విద్యా, వైద్యం, ఉపాధి, వ్యాపారం, వాణిజ్యం, పరిశ్రమలు ఇలా అన్ని రంగాల్లో అభివృద్ధిలో దూసుకుపోతున్న పట్టణం మేడ్చల్. పదేళ్ల క్రితం ఇదో కుగ్రామం. పట్టుచీర, తులం బంగారం, వెండి, మంచి భోజనం, కొత్త ద్విచక్ర వాహనం, బ్రాండెడ్ చెప్పులు… ఇలా ఏది కావాలన్నా అప్పట్లో హైదరాబాద్‌కు వెళ్లాల్సి వచ్చేంది. నేడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. మేడ్చల్ మార్కెట్లోని అన్నీ లభ్యమయ్యే స్థాయికి ఎదిగింది. ఒకప్పుడు జాతీయ రహదారిపైకి ఎక్కాలంటే భారీ వాహనాల రాకపోకలతో భయం వేసేది. పట్టణీకరణ వైపు ప్రపంచం అడుగులు వేస్తుండటంతో మేడ్చల్ అదే స్థాయిలో ముందడుగులు వేసి అభివృద్ధిలో దూసుకెళ్తోంది.
అందరి దృష్టి మేడ్చల్ పైనే..
ఎంఎన్సీ కంపెనీలు, ప్రధానంగా విత్తన కంపెనీలు ప్రముఖ లాజిస్టిక్ కంపెనీల గోదాంలు, రియల్ రంగంలో పేరున్న సంస్థల వెంచర్లు మేడ్చల్‌కు రావడంతో ప్రజలు మేడ్చల్‌లో నివసముండేందుకు ఇష్టపడుతుండటంతో మేడ్చల్ రూపురేఖలు మారిపోయాయి. ప్రధానంగా ఉత్తర భారతీయులు ఇక్కడి వ్యాపారంలో అడుగు పెట్టడంతో మేడ్చల్ మార్కెట్లో లభించని వస్తువు లేకుండా ఉంది. బంగారం దుకాణాలు, ద్విచక్రవాహన షోరూంలు, కార్ల మెకానిక్ షేడ్లు, ప్రఖ్యాత మాల్స్, మల్టీప్లెక్స్ థియేటర్లు, పెద్ద ఫంక్షన్ హాళ్లు, ఇలా అన్ని రకాల వ్యాపారసంస్థలు వెలిశాయి. ప్రముఖ బ్యాంకులు, పేరున్న కళాశాలలు, స్కూళ్లు, మంచి హోటళ్లు, లాడ్జీలు ఇక్కడ ఉన్నాయి. గేటెడ్ కమ్యూనిటీ వెంచర్లు, కాలుష్యం లేని ప్రాంతం కావడంతో వీఐపీలు సైతం మేడ్చల్ మండల పరిధిలో నివాసముంటున్నారు.
ఉత్తర భారతీయుల రాకతో…
ప్రధానంగా మేడ్చల్‌లో ఉత్తరభారతీయుల అడుగుపెట్టి మేడ్చల్‌లో బంగారం, హార్డ్‌వేర్ దుకాణాలు, పెయింట్స్ దుకాణాలు, ఫర్నిచర్ మాల్స్, హోల్‌సేల్ కిరాణా దుకాణాలు, ఇలా అన్ని రకాల వ్యాపారాల్లో అడుగుప్టెడంతో మార్కెట్ కు ప్రత్యేక శోభ వచ్చింది.
10 కి.మీ దూరంలో అన్ని..
44వ జాతీయ రహదారిపై ఉన్న మేడ్చల్ నుండి 10 కిలో మీటర్ల దూరంలో ఉన్న కొంపల్లి, సుచిత్ర జంక్షన్ వరకు వెళితే అన్ని వస్తువులు లభ్యమౌతుండటంతో పాటు మాల్స్, మల్లీప్లెక్స్‌లు అన్ని వస్తువులు లభ్యమవుతున్నాయి. మేడ్చల్‌తో పాటు పరిసర ప్రాంతాలు అభివ«ధ్ది చెందడంతో మేడ్చల్ అభివృధ్ది వైపు వేగంగా అడుగులు వేస్తుంది.
పెరిగిన మహిళా చైతన్యం..
గ్రామంగా ఉన్న మేడ్చల్ లో నాడు మహిళలు బయట కనబడటం కోత్త పోకడలకు దూరంగా కనిపించేవారు. మారుతున్న పరిణామాలకు అణుగునంగా మహిళా చైతన్యం పెరగడంతో మేడ్చల్ లో పదుల సంఖ్యలో బ్యూటీ పార్లర్లు,వారికి కావాల్సిన ఫ్యాషన్ దుస్తువులు అన్ని దుకాణాలు మేడ్చల్ కు వచ్చిచేరాయి. మహిళలు హైవైపై ద్విచక్రవాహనాలతో రోజు తిరుగుతుండటంతో మేడ్చల్ ఏ స్థాయిలో ఉందో స్పష్టమవుతుంది.