ఒకప్పుడు అమ్మలా ఆదరించింది. నాన్నలా సేదతీర్చింది. బాటసారులకు కడుపు నింపింది. వలసజీవులకు నీడనిచ్చింది. అతిథులకు ఆలవాలంగా నిలిచింది. అదే నాంపల్లి సమీపంలోని పురాతన సరాయి. ఉర్దూ భాషలో సరాయి అంటే అతిథి గృహం అని అర్థం. ఒకనాడు ఎంతోమంది ప్రయాణికులను సేవలందించిన ఈ సరాయి ప్రస్తుతం పరాయిలా మారింది. ఆలనాపాలనా కరువై కునారిల్లిపోతోంది. వందేళ్ల ఘన చరిత కలిగిన నాంపల్లి సరాయిపై ప్రత్యేక కథనం.
కుతుబ్ షాహీలు, అసఫ్ జాహీల పాలనా కాలంలో మసీదుల్లో, దేవాలయాల్లో, ఆషూర్ఖనాలు నిర్మించేటప్పుడు వీటికి ఆనుకొని అతిథి గృహాలు సైతం కట్టించేవారు. ఆ రోజుల్లో ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్లినప్పుడు ప్రయాణికుల సౌకర్యార్థం ప్రతి నగరంలో అతిథి గృహాలు ఉండేవి. కుతుబ్షాహీలు, నిజాం నవాబుల కాలంలో ప్రభుత్వపరంగా బాటసారుల కోసం అతిథి గృహాలు ఉండేవి. ఇందులో బాటసారులు సేదతీరేందుకు వసతులు ఉండేవి. భోజనాలు కూడా వడ్డించేవారు. నగరానికి వచ్చే బాటసారుల కోసం వివిధ ప్రదేశాల్లో ముసాఫిర్ఖానా (బాటసారుల అతిథి గృహం) పేరుతో భవనాలు ఉండేవి. కాలగమనంలో నగరంలో హోటళ్లు, లాడ్జీలు విరివిగా అందుబాటులోకి వచ్చాయి. ప్రభుత్వ అతిథిగృహాలకు ఆదరణ తగ్గింది. దీంతో నిర్వహణ లేక ఆయా భవనాలు శిథిలావస్థకు చేరుకున్నాయి.
ఎందరికో నీడనిచ్చి..
ఇప్పడంటే హైదరాబాద్లో చేతిలో డబ్బులు లేకుంటే పూట కూడ గడువదు. కానీ అరవై ఏళ్ల క్రితం నగరానికి ఎవరొచ్చినా అమ్మలా అన్నం పెట్టి, నాన్న మాదిరిగా ఆశ్రయిమిచ్చే ప్రదేశాలు పలు చోట్ల ఉన్నాయంటే అతిశయోక్తి కాదు. నాంపల్లి రైల్వే స్టేషన్ ప్రయాణికుతో నిత్యం రద్దీగా ఉండే ప్రదేశం. గ్రామీణ ఇతర ప్రాంతాల నుంచి ఎంతో మంది ఇతర పనులపై నగరానికి వస్తూండేవారు. ఇప్పుడంటే నగరంలో హోటళ్లు, లాడ్జీలు వెలిశాయి గాని అతిథ్యం ఇంకా వ్యాపారమయం కాని రోజుల్లో ఇతర ప్రాంతాల నుంచి నగరానికి వచ్చిన ప్రయాణికుల అవసరార్థం నాంపల్లి సరాయిని నిర్మించారు. గత 60 ఏళ్ల వరకు అతిథుల కోసం వసతులు అందించిన ఈ భవనం నేడు శిథిలావస్థకు చేరుకుంది.
1910లో భవనం నిర్మాణం ప్రారంభం
ఆరో నిజాం హయాంలో నాంపల్లి రైల్వే స్టేషన్కు సమీపంలో 1919లో 5,828 చదరపు గజాల (4,873 మీటర్ల) విస్తీర్ణంలో అతిథి గృహాన్ని నిర్మించేందుకు నిర్ణయించారు. కుల, మత, ప్రాంతాలకతీతంగా అవసరమైన వారందరికీ మూడు రోజుల పాటు ఉచితంగా భోజనం, వసతులు సదుపాయాన్ని అందిచాలనే లక్ష్యంతో 1910లో టిప్పుఖాన్ బహదూర్ నాంపల్లి సరాయి నిర్మాణం ప్రారంభించారు. 1919లో టిప్పుఖాన్ సరాయి ప్రారంభమైంది. ఐదో నిజాం మీర్ తహినియత్ అలీఖాన్ కొలువులో రౌతుగా పని చేసే టిప్పుఖాన్ ఆరో నిజాం పాలనాలో మున్సబ్దార్గా పదోçన్నతి పొందాడు. నిజాం మీర్ మహబూబ్అలీ ఖాన్కు అత్యంత ప్రీతిపాత్రుడు కూడా.
1919లో సేవలు షురూ..
1919లో సరాయి భవన పూర్తయ్యింది. దీని సేవలు మొదలయ్యే నాటికి టిప్పుఖాన్ చనిపోయాడు. ఆయన స్మారకంగా ఆ భవనాన్ని టిప్పుఖాన్ సరాయిగా పిలిచేవారు. 1956 అనంతరం టిప్పుఖాన్ సరాయి భవనాన్ని ప్రభుత్వ అతిథి గృహంగా ఉయోగించారు. ప్రస్తుత్తం ఆ భవనం శిథిలావస్థకు చేరింది. టిప్పుఖాన్ సరాయి భవన సేవలు ప్రారంభమై ఈ ఏడాదితో వందేళ్లు పూర్తయ్యాయి.