ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని 12 స్థానాలకు 12 చోట్ల గెలిపించిన నల్లగొండ జిల్లాను గుండెల్లో పెట్టుకొంటామని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. మునుగోడు ఎన్నిక ప్రచార సభలో చెప్పిన విధంగా మునుగోడుతోపాటు నల్లగొండ జిల్లాకు అన్ని రకాలుగా అండగా ఉండడానికి సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా దృష్టి సారించారని చెప్పారు. సీఎం ఆదేశాల మేరకే తామంతా జిల్లాలో అభివృద్ధి పథకాలపై ప్రత్యేక సమీక్ష పెడుతున్నామని మంత్రి వివరించారు. ఉమ్మడి జిల్లాలో రానున్న ఏడు నెలల కాలంలో రూ.1544 కోట్లు వెచ్చించి అభివృద్ధి పనులు పూర్తిచేస్తామని చెప్పారు.
ఆర్అండ్బీ, మునిసిపల్, గిరిజన, పంచాయతీరాజ్ శాఖల పరిధిలో ఈ అభివృద్ధి పనులు ఉంటాయని వెల్లడించారు. మరో 10-12నెలల్లో సాధారణ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో సాధ్యమైనంత త్వరగా అభివృద్ధి పనులు వేగవంతం చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడ్డాక ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మూడు మెడికల్ కళాశాలలు, యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్, తెలుగు ప్రజలు అబ్బురపడేలా యాదాద్రి దేవాలయ నిర్మాణం, దండు మల్కాపురం ఇండస్ట్రియల్ పార్కులో 542ఎకరాల్లో 579 యూనిట్లకు స్థల కేటాయింపు ఇప్పటికే పూర్తి చేశామన్నారు.