కబ్జాదారులు మరోసారి రెచ్చిపోయారు.. మండల తహసిల్దార్ గౌతమ్‌కుమార్, ఆర్ఐ నరేందర్‌రెడ్డిలపై కిరోసిన చల్లి, రాళ్లతో దాడి చేసిన ఘటన మరువక ముందే మరో ఘటన కలకలం రేపింది. అక్రమ నిర్మాణాన్ని కూల్చివేసేందుకు వెళ్లిన వీఆర్వో, వీఆర్ఏ, గిరిదావర్లపై మూకుమ్మడి దాడి చేసి తీవ్రంగా గాయపరచడంతో పరుగులు పెట్టడం సిబ్బంది వంతైంది. ఏకంగా కబ్జాదారులు రాడ్లు, కట్టెలు, రాళ్లతో కొడుతూ పరుగులు పెట్టించారు. ఈ విషయంపై తీవ్రంగా స్పందించిన కుత్బుల్లాపూర్ మండల తహసిల్దార్ గౌతమ్‌కుమార్ దాడి చేసిన నిందితులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ జగద్గిరిగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేయగా ఆరుగురు భూకబ్జాదారులపై ల్యాండ్ గ్రాబింగ్, నాన్ బెయిలబుల్ కింద కేసులు నమోదు చేయడం విశేషం.
నిన్న రాత్రి వాట్సప్‌లో కబ్జాపై ఫిర్యాదు..
కుత్బుల్లాపూర్ మండల తహసిల్దార్ గౌతమ్ కుమార్‌కు గురువారం రాత్రి ఓ వ్యక్తి సెల్ ఫోన్ నుంచి వాట్సప్‌లో కబ్జా విషయంపై ఫిర్యాదు చేస్తు మెసెజ్ పంపాడు. గాజులరామారం సర్వే నెంబరు 221 పరిధిలోని సుభాష్‌చంద్రబోస్ నగర్ లో స్థలం కబ్జా విషయం పై శుక్రవారం విచారణ చేపట్టేందుకు వీఆర్వో శ్యామ్‌కుమార్, వీఆర్ఏ, గిరిదావర్ ఉమామహేశ్వర గౌడ్ లు ఘటన స్థలానికి వెళ్లగా అప్పటికే నిర్మాణ పనులు జరుగుతున్నాయి. వెంటనే వెళ్లిన సిబ్బంది నిర్మాణాన్ని కూల్చి వేస్తుండగా భూక్జాదారులు షేక్ మౌలానా, సయ్యద్ జలీల్, మేస్త్రీ పాషా, షాదూల్, చాంద్‌పాషా, నఫీజ్‌బేగం లు ఒక్కసారిగా కూల్చివేతలు చేపడుతున్న సిబ్బందిపై రాళ్లు, కట్టెలతో దాడి చేయడంతో ప్రాణ భయంతో పరుగులు తీయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఓ క్రమంలో సిబ్బందిపై బండరాళ్లు ఎత్తి హత్యాయత్నం చేసేందుకు ప్రయత్నించడం విశేషం. సదరు సిబ్బంది వీరి దాడులను ప్రతిఘటించలేక అక్కడ నుంచి ప్రాణభయంతో పరుగులు తీస్తు ఇక్కడ చోటు చేసుకున్న ఘటనను మండల తహసిల్దార్ గౌతమ్‌కుమార్‌కు ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చారు.
హుటా హుటీన సంఘటనా స్థలానికి తహసిల్దార్..
అక్రమ నిర్మాణం చేపట్టడమే కాకుండా సిబ్బందిపై దాడి చేసిన విషయాన్ని తెలుసుకున్న మండల తహసిల్దార్ గౌతమ్ కుమార్ హుటా హుటీన అక్కడికి జగద్గిరిగుట్ట పోలీసులతో కలిసి వెళ్లారు. అక్రమ నిర్మాణాన్ని క్షణాల్లో కూల్చివేయించి సదరు వ్యక్తులపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఐపీసీ సెక్షన్ కింద ఆరుగురు కబ్జాదారులపై 557/2019, 332, 341, 34 ఐపీసీ, సెక్షన్(3), పీడీపీఎస్ యాక్ట్ కింద నాన్‌బెయిలబుల్ కేసులు నమోదు చేసినట్లు సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ తెలిపారు. దాడులకు భయపడే ప్రసక్తే లేదని, అక్రమ నిర్మాణదారులు ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని, ప్రభుత్వ స్థలాలను కాపాడే విషయంలో వెనకాడమని భూకబ్జాదారులకు గౌతమ్‌కుమార్ హెచ్చరికలు జారీ చేశారు. కబ్జాదారులు నిర్మిస్తున్న రెండు గదులను కూల్చివేసి ప్రభుత్వ స్థలంగా పేర్కొంటూ బోర్డు పాతారు.