– హైదరాబాద్‌లో ఆగిపోయిన ప్రాజెక్ట్‌లకు దక్కని ఏఐఎఫ్ నిధులు
– ఆయా ప్రాజెక్ట్‌లు రెరాలో నమోదు కాకపోవటమే కారణం
– ఆగిపోయిన గృహాల సంఖ్య 8,900; విలువ రూ.5,500 కోట్లు
ఆర్థిక మందగమనం, తగ్గిన నిధుల లభ్యత కారణంగా మధ్యలోనే ఆగిపోయిన గృహ నిర్మాణ ప్రాజెక్ట్‌లకు మోక్షం కల్పించే ప్రత్యామ్నాయ పెట్టుబడి నిధి (ఏఐఎఫ్)లో హైదరాబాద్‌కు వాటా లేదు. కేంద్రం రూ.25 వేల కోట్ల ఏఐఎఫ్‌లో.. తొలి దశలో రూ.10 వేల కోట్ల ప్రకటించింది. భాగ్యనగరానికి చిల్లిగవ్వ కూడా దక్కడం లేదు. కారణం.. తెలంగాణలో రెరా నమోదు గడువు నిబంధనే!
తెలంగాణలో 2017, జనవరి 1 తర్వాత అనుమతి పొందిన ప్రాజెక్ట్‌లు మాత్రమే రెరాలో నమోదు చేసుకోవాలి. 2017, అంతకంటే ముందు ఉన్న నిర్మాణంలోని, ఆగిపోయిన ప్రాజెక్ట్‌లకు రిజిస్ట్రేషన్‌కు చోటు కల్పించలేదు. మరి ఏఐఎఫ్ విషయంలో కేంద్రం షరతేంటంటే.. నిధులను వినియోగించుకోవాలంటే ఆయా ప్రాజెక్ట్ రెరాలో నమోదు కావాల్సిందే. దీంతో హైదరాబాద్‌లో 2007 కంటే ముందు ప్రారంభమై.. మధ్యలో ఆగిపోయిన ప్రాజెక్ట్‌లు ఉన్నా సరే రెరాలో నమోదు కాలేదు కాబట్టి.. ఏఐఎఫ్ నిధులు దక్కే అవకాశం లేకుండా పోయింది. రెరా నిబంధనల అమలు విషయంలో కేంద్రం, తెలంగాణ ప్రభుత్వాల మధ్య సారుప్యత లేకపోవటం వల్లే నిజమైన గృహ కొనుగోలుదారులకు న్యాయం జరగడం లేదని యార్డ్స్ అండ్ ఫీట్ ప్రాపర్టీ కన్సల్టెంట్స్ ఎండీ కళిశెట్టి నాయుడు అన్నారు. తెలంగాణ రెరా పాలసీ విధానాన్ని మార్చాల్సిన అవసరం ఉందని, అప్పుడే రాష్ట్రంలో మధ్యలోనే ఆగిపోయిన ప్రాజెక్ట్‌లను పూర్తి చేసేందుకు ఏఐఎఫ్ నిధులు అందుతాయని పేర్కొన్నారు.
హైదరాబాద్‌లో 8,900 గృహాలు..
నిధుల మళ్లింపు, రుణ లభ్యత తగ్గిపోవటం, వడ్డీలు పెరిగిపోవటం, నిర్మాణ వ్యయం పెరగడం, నిర్వహణ సక్రమంగా లేకపోవటం వంటి కారణాలతో ప్రాజెక్ట్‌లు నిర్మాణాలు ఆగిపోతాయి. దేశంలోని ఏడు ప్రధాన నగరాల్లో 2013, అంతకంటే ముందు ప్రారంభమై.. మధ్యలోనే ఆగిపోయిన గృహాలు 5,75,900 ఉంటాయని, వీటి విలువ రూ.4,64,300 కోట్లు ఉంటుందని అనరాక్ ప్రాపర్టీ కన్సల్టెంట్స్ తెలిపింది. హైదరాబాద్ విషయానికొస్తే.. 2013, అంతకంటే ముందు ప్రారంభమైన గృహాలు 8,900 ఉన్నాయని, వీటి విలువ రూ.5,500 కోట్లని పేర్కొంది.
ప్రారంభమైంది 2007లో.. అందజేసింది నలుగురికి!
తెల్లాపూర్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, కోకాపేట వంటి ప్రాంతాల్లో ఏలియన్స్, ఆదిత్య కన్స్ట్రక్షన్స్, లోధా వంటి నిర్మాణ సంస్థల ప్రాజెక్ట్‌లు 2007లో ప్రారంభమై.. నేటికీ కొనసాగుతున్నాయని, ఆయా ప్రాంతాల్లో సుమారు 23 ప్రాజెక్ట్‌లు, 2,500 యూనిట్లుంటాయని ఫోరం ఫర్ పీపుల్స్ కలెక్టివ్ ఎఫోర్ట్స్ (ఎఫ్‌పీసీఈ) వైస్ ప్రెసిడెంట్ బీటీ శ్రీనివాసన్ తెలిపారు. ‘‘2007లో తెల్లాపూర్‌లో 11.27 ఎకరాల్లో ఏలియెన్స్ స్పేస్ స్టేషన్ ప్రాజెక్ట్‌ను ప్రారంభించింది. 13 టవర్లలో మొత్తం 2208 గృహాలు. ఇందులో సుమారు 900 ఫ్లాట్లను విక్రయించేసింది కూడా. వీటి విలువ సుమారు రూ.350 కోట్ల పైమాటే. 2011లో కొనుగోలుదారులకు అందజేయాల్సిన ఈ ప్రాజెక్ట్ నేటికీ పూర్తి కాలేదు. ప్రస్తుతం ఒక్క టవర్‌లో 169 గృహాలు నిర్మాణ దశలో ఉన్నాయని.. ఇప్పటివరకు నలుగురికి అందజేశారని’’ ఏలియెన్స్ స్పేస్ స్టేషన్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యుడు ఎస్జీ రావు తెలిపారు.
జీఎస్టీని మినహాయించాలి..
గృహ నిర్మాణ రంగంలో పూర్వ వైభవం, కొనుగోలుదారులకు భరోసా కల్పించాలంటే ప్రభుత్వం కేవలం ఏఐఎఫ్ ఫండ్‌ను మాత్రమే కేటాయిస్తే సరిపోదని అనరాక్ ప్రాపర్టీ కన్సల్టెంట్స్ చైర్మన్ అనూజ్ పూరీ అభిప్రాయపడ్డారు. ఏఐఎఫ్ ప్రాజెక్ట్‌ల్లో కొనుగోళ్ల మీద జీఎస్టీని ఎత్తేయాలని, లేకపోతే కనీసం 6 నెలల పాటు మినహాయించాలన్నారు. అలాగే నిర్మాణంలోని ప్రాజెక్ట్‌లకు 70 శాతం ఎస్క్రో అకౌంట్ డిపాజిట్ నిబంధనలను తీసేయాలని సూచించారు. ఆగిపోయిన ప్రాజెక్ట్‌లను పూర్తి చేసేందుకు ప్రైవేట్ వ్యక్తులకు అవకాశం కల్పించడంతో పాటూ అదనపు ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్ (ఎఫ్ఎస్ఐ), పన్ను రాయితీలను కల్పించాలని కోరారు.
డెవలపర్లు ట్రస్ట్‌ను ఏర్పాటు చేసుకోవాలి..
ఆర్థిక సంక్షోభంతో మధ్యలోనే ఆగిపోయే ప్రాజెక్ట్‌లను పూర్తి చేసేందుకు విదేశాల్లో మాదిరిగా మన దేశంలోనూ డెవలపర్లు ప్రత్యేకంగా ట్రస్ట్, ఫండ్‌ను ఏర్పాటు చేసుకోవాలని క్రెడాయ్ నేషనల్ మాజీ ప్రెసిడెంట్ సి. శేఖర్ రెడ్డి సూచించారు. ప్రతి ప్రాజెక్ట్‌కు చ.అ.కు రూ.25–50 వరకు ఈ ట్రస్ట్‌లో జమ చేయాలి. అత్యవసర పరిస్థితుల్లో ఈ నిధులను వినియోగించుకోవచ్చు. ఈ ట్రస్ట్‌కు కూడా రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ (రీట్స్) తరహా రాయితీలు కల్పిస్తే.. ప్రతి డెవలపర్ ముందుకొస్తాడు. దీంతో ప్రభుత్వమో, బ్యాంక్‌లో ఫండ్‌ను సమకూర్చాల్సిన అవసరం ఉండదు.