గ్రేటర్ హైదరాబాద్లో అరుదైన రాతి సంపద అభివద్ధి ముసుగులో అదృశ్యమవుతోంది. భూభౌతిక, ప్రకృతి మార్పుల కారణంగా సహజ సిద్ధంగా వెలిసిన అరుదైన శిలలు కాలగర్భంలో కలిసిపోతున్నాయి. మహానగరంలో సుమారు 200 ప్రాంతాల్లో అరుదైన శిలల సంపద కొలువై ఉందని.. దీన్ని సంరక్షించేందుకు వీలుగా ఈ శిలలను రాష్ట్ర చారిత్రక,వారసత్వ సంపద జాబితాలో చేర్చాలని సేవ్రాక్స్ సంస్థ డిమాండ్ చేస్తోంది.
మార్గదర్శకాలు భేఖాతరు..
ఇటీవల ఖాజాగూడా వద్దనున్న ఫక్రుద్దీన్ గుట్ట, పీరన్షా దర్గా తదితర ప్రాంతాల్లో అరుదైన శిలలను హైకోర్టు మార్గదర్శకాలను ఉల్లంఘించి అక్రమార్కులు తొలగించినట్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాగా దక్కన్ పీఠభూమిలో భాగ్యనగరానికే ప్రత్యేకమైన చారిత్రక, వారసత్వ సంపదను ఠీవీగా చాటేలా వెలిసిన అరుదైన రాతి సంపదను పరిక్షించాలని వారు కోరుతున్నారు.
మాయమైపోతున్నాయ్..
దక్కన్ పీఠభూమికి దేశంలోనే ప్రత్యేక భౌగోళిక, చారిత్రక గుర్తింపు ఉంది. అందులోనూ ఈ పీఠభూమికి గుండెకాయలా మారిన విశ్వవిఖ్యాతమైన భాగ్యనగరిలో అరుదైన రాతి కళాకృతులు, శిల్పాలను తలపించే కళాఖండాలు, విభిన్న ఆకృతుల్లో వెలిసిన విలువైన కొండలు ఒక్కొక్కటిగా మాయమౌతున్నాయి. భాగ్యనగరానికి మణిహారంలా భాసిల్లుతోన్న గ్రానైట్ కొండలు అక్రమార్కుల స్వార్థంతో హారతి కర్పూరంలా కరిగిపోతున్నాయి.
వాతావరణ మార్పులతో ఏర్పడ్డాయ్..
సుమారు 250 కోట్ల సంవత్సరాల భూభౌతిక మార్పులు, భూమి లోపలి పొరల నుంచి వెలువడిన మ్యాగ్మా విభిన్న వాతావరణ మార్పుల కారణంగా ఈ అరుదైన రాతికళాఖండాలు ఏర్పడ్డాయని జియాలజిస్టులు చెబుతున్నారు. ఈ అరుదైన శిలలను భావితరాలు చూసే భాగ్యం కోల్పోతున్నాయని సేవ్రాక్స్ ప్రతినిధులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. మహానగర విస్తీర్ణం 625 చదరపు కిలోమీటర్లు కాగా సుమారు 50 చదరపు కిలోమీటర్ల పరిధిలో నగరానికే ప్రత్యేకమైన రాతి ఆకృతులు, కళాఖండాలు సహజసిద్ధంగా వెలిశాయని పేర్కొంటున్నారు. భూభూతిక శాస్త్రవేత్తల అంచనాల ప్రకారం ఇవన్నీ కోట్ల సంవత్సరాలుగా భూనిర్మితి, వాతావరణ మార్పుల కారణంగా వెలిసినవే.
అరుదైన రాతి సంపద ఎక్కడున్నాయంటే..
నగరంలో సుమారు 200 ప్రాంతాల్లో ఇలాంటి అరుదైన రాతి ఆకృతులు కనిపిస్తాయి. పర్యాటకులు, నగరవాసులు, చారిత్రక, వారసత్వ కట్టడాలను ప్రేమించే సిటీజన్లకు ఇవన్నీ కనువిందుచేస్తాయి. ప్రధానంగా జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ల్యాంకోహిల్స్, గచ్చిబౌలి, పీరన్చెరు, దుర్గంచెర్వు, గండిపేట్, తారామతి బారాదరి, గోల్కోండ, సీతారాంభాగ్, తిరుమలగిరి, గచ్చిబౌలి, ఖాజాగూడా తదితర ప్రాంతాల్లో ఇలాంటి అరుదైన రాతి ఆకృతులు దర్శనమిస్తుంటాయి. కానీ ఇప్పుడు వీటిపై మైనింగ్ మాఫియా కన్ను పడింది. గ్రానైట్ వ్యాపారంతో కోట్లు దండుకోవాలనుకున్న స్వార్థపరులకు ఈ అరుదైన కళాఖండాలు తరచూ కల్పతరువులా మారడం ఆందోళన కలిగిస్తోంది. మరోవైపు రహదారుల విస్తరణ, అభివృద్ధి ముసుగులో అరుదైన శిలలను బ్లాస్టింగ్ చేసి తొలగిస్తున్నారు. వీటిని పరిరక్షించే విషయంలో రెవెన్యూ, పోలీసు, హెచ్ఎండీఏ విభాగాలు ప్రేక్షకపాత్రకే పరిమితం కావడం ఆందోళన కలిగిస్తోంది.