Prapancha Telugu

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  info@prapanchatelugu.com

కంటోన్మెంట్‌లో అటకెక్కిన స్కైవేలు

స్ట్రాటజిక్‌ రోడ్స్‌ డెవపల్‌మెంట్‌ ప్రాజెక్టు (ఎస్‌ఆర్‌డీపీ)లో భాగంగా కంటోన్మెంట్‌లో ప్రతిపాదిత స్కైవేల నిర్మాణం డోలాయమానంలో పడిపోయింది. బైసన్‌పోలో మైదానంలో సెక్రెటేరియెట్‌ నిర్మాణ ప్రతిపాదనను రాష్ట్ర ప్రభుత్వం విరమించుకోవడంతో, ఈ ప్రాజెక్టుతో ముడిపడి ఉన్న స్కైవేల ప్రతిపాదన కూడా అటకెక్కింది. రక్షణ శాఖ భూములను బదలాయించేందుకు సంబంధిత అధికారులు అంగీకారం తెలిపినప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వం అనూహ్యంగా తన నిర్ణయాన్ని మార్చుకోవడం గమనార్హం. భూబదలాయింపునకు సంబంధించి రక్షణ శాఖ ప్రతిపాదనలకు రాష్ట్ర ప్రభుత్వ ఆమోదం తెలుపని కారణంగానే, మూడేళ్లుగా ఈ అంశంపై స్తబ్దత కొనసాగుతూ వచ్చిందని కంటోన్మెంట్, డిఫెన్స్‌ అధికారులు పేర్కొంటున్నారు.
మూడేళ్ల క్రితమే జాయింట్‌ సర్వే..
కంటోన్మెంట్‌ పరిధిలోని బైసన్‌ పోలో, జింఖానా మైదానాల్లో సెక్రెటెరియెట్‌ ఇతర ప్రభుత్వ భవనాలు నిర్మించాలని రాష్ట్రప్రభుత్వం భావించింది. ఎస్‌ఆర్‌డీపీలో భాగంగా రాజీవ్‌ రహదారిపై ప్యాట్నీ నుంచి హకీంపేట వరకు, నేషనల్‌ హైవే–44పై ప్యారడైజ్‌ నుంచి సుచిత్ర వరకు రెండు స్కైవేలు నిర్మించాలని కూడా నిర్ణయించింది. ఈ మేరకు రక్షణ భూములను తమకు బదలాయించాల్సిందిగా 2015లోనే  ముఖ్యమంత్రి కే.చంద్రశేఖరరావు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. అప్పటి రక్షణ శాఖ మంత్రి అరుణ్‌జైట్లీ సూత్రప్రాయ అంగీకారం తెలిపారు. దీంతో కేంద్ర రక్షణ శాఖ పరిధిలోని లోకల్‌ మిలటరీ అథారిటీస్‌ (ఎల్‌ఎంఏ), కంటోన్మెంట్, డిఫెన్స్‌ ఎస్టేట్స్, రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని ఆర్‌ అండ్‌ బీ, జీహెచ్‌ఎంసీ విభాగాల నుంచి 5గురు చొప్పున అధికారులతో కూడిన బోర్డ్‌ ఆఫ్‌ ఆఫీసర్స్‌ కమిటీ నియామకం జరిగింది. ఈ కమిటీ 2016లో జాయింట్‌ సర్వే నిర్వహించి భూబదలాయింపునకు సంబంధించిన నివేదిక రూపొందింది.
151 ఎకరాలు కావాలన్న రాష్ట్రప్రభుత్వం..
సెక్రెటేరియెట్‌ కోసం 33 ఎకరాల బైసన్‌ పోలో, 28 ఎకరాల జింఖానా మైదానాల్ని ఇవ్వాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం కోరింది. దీంతో పాటు ప్యాట్నీ నుంచి హకీంపేట వరకు 11.5 కిలోమీటర్లు, ప్యారడైజ్‌– సుచిత్ర సర్కిల్‌ వరకు 6.6 కిలోమీటర్ల మేర నిర్మించనున్న స్కైవేల కోసం ఆయా రోడ్లను 200 అడుగులకు విస్తరించాలని నిర్ణయించింది. ఈ మేరకు జాయింట్‌ సర్వే చేసిన అధికారుల బందం 90 ఎకరాల రక్షణ భూములు సేకరించాల్సి ఉంటుందని తేల్చింది. ఈ భూములకు బదులుగా రాష్ట్రప్రభుత్వం మేడ్చల్‌ జిల్లా జవహార్‌నగర్‌ సమీపంలో 596 ఎకరాల స్థలం, ఏకమొత్తంగా రూ.95 కోట్లతో పాటు, ప్రతీయేటా కంటోన్మెంట్‌కు రూ.31 కోట్ల సర్వీసు చార్జీలు చెల్లించాలని ఎల్‌ఎంఏ ప్రతిపాదించింది.
సర్వీసు చార్జీల విషయంలోనే పేచీ..
రక్షణ శాఖ కోరినట్లుగా ప్రత్యామ్నాయ స్థలంతో పాటు ఏకమొత్తంలో రూ.95 కోట్లు చెల్లించేందుకు అంగీకరించిన రాష్ట్ర ప్రభుత్వం, సర్వీసు చార్జీలు చెల్లించేది లేదని పేర్కొన్నట్లు సమాచారం. ఇదే విషయాన్ని అప్పటి మున్సిపల్‌ శాఖ మంత్రి, టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ సైతం పలుమార్లు ప్రకటించారు. ఇదిలా ఉండగా 2018 డిసెంబర్‌లో జరిగిన ఎన్నికల్లో మరోసారి సీఎం అయ్యాక డిల్లీ వెళ్లిన కేసీఆర్, రక్షణ భూములను బదలాయించాల్సిందిగా మరోసారి ప్రధాన మంత్రిని కోరారు. ఈ ఏడాది ఫిబ్రవరిలోనూ టీఆర్‌ఎస్‌ ఎంపీలు ప్రధాని నరేంద్రమోడీని కలిసి మరోసారి విన్నవించారు. ఈ క్రమంలో గత నెలలో రాష్ట్ర ప్రభుత్వం సెక్రెటేరియెట్‌ను కంటోన్మెంట్‌కు బదలాయించడం లేదని తేల్చేసింది. దీంతో సెక్రెటేరియెట్‌ కోసం కోరిన బైసన్‌పోలో, జింఖానా మైదానాల బదలాయింపును మినహాయిస్తే, స్కైవేల కోసం కేవలం 90 ఎకరాల రక్షణ భూములు మాత్రమే బదలాయించాల్సి ఉంటుంది. అయితే సెక్రెటేరియెట్‌ను మినహాయించి, స్కైవేల కోసం అవసరమైన భూములకు సంబంధించి బోర్డ్‌ ఆఫీసర్స్‌ కమిటీ మరో ప్రతిపాదన తయారు చేయాల్సి ఉంటుంది. అప్పటి వరకు కంటోన్మెంట్‌ గుండా స్కైవేల ప్రతిపాదన స్తంభించినట్లే.
ఆరు నెలల క్రితం మరోసారి మార్కింగ్‌లు..
ప్రతిపాదిత స్కైవే నిర్మాణానికి సంబంధించి రాజీవ్‌ రహదారి మార్గంలో మూడేళ్ల క్రితమే అధికారులు మార్కింగ్‌ చేశారు. 200 అడుగుల మేర విస్తరణకు అవసరమయ్యేలా రోడ్డుకిరువైపులా ఎంత మేరకు విస్తరించాలో సూచిస్తూ బోర్డులు ఏరాపటు చేశారు. తాజాగా ఆరు నెలల క్రితం మరోసారి ఆయా మార్కింగ్‌ల వద్ద నూతన స్టిక్కర్లు అంటించడం గమనార్హం.

Related Posts

Latest News Updates