Prapancha Telugu

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  teluguabroad.com@gmail.com 

మేడ్చల్‌ @ ఎంజాయ్‌

ఎటు చూసినా కాంక్రీట్‌ జంగిల్‌. ఉరుకుల పరుగుల జీవితం. వాహనాల రణగొణ ధ్వనులు.. నిత్యం ఒత్తిళ్ల మధ్య గడిపే నగరవాసులకు కాసింత ఉపశమనం. ఒకింత మానసిక ప్రశాంతత. వారంతాల్లో, సెలవు రోజుల్లో ఆనందాల విడిదికి నెలవులుగా మారాయి మేడ్చల్‌ పరిసరాలు. ఈ ప్రాంతం సిటీకి మూడు వైపులా విస్తరించి ఉండటంతో కుటుంబ సభ్యులు, స్నేహితులతో ఇక్కడ ఎంజాయ్‌ చేయడానికి విచ్చేస్తున్నారు. మేడ్చల్‌ నియోజకవర్గంలో ప్రభుత్వం కొత్తగా అభివద్ధి చేసిన కండ్లకోయ ఆక్సిజన్‌ పార్క్, నారపల్లి నందనవనం, జటాయువు పార్క్, నాగారం ఆరోగ్యవనం (లంగ్స్‌ పార్క్‌)లతో పాటు శామీర్‌పేట్‌లోని జింకల పార్క్, రిసార్ట్స్‌లు, టీఎస్‌ టూరిజం రిసార్ట్‌లపై నగరవాసులు ఆసక్తి కనబరుస్తున్నారు. శని, ఆదివారాలు, సెలవు రోజుల్లో ఇక్కడ గడపడానికి మక్కువ చూపిస్తున్నారు.
కొత్తగా ఏర్పాటు చేసిన పార్క్‌ల్లో అన్ని వసతులు కలిపిస్తున్నారు. వాకింగ్‌ ట్రాక్‌లు, ఫొటో షూట్‌ పాయింట్‌లు, పిల్లలు ఆడుకునేందుకు వసతులు, పిల్లల కోసం రకరకాల రూపాల్లో చెట్ల ఆకారాలను అందంగా రూపొందించారు. ఆక్సిజన్‌ పార్క్‌లో ప్రత్యేకంగా విదేశీ పక్షులు పెంచుతున్నారు. తాబేళ్ల పార్కును అభివృద్ధి చేస్తున్నారు. యోగా సెంటర్, గెజీబో, వాటర్‌ ఫౌంటెన్, రచ్చబండ తదితరాలు ఏర్పాటు చేశారు. నాగారం ఆరోగ్య వనంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు అర్బన్‌ లంగ్స్‌ పార్కులో చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణంలో గడిపేందుకు వీలుంది. సుమారు 40 ఎకరాల అటవీ స్థలంలో వివిధ రకాల మొక్కలను పెంచుతున్నారు. శామీర్‌పేట మండల పరిధిలోని రిసార్టులు నగరవాసుల వీకెండ్‌ ఎంజాయ్‌కు చిరునామాగా మారాయి. అలంకృత, లియోనియా హాలిస్టిక్‌ డెస్టినేషన్, సెలెబ్రిటీ రిసార్ట్స్‌ల నిర్వాçహకులు వీకెండ్‌ రోజుల్లో ప్రత్యేక ప్యాకేజీలతో వాటర్‌ గేమ్స్, డేఆవుట్‌ ప్యాకేజీలు ఇస్తున్నారు. చిన్నారులు, పెద్దలు ఉత్సాహంగా, ఉల్లాసంగా నీటిలో గడిపేందుకు ప్రత్యేక ఆఫర్లను అందుబాటులోకి తెచ్చారు.

Related Posts

Latest News Updates