Prapancha Telugu

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  teluguabroad.com@gmail.com 

జీహెచ్‌ఎంసీలో అధికారులు కావలెను!

తెలంగాణ ఆదాయ వనరుల్లో ప్రధానమైంది హైదరాబాద్‌. ఇందులోనూ జీహెచ్‌ఎంసీ పాత్ర కీలకం. ఆదాయం వస్తున్నంతగా అధికారులు లేరు ఈ విభాగంలో! ప్రతివారం నిర్వహించే ‘ప్రజావాణి’కి అందే ఫిర్యాదుల్లో 80 శాతం ఈ విభాగానివే. జీహెచ్‌ఎంసీ కమిషనర్‌కు నేరుగా అందే ఫిర్యాదుల్లోనూ సింహభాగం దీనివే. ఇలా ఎన్నో బాధ్యతలున్న టౌన్‌ప్లానింగ్‌ విభాగాన్ని బలోపేతం చేయాల్సిన అవసరముందని, అందుకోసం సిబ్బందిని పెంచాలని జీహెచ్‌ఎంసీ స్టాఫింగ్‌ ప్యాట్రన్‌పై రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి ప్రసాదరావు నేతృత్వంలో ప్రభుత్వం నియమించిన కమిటీ సిఫార్సు చేసింది.
సిబ్బంది పెరగలేదు..
ఉమ్మడి రాష్ట్రంలోనే చేసిన ఈ సిఫార్సులకు అనుగుణంగా జీహెచ్‌ఎంసీ జోన్లు ఆరుకు, సర్కిళ్లు 30కి పెరిగినప్పటికీ టౌన్‌ప్లానింగ్‌ విభాగంలో సిబ్బంది మాత్రం పెరగలేదు. 18 సర్కిళ్లుగా ఉన్నప్పుడున్న సిబ్బందితోనే ఇప్పటికీ నెట్టుకొస్తున్నారు. మరోవైపు జీహెచ్‌ఎంసీలో అవినీతి జరిగే విభాగాల్లోనూ ఇదే ముందు వరుసలో ఉంటోంది. కానీ అవినీతి అక్రమాలు వెలుగు చూసినా ఎవరిపై చర్యలు ఉండవు. అందుకు కారణం ఈ విభాగంలో అధికారులు, సిబ్బంది కొరతే. అసలే అరకొర సిబ్బంది.. ఇక వారిపైనా చర్యలు తీసుకుంటే పనుల్లో మరింత జాప్యమవుతుందని ఉన్నతాధికారులు ఊర్కుంటున్నారు. 
మూడో వంతు మాత్రమే… 
కమిటీ సిఫార్సుల మేరకు జీహెచ్‌ఎంసీలోని వివిధ విభాగాల్లో 2,607 మంది అవసరం. టౌన్‌ప్లానింగ్‌ విభాగంలో 452 మంది పనిచేయాల్సి ఉంది. కానీ ప్రస్తుతం 124 మందే ఉన్నారు. అంటే మూడో వంతు మాత్రమే. దీంతో అన్ని పనుల్లోనూ జాప్యం జరుగుతోంది. పనులతో పాటు కోర్టు కేసులు ఎక్కువగా ఉండేదీ ఈ విభాగానికే . దానివల్ల అధికారుల సమయం హరించుకుపోతోంది. అనుమతులు, ఓసీల జారీ తదితర ఆన్‌లైన్‌లో అందుబాటులోకి తేవడంతో కొంత వెసులుబాటు కలిగినప్పటికీ… ఆన్‌లైన్‌లో దరఖాస్తుతో పాటు జత చేయాల్సిన పత్రాలన్నీ సవ్యంగా ఉన్నదీ? లేనిదీ? పరిశీలించేందుకు తగిన సమయం కావాలి. ఇలా వివిధ కారణాలతో అక్రమ నిర్మాణాలపై ఎప్పటికప్పుడు తగిన చర్యలు తీసుకోలేకపోతున్నారనే అభిప్రాయాలు ఉన్నాయి. దీంతో నగరంలో విచ్చలవిడిగా వెలుస్తున్న అక్రమ నిర్మాణాలకు అడ్డుకట్ట పడడం లేదు. 
నియామకాల్లో జాప్యం 
టౌన్‌ప్లానింగ్‌ విభాగానికి 400 మందికి పైగా కావాల్సి ఉన్నప్పటికీ… 200 పోస్టుల భర్తీకి మాత్రమే ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఆ మేరకు టీఎస్‌పీఎస్సీ ద్వారా నోటిఫికేషన్‌ వెలుడినప్పటికీ నియామక ప్రక్రియ పూర్తి కాలేదు. జోన్ల విభజన, గతేడాది ఎన్నికలతో కోడ్‌ అమల్లో ఉండడం తదితర కారణాలతో ఈ పోస్టులు భర్తీ కాలేదు. కమిటీ సిఫార్సుల నాటికి, ఇప్పటికి పరిస్థితులు చాలా మారాయి. నగరంలోని వివిధ ప్రాంతాల్లో ముఖ్యంగా శివార్లలో ఇళ్ల నిర్మాణాలు ఊపందుకున్నాయి. బహుళ అంతస్తుల భవనాల దరఖాస్తులూ పెరుగుతున్నాయి. అయినా సిబ్బంది మాత్రం పెరగకపోవడంతో తిప్పలు తప్పడం లేదు. 
కొరత ఇలా..
జీహెచ్‌ఎంసీకి ప్రధాన కార్యాలయంతో సహ జోన్లు, సర్కిళ్లలో పనిచేసేందుకు 60 మంది బిల్డింగ్‌ ఇన్‌స్పెక్టర్లు అవసరం కాగా 21 మంది మాత్రమే ఉన్నారు. సర్కిల్‌కొకరు చొప్పున కనీసం 30 మంది సర్వేయర్లు అవసరం కాగా అసలే లేరు. టీపీఓ/టీపీఏలు 224 మంది కావాల్సి ఉండగా,34 మంది మాత్రమే ఉన్నారు.  డ్రాఫ్ట్‌మెన్‌ 47 మందికి గాను 22 మంది, ఏసీపీలు 52 మందికి గాను 33 మంది, డీసీపీలు 30 మందికిగాను 12 మంది, సీపీలు ఐదుగురికి గానుఒక్కరు, అడిషనల్‌ సీపీలు నలుగురికిగాను ఒక్కరు మాత్రమే ఉన్నారు. ఈ ఖాలీలను వివరిస్తూ వెంటనే భర్తీ చేయాల్సిందిగా అధికారులు ప్రభుత్వానికి నివేదించినప్పటికీ, ఎప్పటికి భర్తీ అవుతాయో తెలియని పరిస్థితి నెలకొంది.

Related Posts

Latest News Updates