కాప్రా మండలంలో 400 ఎకరాలు, కీసర మండలంలో 417 ఎకరాలు, కుత్బుల్లాపూర్‌ మండలంలో 600 ఎకరాలు, బాచుపల్లి మండలంలో 360 ఎకరాలు, ఉప్పల్‌ మండలంలో 333.13 ఎకరాలు, మల్కాజిగిరి మండలంలో 113.06 ఎకరాలు, మేడ్చల్‌ మండలంలో 37 ఎకరాల ప్రభుత్వ భూములు ఉన్నట్లు పేర్కొంటున్నది. ఇందులో 20 శాతం ప్రభుత్వ నిరుపేదలకు అసైన్డ్‌ చేసిన వ్యవసాయ భూములుగా గుర్తించినట్లు రెవెన్యూ శాఖ అంచనా వేస్తున్నది. ఈ అసైన్డ్‌ భూములు లబ్ధిదారుల ఆధీనంలో లేని పక్షంలో స్వాధీనం చేసుకుని, ప్రభుత్వ అవసరాలకు వినియోగించనున్నట్లు ఆ వర్గాలు పేర్కొంటున్నాయి.

Related Posts

Latest News Updates